ప్రాణం తీసిన School bag

ABN , First Publish Date - 2022-08-17T15:38:33+05:30 IST

రోజూ తను మోసుకెళ్లే బడి బ్యాగే(School bag)! రోజూ తనను తీసుకెళ్లే స్కూలు బస్సే(School bus)!! కానీ ఆ చిన్నారి ప్రాణం తీసేంత భారమైందా బ్యాగ్‌.. ఆ బరువు మోయలేక కిందపడ్డ చిన్ని ప్రాణాన్ని చిదిమేసిందా బస్సు!! యాదాద్రి భువనగిరి

ప్రాణం తీసిన School bag

రోజూ వెళ్లొచ్చే బడి బస్సు కిందే పడి యాదాద్రి జిల్లాలో విద్యార్థి మృతి


చౌటుప్పల్‌ రూరల్‌ అగస్టు 16: రోజూ తను మోసుకెళ్లే బడి బ్యాగే(School bag)! రోజూ తనను తీసుకెళ్లే స్కూలు బస్సే(School bus)!! కానీ ఆ చిన్నారి ప్రాణం తీసేంత భారమైందా బ్యాగ్‌.. ఆ బరువు మోయలేక కిందపడ్డ చిన్ని ప్రాణాన్ని చిదిమేసిందా బస్సు!! యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో మంగళవారం జరిగిందీ విషాదం. జిల్లాలోని వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన పాలకూర గోపాల్‌, నాగమణి దంపతులు చిన్నకొండూర్‌ రోడ్డులోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తనుజ్‌ (7) స్థానిక మల్లికార్జున పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే మంగళవారం కూడా స్కూలుకు వెళ్లాడా బాలుడు. సాయంత్రం స్నేహితులందరితో కలిసి స్కూలు బస్సులో ఆడుతూ పాడుతూ ఇంటికి బయల్దేరాడు. ఇంటికి సమీపంలో బస్సు ఆగగానే దిగబోయాడు. స్కూలు బ్యాగ్‌ ఎంత బరువుందో ఏమో.. దిగేక్రమంలో బ్యాలెన్స్‌ కుదరక కింద పడిపోయాడు. ఇది గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సు చక్రాలు తనుజ్‌ మీదుగా వెళ్లడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం  హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతి చెందాడు. కొద్దిక్షణాల్లో ఇంటికి వచ్చేస్తాడనుకున్న కుమారుడు మృత్యువాతపడటంతో తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు.

Updated Date - 2022-08-17T15:38:33+05:30 IST