Xiaomi and Realme: షిప్‌మెంట్‌లో ఒకటి.. 5జీ సెగ్మెంట్‌లో మరోటి!

ABN , First Publish Date - 2021-07-30T00:55:08+05:30 IST

కరోనా కబళిస్తున్నప్పటికీ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. ఏటికేడు

Xiaomi and Realme: షిప్‌మెంట్‌లో ఒకటి.. 5జీ సెగ్మెంట్‌లో మరోటి!

న్యూఢిల్లీ: కరోనా కబళిస్తున్నప్పటికీ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. ఏటికేడు వీటి షిప్‌మెంట్ భారీగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ దేశంలో 82 శాతం పెరిగి 33 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. మొత్తం వాటాలో 28.4 శాతం వాటా కలిగిన షియోమీ మార్కెట్ లీడర్‌గా నిలిచినట్టు ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్‌ పాయింట్’ తెలిపింది.


18 శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ రెండోస్థానంలో ఉంది. 15 శాతం వాటా దక్కించుకున్న వివో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది తొలి అర్ధభాగంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ భారీగా నమోదైనట్టు ‘కౌంటర్ పాయింట్’ విడుదల చేసిన రెండో త్రైమాసిక స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ నివేదిక వెల్లడించింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గనప్పటికీ ఈ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


భారత్‌లో రియల్‌మీ అత్యంత వేగంగా 50 మిలియన్ల షిప్‌మెంట్స్‌ను సొంతం చేసుకుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లో 23 శాతం షిప్‌మెంట్స్‌తో రియల్‌మి దేశంలో అగ్రగామిగా ఉంది. వన్‌ప్లస్ సారథ్యంలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ (రూ. 30 వేల పైన) 34 శాతం షేర్ సొంతం చేసుకున్నట్టు కౌంటర్ పాయింట్ తెలిపింది. అయితే, కరోనా కారణంగా మార్కెట్ 14 శాతం క్షీణిచిందని పేర్కొంది. అయినప్పటికీ ఊహించిన దానికంటే ఇది తక్కువేనని వివరించింది.

 

లాక్‌డౌన్ కారణంగా ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటల్ బాగా దెబ్బతిన్నట్టు కౌంటర్‌పాయింట్ తెలిపింది. మరీ ముఖ్యంగా ఏప్రిల్-మే మధ్య అందరూ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే షాపింగ్ చేశారని, షియోమి, రియల్‌మి వంటి ఆన్‌లైన్-సెంట్రిక్ బ్రాండ్స్‌ను ఎంచుకున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌ మొత్తం షిప్‌మెంట్స్‌లో 79 శాతం చైనీస్ బ్రాండ్లదే కావడం గమనార్హం.


షియోమీ రెడ్‌మి 11, రెడ్‌మి 9, రెడ్‌మి 10 సిరీస్‌లు బాగా అమ్ముడుపోయాయి. శాంసంగ్‌లో గెలాక్సీ ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి ఐదు బ్రాండ్లలో రెడ్‌మివే నాలుగు ఉండడం విశేషం. గత మూడు క్వార్టర్లుగా రెడ్‌మి 9ఎ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. షియోమి సబ్‌బ్రాండ్ పోకో షిప్‌మెంట్స్‌లో ఏటికేడు 480 శాతం వృద్ధి సాధించింది.

Updated Date - 2021-07-30T00:55:08+05:30 IST