షావోమి హెడ్‌బ్యాండ్‌. మెదడును చదివేస్తుంది

ABN , First Publish Date - 2022-08-12T09:08:00+05:30 IST

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ షావోమి.. మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే హెడ్‌బ్యాండ్‌ను రూపొందించబోతున్నట్లు ప్రకటించింది.

షావోమి హెడ్‌బ్యాండ్‌. మెదడును చదివేస్తుంది

మనం అనుకున్న పనిని చేసేస్తుంది

స్మార్ట్‌ పరికరాలను నియంత్రిస్తుంది

షావోమి డెవలపర్ల పరిశోధన


బీజింగ్‌, ఆగస్టు 11: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ షావోమి.. మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే హెడ్‌బ్యాండ్‌ను రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ పేరుతో దీన్ని రూపొందిస్తున్నామని, ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) పరిజ్ఞానంతో పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఇంట్లో ఉండే స్మార్ట్‌ పరికరాలు-- టీవీ, లైట్‌, ఫ్యాన్‌ తదితరాలను ఈ హెడ్‌బ్యాండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ మాదిరిగా నియంత్రిస్తుంది. అందుకు మాన్యువల్‌గా కమాండ్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగని.. స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్ల ఆధారంగా నియంత్రించాల్సిన పనిలేదు. కేవలం మనిషి ఆలోచనతో ఈ హెడ్‌బ్యాండ్‌ ఆయా పరికరాలను నియంత్రిస్తుంది.


క్కమాటలో చెప్పాలంటే.. ఈ హెడ్‌బ్యాండ్‌ పెట్టుకున్న ఇంటి యజమాని.. ‘‘గాలి తక్కువగా వస్తోంది.. కొంచెం ఫ్యాన్‌ వేగం పెరగాలి’’ అని తలుచుకుంటే చాలు.. స్మార్ట్‌ ఫ్యాన్‌ వేగం పెరుగుతుంది. అదేవిధంగా.. స్మార్ట్‌ బల్బ్‌లను నియంత్రించవచ్చు. ‘‘బెడ్‌రూంలోని బల్బ్‌ రంగు ముదురు ఆకుపచ్చకు మారి, వెలుతురు 10శాతానికి తగ్గాలి..’’ అని అనుకున్నదే తడవుగా.. ఈ హెడ్‌బ్యాండ్‌ ఆ మేరకు సంబంధిత బల్బ్‌ను నియంత్రించేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి స్మార్ట్‌ పరికరాలను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ల ద్వారా గృహోపకరణాలను నియంత్రించవచ్చు. ఇప్పుడు అదే పనిని యూజర్ల ఆలోచనలకు అనుగుణంగా చేసిపెట్టేలా ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ను తమ ఇంజనీర్లు రూపొందిస్తున్నారని షావోమి వివరించింది. ‘‘ఈ హెడ్‌బ్యాండ్‌ ద్వారా మెదడు సిగ్నళ్లను అందుకునేందుకు, యూజర్‌ ఎలకో్ట్ర ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) వేవ్‌ఫామ్స్‌ చదివేందుకు సెన్సర్లుంటాయి. యూజర్ల మూడ్‌ ఆధారంగా.. ఎమోషన్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్‌ఫామ్స్‌ను హెడ్‌బ్యాండ్‌లోని ఆర్టిఫిషియల్‌ లేబుల్డ్‌ మెషీన్‌ గ్రహిస్తుంది. వాటి ఆధారంగా మనిషి ఆలోచనలను ఈ హెడ్‌బ్యాండ్‌ అమలు చేస్తుంది’’ అని వివరించారు. ఈ కాన్సెప్ట్‌ తమ కంపెనీ మూడో వార్షిక ఆన్‌లైన్‌ హాకథాన్‌లో విజేతగా నిలిచిందని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-12T09:08:00+05:30 IST