చైనాపై మరింత పట్టు పెంచుకున్న జీ జిన్‌పింగ్

ABN , First Publish Date - 2021-11-12T00:10:23+05:30 IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ముచ్చటగా మూడోసారి ఆ

చైనాపై మరింత పట్టు పెంచుకున్న జీ జిన్‌పింగ్

బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ముచ్చటగా మూడోసారి ఆ పదవిని చేపట్టేందుకు బాటలు పరిచే ఓ చారిత్రక తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం ఆమోదించింది. పార్టీ చరిత్ర, జిన్‌పింగ్ హోదాను బలోపేతం చేయడం గురించి ఈ తీర్మానం పేర్కొంది. దీంతో ఆయన మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్ తర్వాత శక్తిమంతుడైన నేతగా పట్టు పెంచుకున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే సీపీసీ 20వ కాంగ్రెస్‌‌ సమావేశంలో ఆయనకు మూడోసారి దేశాధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. 


ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన డెంగ్ జియావోపింగ్ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా జీ జిన్‌పింగ్ ఎదగడానికి ఈ తీర్మానం దోహదపడుతుంది. చైనా ప్రభుత్వ మీడియా గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, నాలుగు రోజులపాటు  బీజింగ్‌లో గోప్యంగా జరిగిన సీపీసీ 6వ ప్లీనరీ సమావేశంలో 348 మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ హై ప్రొఫైల్ సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో అత్యంత చారిత్రక తీర్మానాన్ని ఆమోదించారు. సీపీసీ 100 సంవత్సరాల కృషి, సాధించిన విజయాల గురించి ఈ తీర్మానం ప్రస్తావించింది. ఇటువంటి తీర్మానాలు 1945లో మావో జెడాంగ్ హయాంలోనూ, 1981లో డెంగ్ జియావోపింగ్ హయాంలోనూ ఆమోదం పొందాయి. వీటి ద్వారా ఆ నేతలిద్దరూ చైనాలో, సీపీసీలో తమ పాత్రను బలోపేతం చేసుకున్నారు. 


దేశాధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి రెండు పదవీ కాలాలకు మించి చేపట్టరాదనే నిబంధనను  2018 మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (చైనా పార్లమెంటు) సమావేశంలో ఆమోదించిన తీర్మానం ద్వారా తొలగించారు. దీంతో జీ జిన్‌పింగ్ జీవితాంతం దేశాధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. 


Updated Date - 2021-11-12T00:10:23+05:30 IST