‘ఎక్స్‌ఈ’ వైరస్‎తో ముప్పు తక్కువే

ABN , First Publish Date - 2022-04-24T16:38:28+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగే వార్త చెప్పింది. ప్రపంచంలో తాజాగా ప్రబలుతున్న ‘ఎక్స్‌ఈ’ వైరస్‌

‘ఎక్స్‌ఈ’ వైరస్‎తో ముప్పు తక్కువే

- 87 శాతం మందికి పెరిగిన వ్యాధి నిరోధక శక్తి

- ఐఐటీలో 55కు పెరిగిన కొవిడ్‌ కేసులు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగే వార్త చెప్పింది. ప్రపంచంలో తాజాగా ప్రబలుతున్న ‘ఎక్స్‌ఈ’ వైరస్‌ రాష్ట్రంలో ప్రవేశించలేదని, అయినా ఈ వైరస్ తో బాధింపులు తక్కువేనని రాష్ట్రప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఒకటి, రెండు అలల అనంతరం కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వచ్చింది. కానీ, ఈ నెల 11వ తేదీ నుంచి హఠాత్తుగా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, చెన్నై ఐటీఐలో మూడు రోజుల కాలంలో 55 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్రప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. మరోవైపు ఆరోగ్యశాఖ రానున్న విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కరోనా నియంత్రణలోకి రావడంతో ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న బాధితుల సంఖ్య తగ్గడంతో మూసివేసిన కరోనా వార్డులను తిరిగి సిద్ధం చేయడం, అవసరమైన వైద్యపరికరాలు, ఆక్సిజన్‌ తదితరాలను నిల్వ ఉంచుకోవాలని ఆదేశించడంతో పాటు వైద్యులు, నర్సులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


ఐఐటీలో 55కు పెరిగిన కొవిడ్‌ కేసులు

మద్రాస్‌ ఐఐటీలో కొవిడ్‌ కేసుల సంఖ్య 55కు పెరిగింది. ఈ నెల 19న ఐఐటీలో తొలికేసు నమోదుకాగా, మరుసటిరోజు మరో 12 కేసులు, శుక్రవారం మరో 18 కేసులు అని 30 కేసులు నమోదయ్యాయి. దీంతో, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అని మొత్తం 1,470 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో 25 కేసులు నిర్ధారణ కావడంతో, ఐఐటీలో కొవిడ్‌ కేసుల సంఖ్య 55కు పెరిగింది. శనివారం కళాశాల ప్రాంగణాన్ని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐఐటీలో వెలుగుచూసిన కొవిడ్‌ బాధితులకు స్వల్ప లక్షణాలుండడంతో వారిని ఆ ప్రాంగణంలోనే క్వారంటైన్‌లో ఉంచామన్నారు. అవసరమైతే వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఎక్స్‌ఈ’ వైరస్‌ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా బాధితుల రక్తనమూనాలను పరిశోధనకు పంపామని తెలిపారు. ప్రజలు మాస్క్‌ ధరించకపోవడం కూడా కరోనా వ్యాప్తికి కారణంగా ఉందన్నారు. అందువల్లే బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించని వారికి రూ.500 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీచేశామని తెలిపారు. అలాగే, మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కూడా చేపట్టనున్నట్లు, టీకా వేసుకోని వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


87 శాతం మందికి పెరిగిన వ్యాధి నిరోధక శక్తి

రాష్ట్రంలో టీకా వేసుకున్న 87 శాతం మందిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రూపాంతరం చెందిన ఎక్స్‌ఈ వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తోందని, దేశంలో ఆ రకం వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలున్న వారికి ఆసుపత్రిలో చికిత్సలు అందించాల్సిన అవసరం లేదని, వారం రోజులు జాగ్రత్తలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉంటేచాలని పేర్కొంది. అవసరమైన వారికి మెరుగైన చికిత్సలందించేలా ప్రభుత్వాసుపత్రులను సిద్ధం చేశామని తెలిపింది. ఈ వైరస్‌ వల్ల బాధింపులు తక్కువగా ఉంటాయని, కానీ ప్రజలు మాత్రం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితరాలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-04-24T16:38:28+05:30 IST