రాసిచ్చేశారు..!?

ABN , First Publish Date - 2022-05-09T06:09:14+05:30 IST

వాళ్లకు ప్రభుత్వం తమ సొంతం అనిపించింది.

రాసిచ్చేశారు..!?
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి

దేవనకొండ మండలంలో ప్రభుత్వ భూములకు ఎసరు

రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదు

158 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన  ఓ రెవెన్యూ అధికారి 

రూ.లక్షలు చేతులు మారిన వైనం

ఆ భూముల విలువ రూ.15-20 కోట్ల పైమాటే


వాళ్లకు ప్రభుత్వం తమ సొంతం అనిపించింది. ప్రభుత్వ ఆస్తులు కాజేయడానికి మోమాటపడలేదు. అఽధికార పార్టీ నాయకులు రివెన్యూ అధికారులతో కుమ్కక్కై ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేసుకొని రూ. కోట్ల విలువైన భూములు కాజేశారు. పబ్లిక్‌ సర్వెంట్‌ అయిన సదరు రెవెన్యూ అధికారి వైసీపీ నాయకులకు సేవ చేయడమే విద్యుక్త ధర్మం అనుకున్నారు. ఇంకేముంది?  ఏకంగా 158 ఎకరాలు  అధికార వైసీపీ నాయకులు, వారి బినామీల పేర్ల మీదికి మారిపో యాయి. ఈ భూముల విలువ రూ.15-20 కోట్లు ఉంటుందని అంచనా.


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): దేవనకొండ మండలం గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లో వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎక్కువగా కొండలే. వర్షాకాలంలో రైతులు అక్కడే పశువులు, గొర్రెలు మేపుకుంటారు. గుండ్లకొండ గ్రామంలో సర్వే నెంబరు 430 -1వై పరిధిలో 35 ఎకరాలు, 430-1జడ్‌ఏ పరిధిలో 63 ఎకరాలు, 430-1జడ్‌ పరిధిలో 40 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. వెలమకూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని 333-5 పరిధిలో 20 ఎకరాలు ఉన్నాయి. ఈ మొత్తం 158 ఎకరాలు గ్రామాలకు దగ్గరిలో ఉండటంతో భారీగా డిమాండ్‌ ఉంది. రెవెన్యూ రికార్డుల్లోని పట్టాదారుని పేరు, అనుభవదారుడి పేరు కాలంలో ప్రభుత్వ మిగులు భూములు అని, సాగుకు పనికి వచ్చే భూములని నమోదు చేశారు. అయితే తాతల కాలం నుంచి ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని, ఇప్పటిదాకా ఎవరికీ డీకేటీ పట్టాలు కూడా ఇవ్వలేదని అదే మండలంలోని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. 


కన్నేశారు.. కబ్జా చేశారు


ఈ ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నాయకులు కొందరు కన్నేశారు. రికార్డులు లేకుండా కబ్జా చేస్తే సమస్యలు వస్తాయని భావించి పక్కా ప్రణాళికతో తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి ఓ రెవెన్యూ అధికారితో కుమ్మక్కై చేతులు కలిపారు. రెవెన్యూ ఆన్‌లైన్‌ రికార్డుల్లో తమ పేర్లను, మ సన్నిహితుల పేర్లను చేర్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అడంగల్‌ రికార్డులో కాలం 12, 13లో పట్టాదారు, అనుభవదారు పేరు కింద మిగులు భూములు అని ఉంటే.. ఇప్పుడు ఆ కాలంలో కొందరు అక్రమార్కుల పేర్లు నమోదయ్యాయి. కాలం 14లో అనుభవ విస్తీర్ణం కింద ఒకరికి 4.35 ఎకరాలు చూపించారు. కాలం 15లో అనుభవ స్వభావం కింద అనుభవదారుడు అని చూపించారు. ఇట్లా అధికార పార్టీ నాయకులు ఓ కీలక రెవెన్యూ అధికారి కుమ్మక్కై సుమారు 158 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. ఈ విషయం తెలిసిన ఒకరు గత నెల 18న సర్వే నంబర్లు 430-1వై, 430-1జడ్‌ఏ, 430-1జడ్‌, 333-5 పరిధిలోని భూ రికార్డులను ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఈ వ్యవహారమంతా బట్టబయలైంది. ఇట్లా రికార్డులను అక్రమంగా మార్చడానికి రూ.లక్షల నగదు చేతులు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


సీఎంవోకు ఫిర్యాదు


పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌ డీడ్‌, ఆర్‌వోఆర్‌.. వంటి రికార్డులు పక్కాగా ఉండి.. ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో విస్తీర్ణం, సర్వే నంబర్లు తేడా, పట్టాదారు పేరులో మార్పు, పట్టా భూమి స్థానంలో ప్రభుత్వ భూమి.. వంటి పొరపాట్లు సరి చేసుకోవడానికి రైతులు తహసీల్దారు కార్యాలయాలు చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి ఉంటుంది. అయినా రెవెన్యూ అధికారులు స్పందించరు. లేనిపోని కొర్రీలు పెడుతూ కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటారు. అలాటి అధికారులు ఏకంగా 158 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులపరం చేస్తూ ఆన్‌లైన్‌ రికార్డులనే మార్చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి కొందరు అధికారులు రూ.5-10 వేలకు పైగా డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఎకరం రూ.5-10 లక్షలకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం వెనుకు భారీ మొత్తంలో నగదు చేతులు మారి ఉంటాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ భూ దందాపై స్థానికులు సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీఎంఓ కార్యాలయం అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో మేల్కొన్న మండల రెవిన్యూ అధికారులు సదరు వ్యక్తుల పేర్లు తొలగించి.. పట్టాదారు కాలంలో మిగులు భూములుగా చూపించినట్లు తెలుస్తోంది. చేతిలో డిజిటల్‌ కీ పవర్‌ చేతిలో ఉన్నందు వల్ల ఆన్‌లైన్‌ భూమి రికార్డులు ఇష్టారాజ్యంగా మార్చేశారనే విమర్శలకు తావిస్తోంది.


ఎవరి పేరున ఎన్నెన్ని ఎకరాలు


గుండ్లకొండ గ్రామం సర్వే నంబరు 430-1వై పరిధిలో కె.నరసింహులు, కె.ఆదినారాయణ, కుంబగండి చిన్నసిద్ధ్దప్ప, మంగన్న, కుంబగండి నాగరాజు, కె.లలిత, కె.గాదిలింగమ్మ, కె.లక్ష్మమ్మ పేర్లతో ఒక్కొక్కరికి 4.35 ఎకరాల చొప్పున 35 ఎకరాలు ఆన్‌లైన్‌లో మార్చేశారు. ఖాతా నంబరు 2859 నుంచి 2866 ఇచ్చారు. 

సర్వే నెంబరు 430-1జడ్‌ఏ పరిధిలో బి.ఉమాదేవి, బి.సుశీల, యూ. జయమ్మ, వీరేష్‌, బి.జనార్దన్‌రెడ్డి, మహాలక్ష్మి, లక్ష్మీదేవి, టి.వనిత, హెచ్‌.మీనాక్షి, ఎం.సంధ్య, బి.లక్ష్మి, బి.లక్ష్మి, ఆశన్న, చెల్లెమ్మ, హెచ్‌.బాలన్న, కె.శ్రావణి పేర్లపైన కొందరికి రెండు ఎకరాలు, కొందరికి 4 ఎకరాలు, ఒకరికి 4.50 ఎకరాలు చొప్పున ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఖాతా నంబరు వరుసగా 2877 నుంచి 2893 వరకు ఇచ్చారు.

సర్వే నంబరు 430-1జడ్‌ పరిధిలో ఎ.లక్ష్మి, కె.పెద్ద సిద్దప్ప, వై.లక్ష్మి, బి.నరసప్ప, బి.కుబేంద్రారెడ్డి, మమత, సుధాకర్‌రెడ్డి, బి.ధనలక్ష్మి, కె.పెద్ద రంగన్న, పి.ఉశేనమ్మ పేర్లపై 4.00 ఎకరాలు చొప్పున ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేశారు. ఖాతా నంబరు సరుసగా 2867 నుంచి 2876 వరకు ఇచ్చారు.

వెలమకూరు గ్రామంలో సర్వే నంబరు 333-5 పరిధిలో హెచ్‌.సుశీల, రంగలక్ష్మి, జి.లక్ష్మి, హెచ్‌.లలిత, జి.లింగప్ప, ఎం.రాజమ్మ, హెచ్‌.సులోచన పేర్లపై ఒక్కొక్కరికి 1.50 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు నమోదు చేశారు. వీరికి ఖాతా నంబర్లు చివరి నుంచి 5439 నుంచి 5445 వరకు ఇచ్చారు. 

ఈ భూములను ఒకే కుటుంబంలోని ఇద్దరు ముగ్గురు పేర్లపై నమోదు నమోదు చేశారు. వీరిలో కొందరు బినామీలకు తమ పేరు మీదికి ప్రభుత్వ భూమిని మార్చారనే విషయం కూడా కొందరికి తెలియదని సమాచారం. ఇవే సర్వే నంబర్లలో భూముల రికార్డులను ఈ నెల 4న మీ భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే ప్రైవేటు వ్యక్తుల పేర్లు తొలగించి మిగులు భూమిగా చూపించినట్లు తెలిసింది. సీఎంవో ఆఫీసు నుంచి విచారణ మొదలు కాగానే ఇలా మార్చేశారని సమాచారం. 


కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేసిన పొరపాటు


కంప్యూటర్‌ ఆపరేటర్‌ డిజిటల్‌ కీ దుర్వినియోగం చేసి గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌లో ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదికి మార్చాడు. ఈ విషయం తెలియగానే అతడ్ని తొలగించాను. రికార్డుల్లో వ్యక్తుల పేర్లు తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేశాం.


 - ఇంద్రాణి, తహసీల్దారు, దేవనకొండ 


విచారణ చేయిస్తా

దేవనకొండ మండలం గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు మీదికి నమోదు చేశారనే విషయం నా దృష్టికి వచ్చింది. రెండు మూడు రోజుల్లో సమగ్రంగా విచారించి ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తాను. 


- మోహన్‌దాస్‌, ఆర్డీవో, పత్తికొండ

Read more