కరోనా వ్యాప్తిని మైనారిటీలకు ముడిపెట్టడం తప్పు: అమెరికా

ABN , First Publish Date - 2020-04-03T19:16:53+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిపై మైనారిటీ మతాలను నిందించడం తప్పే అవుతుందని అమెరికా వ్యాఖ్యానించింది...

కరోనా వ్యాప్తిని మైనారిటీలకు ముడిపెట్టడం తప్పు: అమెరికా

వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తిపై మైనారిటీ మతాలను నిందించడం తప్పే అవుతుందని అమెరికా వ్యాఖ్యానించింది. కోవిడ్-19పై ప్రపంచ దేశాలు పరస్పరం నిందించుకోవడం మానుకోవాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలనీ.. ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి ఇరాన్, చైనాల్లోని మత ఖైదీలను విడుదల చేయాలని లార్జ్ అంతర్జాతీయ మతస్వేచ్ఛ (ఐఆర్ఎఫ్) సంస్థలో అమెరికా రాయబారి శామ్ బ్రౌన్‌బ్యాక్ ఆయా మత సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే మత ఖైదీల గురించి తాను అడగడం లేదనీ... ఉగ్రవాదంతో సంబంధంలేని మత ఖైదీలనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైనారిటీల్లో కోవిడ్-19 వ్యాప్తిపై పాత్రికేయులతో జరిపిన ఓ కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా బ్రౌన్‌బ్యాక్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తమ దేశాల్లోని అన్ని మైనారిటీ వర్గాలతో కలిసి ప్రభుత్వాలు పనిచేయాలనీ... వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని ఆయన కోరారు. కాగా తన సిక్కు మతానికి చెందిన ప్రతినిధులతో కూడా తాము సమావేశం అవుతున్నామనీ... కాబూల్‌లోని ఓ గురుద్వారాపై ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై చర్చిస్తున్నామని బ్రౌన్‌బ్యాక్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T19:16:53+05:30 IST