మంత్రులు ప్రచారం చేసినా తప్పని ఓటమి

ABN , First Publish Date - 2020-12-05T09:14:04+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మైండ్‌గేమ్‌ పాచిక పారలేదు. సర్వశక్తులు ఒడ్డి.. అస్త్రశస్త్రాలను సంధించినా లక్ష్యాన్ని చేరలేదు. 100

మంత్రులు ప్రచారం చేసినా తప్పని ఓటమి

తలసాని ఇలాకాలో ఐదింటికి రెండే డివిజన్లలో గెలుపు..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యతలు తీసుకున్నచోటా అంతే


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మైండ్‌గేమ్‌ పాచిక పారలేదు. సర్వశక్తులు ఒడ్డి.. అస్త్రశస్త్రాలను సంధించినా లక్ష్యాన్ని చేరలేదు. 100 సీట్లు సాధిస్తామని బల్లగుద్ది చెప్పి బరిలోకి దిగిన అధికార పక్షం వ్యూహం ఫలించలేదు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు పార్టీ నేతలను డివిజన్‌ ఇన్‌చార్జులుగా నియమించి ప్రచారాన్ని హోరెత్తించినా అనుకున్న ఫలితం దక్కలేదు. డివిజన్ల వారీగా ప్రత్యేకతల్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసి.. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వల్లె వేసినా ఓటరు పూర్తిగా ఆదరించలేదు.


ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీనివా్‌సగౌడ్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరించిన డివిజన్లలో గెలుపును సాధించలేకపోయారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, పసునూరు దయాకర్‌ ఇన్‌చార్జులుగా ఉన్న డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉన్న డివిజన్లలోనూ అధికారపక్ష అభ్యర్థులు ఎక్కువగా ఓటమి చెందారు.

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ నియోజకవర్గం సనత్‌నగర్‌లో ఐదు డివిజన్లు ఉండగా, రెండింట్లోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది. మిగతా మూడు సిట్టింగ్‌ స్థానాలైన అమీర్‌పేట, రాంగోపాల్‌పేట, మోండా మార్కెట్‌లో ఓడిపోయింది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్‌, ఆర్కేపురం డివిజన్లూ టీఆర్‌ఎస్‌ చేజారాయి. నగరంలోని ఇద్దరు మంత్రులూ తమ నియోజకవర్గాల్లోని పూర్తి స్థానాలను గెలిపించుకోలేకపోవడం విశేషం.

కొన్ని డివిజన్లలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలిసి బాధ్యత తీసుకున్నా గెలుపును అందుకోలేకపోయారు. మంగళ్‌హాట్‌ డివిజన్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే టి. రాజయ్యను బాధ్యులుగా నియమించినప్పటికీ.. అక్కడ టీఆర్‌ఎ్‌సకు ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇన్‌చార్జులుగా పనిచేసిన విజయనగర్‌ కాలనీలోనూ టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఇన్‌చార్జి పరీక్షలో పాస్‌ అయిన వారు ఊపిరి పీల్చుకోగా.. ఫెయిల్‌ అయిన నేతలు ఎన్నికల బరిలో తామే ఓడినట్లుగా భావిస్తూ తీవ్ర నిరాశలో ఉన్నారు.


‘గాంధీనగర్‌’లో పారని కవిత పాచిక

రాంనగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ డివిజన్‌లో సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాచిక పారలేదు. కవిత గాంధీనగర్‌ డివిజన్‌ ఇన్‌చార్జిగా అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌ గెలుపునకు శ్రమించారు. 2016 ఎన్నికల్లోనూ కవిత ఇదే డివిజన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అప్పట్లో విజయం సాధించినా.. ఈసారి ఓటమి తప్పలేదు.
పద్మానరేశ్‌, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స్వయానా మరదలు కావడం, బీజేపీ యువజన విభాగం బీజేవైఎం నగర అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్‌ సతీమణి పావని ప్రత్యర్థిగా నిలవడంతో  మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతోపాటు పావని తొలిసారి పోటీలో దిగారు. ఎంత ప్రయత్నించినా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 1,477 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Updated Date - 2020-12-05T09:14:04+05:30 IST