నర్సులకు రాత పరీక్ష

ABN , First Publish Date - 2022-05-25T07:58:13+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల పోస్టులు మినహా మిగిలిన అన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

నర్సులకు రాత పరీక్ష

  • ఏఎన్‌ఎం, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులకూ’
  • వైద్యులు మినహా 6,810 పోస్టులు రాత పరీక్ష ద్వారానే భర్తీ
  • జేఎన్‌టీయూకు  ఆ బాధ్యత? 
  • ప్రతి 6 నెలలకు 2.5 మార్కుల వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం
  • తొలిసారి ఔట్‌సోర్సింగ్‌ వారికి కూడా.. గరిష్ఠంగా 20 మార్కులు
  • నెలలో నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తర్వాత ప్రక్రియ బోర్డుదే’


’హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల పోస్టులు మినహా మిగిలిన అన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించబోతోంది. ప్రస్తుతం ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలను జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన సూపర్‌వైజర్‌ పోస్టుల నియామక పరీక్షను కూడా జేఎన్‌టీయూనే నిర్వహించింది. ఈ నేపథ్యంలో వైద్య శాఖలో పోస్టుల భర్తీకి రాత పరీక్ష బాధ్యతను కూడా దానికే అప్పగించేందుకు సర్కారు సిద్ధమైంది. వైద్య ఆరోగ్య శాఖలో 12,735 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో 10,028 పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. టీఎ్‌సపీఎస్సీ ద్వారా 2,662 పోస్టుల భర్తీకి మరో జీవో జారీ చేసింది. ఇక మెడికల్‌ బోర్డు కేవలం వైద్యుల నియామకాలనే చేపట్టబోతోంది. వీటిలో డీఎంఈ పరిఽధిలో 1,183 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 1,284 స్పెషలిస్టు వైద్యుల పోస్టులను బోర్డు నేరుగా రిక్రూట్‌ చేయనుంది. మెరిట్‌, 


రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, వెయిటేజ్‌ ఆధారంగా నియామక ప్రక్రియ చేపడుతుంది. ఇక, డీహెచ్‌, డీఎంఈ, టీవీవీపీ పరిధిలోని స్టాఫ్‌ నర్స్‌లు, ఏఎన్‌ఎమ్‌, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమేల్‌) తదితర 6,810 పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. నిజానికి, మెడికల్‌ బోర్డు ద్వారా చేపట్టే నియామకాలన్నింటినీ ఎటువంటి రాత పరీక్ష లేకుండానే భర్తీ చేయాలని తొలుత భావించింది. కేవలం మెరిట్‌ ఆధారంగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలనుకుంది. ఆ నిర్ణయం నుంచి సర్కారు వెనక్కు తగ్గినట్లు సమాచారం. డాక్టర్‌ పోస్టులు మినహా మిగిలిన అన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయబోతోంది. రాత పరీక్ష తర్వాత మెరిట్‌ జాబితాను మెడికల్‌ బోర్డుకు జేఎన్‌టీయూ పంపుతుంది. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులతోపాటు, వెయిటేజీ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా నియామక ప్రక్రియ బోర్డు చేపడుతుంది. ఈ నియామకాలకు నోటిఫికేషన్‌ను నెలలోగా జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇక రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఒక్కో హెచ్‌వోడీ విభాగంలోని పలు పోస్టుల సర్వీస్‌ రూల్స్‌కు కొన్ని సవరణలు అవసరమయ్యాయి. వాటిని వైద్య శాఖ క్లియర్‌ చేసింది. న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది.


ప్రతి 6 నెలలకు రెండున్నర మార్కుల వెయిటేజీ

త్వరలో చేపట్టబోయే నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఫైలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్య మంత్రి హరీశ్‌రావు సంతకాలు కూడా చేశారు. సంబంధిత జీవో ఒకటి రెండు రోజుల్లో రానున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక, గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన వెయిటేజీని ఈసారి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇవ్వడం విశేషం. ప్రతి ఆరు నెలలకు రెండున్నర మార్కుల చొప్పున వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా 20 వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. కొవిడ్‌ సమయంలో సర్కారీ దవాఖానల్లో పనిజేసిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఈ వెయిటేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొనబోతోంది. కొవిడ్‌ సమయంలో హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఎక్కువ మంది పని చేశారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-25T07:58:13+05:30 IST