Abn logo
Jul 27 2021 @ 00:28AM

బాధ్యతలు, విధులపై అవగాహన కలిగిఉండాలి

మాట్లాడుతున్న రూరల్‌ డెవల్‌పమెంట్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఎం సుధాకరరావు

వల్లూరు(టంగుటూరు), జులై 26 : బాధ్యతలు, విధులపై నూతన సర్పంచ్‌లంతా పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఎం. సుధాకరరావు సూచించారు. మండలంలోని వల్లూరు సమీపంలోగల రైజ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరుగుతున్న నూతన సర్పంచ్‌ల శిక్షణ రెండవ బ్యాచ్‌కి సోమవారం ప్రారంభమయింది. ఈశిక్షణా కార్యక్రమాన్ని సుధాకరరావు సందర్శించి వారికి పలు సూచనలను చేశారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం పలు కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించిందని,  ఇవన్నీ ప్రారంభం గ్రామ సచివాలయాల నుంచేనని, పథకాలకు అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాల్సిన కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌లు భాగస్వాములేనన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పఽథకాలు ప్రజల ముందుకు చేర్చే విషయంలో సంపూర్ణ సహకారం అందివ్వాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించి పంచాయతీలను అభివృద్ధి పథంలో పయనించేలా చూడాలని సూచించారు. శిక్షణకు జరిగిన ఏర్పాట్లు, భోజన వసతి అన్నీ ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జడ్‌పీ సీఈవో దేవానందరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, జిల్లా ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ చొప్పర కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు కొరిశపాడు, జె పంగులూరు, మద్దిపాడు, కారంచేడు, మార్టూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల నుంచి 84 మంది సర్పంచ్‌లు హాజరయ్యారు