Abn logo
May 18 2020 @ 04:44AM

‘‘రచన పోరాడే చైతన్యాన్ని కలిగించాలి.’’

పి.చంద్‌ పలకరింపు

మీరు ఎక్కువ నవలలు కార్మికుల మీద కార్మికవర్గ దృక్పథంతో వ్రాశారు. కారణం?

కారణం నా కుటుంబ నేపథ్యమే కావచ్చు. మా నాన్న మల్లయ్య అజంజాహి మిల్లు కార్మికునిగా పనిచేశారు. మా అమ్మ వీరమ్మ బీడీ కార్మికురాలు, నేను ఉద్యోగరీత్యా దాదాపు నలభై సంవత్సరాలు సింగరేణి కార్మికుల మధ్యన పనిచేశాను. ఆ విధంగా నేను కార్మికుల జీవితాలను అనుభవించాను. దగ్గరగా ఉండి పరిశీలించడం వలన సహజం గానే దాని ప్రభావం నా రచనల మీద ఉంది. 


మీరు దాదాపు ఇరవై మారుపేర్లతో రాయడానికి కారణం?

(చిన్న చిరునవ్వు) వాస్తవాలు ఎప్పుడూ మింగుడుపడవు. ఒకవైపు సత్యాన్ని చెప్పాలనే ఆరాటం, మరోవైపు ప్రభుత్వ నిర్బంధం దృష్ట్యా అట్లా మారుపేర్లతో వ్రాయాల్సి వచ్చింది. 


మీ మొదటి నవల ‘శేషగిరి’ తెలుగులో వచ్చిన గొప్పనవలల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. దాని నేపథ్యం?

నేను ఎప్పుడైతే సింగరేణిలో ఉద్యోగంలోకి వచ్చానో అప్పుడే నాకు శేషగిరి గురించి తెలిసింది. గొప్ప నాయకుని గురించి కార్మికులు గొప్ప ఆరాధన భావంతో చెప్పడం ఆశ్చర్యం అనిపించింది. ఆయన సింగరేణిలో కార్మికోద్యమ నేత. కానీ ఆయన గురించి సుందరయ్య వ్రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గుణపాఠాల్లో ఒక్కపేజీ సమాచారం తప్ప ఎక్కడా చరిత్రలో నమోదు కాలేదు. దాంతో ఆయన గురించి వ్రాయాలన్న తపనతో 1990 ప్రాంతంలో దాదాపు నాలుగేళ్ళు సమాచార సేకరణ కోసం తిరిగాను. ఆయన్ని 1948లోనే నిజాం ప్రభుత్వం కాల్చి చంపింది. ఆయనతో పనిచేసి ఇంకా సజీవులుగా ఉన్న దాదాపు వంద మందిని కలిసి ఇంటర్వ్యూ చేశాను. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులు అధ్యయనం చేసి నవలగా మలిచాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై దాదాపు 23 నవలలు వస్తే కార్మికోద్యమ నేపథ్యంలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రించిన నవలగా సాహితీ విమర్శకుల ప్రశంసలు పొం దింది. ఆ నవల మొదట స్థానిక దినపత్రికలలో సీరియల్‌గా వచ్చినపుడు ఆ పత్రిక సర్క్యులేషన్‌ రెండింతలు కావడమే కాకుండా బావుల మీద కార్మికులు గుంపులుగా చదువుకున్నారు. అలా అది కార్మికుల మన్ననలను పొందింది.


మీ ఇతర నవలల గురించి?

నా మొదటి నవల ‘శేషగిరి’ సింగరేణిలో తొలినాటి కార్మికోద్యమం గురించి వివరిస్తుంది. ఎనబై దశకంలో సింగరేణిలో మొగ్గతొడిగిన విప్లవ కార్మికోద్యమం గురించి ‘నెత్తుటిదార’, ‘విప్లవాగ్ని’, ‘శ్రామికయోధుడు’, ‘హక్కులయో ధుడు బాలగోపాల్‌’, ‘దేవునిగుట్ట’, ‘స్ట్రయిక్‌’ వంటి నవలలు వ్రాశాను. పర్యావరణ విధ్వంసం మీద ’భూదేవి’, బొగ్గు బాయి ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాల కన్నీటి కథనాన్ని ఒక కన్నీరుగా ‘దేవునిగుట్ట’, అంతర్జా తీయ కార్మిక కుటుంబం (డబ్ల్యూఎఫ్‌టీయూ) అధ్యక్షుడుగా పనిచేసిన కామ్రేడ్‌ కె.ఎల్‌. మహేంద్ర మీద అంతర్జాతీయ శ్రామిక యోధుడు, నిమ్నకులంలో పుట్టి ఆరు అణాల కూలీగా పనిచేసి తన స్వంత చొరవతో ఎదిగి అనేకమార్లు కేంద్ర, రాష్ట్ర యంత్రాంగంలో పనిచేసిన గడ్డం వెంకటస్వామి మీద ‘మేరా సఫర్‌’, ప్రముఖ తెలంగాణ వాది, బీసీ నాయకుడు ముచర్ల సత్యనారాయణ జీవితం ఆధారంగా ’ధిక్కార కెరటం’ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సామాన్యుల సహనానికి ప్రతీకగా నిలిచే ‘బండ్రు నర్సింహులు’, నల్లమల విప్లవోద్యమాన్ని చిత్రించిన ‘నల్లమల’ నవల, ఇటీవల మలి దశ ఉద్యమంపై ఉద్యమకాలంలోనే వ్రాసిన ‘తెలంగాణ తల్లి’, ‘సకలజనులసమ్మె’, ’తలాపున పారేపాట’ నవలలు వ్రాసిన. ఇంకా ప్రచురణ కాని నవలలు ఆరేడు ఉన్నాయి.  


నూతన రచయితలకు మీరిచ్చే సలహాలేమిటి?

నా దృష్టిలో రచన ప్రజల కోసం వ్రాయాలి. వారి దుఃఖాన్ని, ఆనందాన్ని, బాధలను, వాళ్ళపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యాన్ని కలిగించాలి. ప్రజలు వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకునే విధంగా రచనలు ఉండాలని భావిస్తాను. అందుకోసం కొత్త తరం రచయితలు ప్రజల జీవితాన్ని పరిశీలించండి. తమ రచనా విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రముఖుల రచనలను అధ్యయనం చేయాలి. నిరంతరం వ్రాయాలి. తద్వారా మన రచనా నైపు ణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది రచయిత దృక్పథం. మనం ఎవరి వైపు నిలబడి రచనలు చేస్తున్నామో నిర్ణయించుకోవాలి లేకుంటే గాలిలో సాము చేసినట్లు అవుతుంది. 

ఇంటర్వ్యూ యండి. మునీర్‌

99518 65223Advertisement
Advertisement
Advertisement