రాయడం నా సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2020-02-17T11:32:13+05:30 IST

వెయ్యేండ్ల తెలుగు సాహిత్యం అంతా రెండే భాగాలుగా ఉంది. 1. చాతుర్వర్ణ కుల వ్యవస్థను కాపాడే సాహిత్యం. 2. కులవ్యవస్థను బద్ధలుకొట్టే అంబేద్కరైట్‌ అస్తిత్వవాద సాహిత్యం. ఈ నేపథ్యంలో అస్తిత్వవాదాలుగా లేవనె త్తిన ప్రశ్నకు, నిర్మించిన ప్రత్యామ్నాయ...

రాయడం నా సామాజిక బాధ్యత

దళిత సాహిత్యం విషయానికి వచ్చినపుడు మన సమాజంలో దళితులకు జరిగిన అన్యాయమే దళిత సాహిత్యానికి కూడా జరిగింది. కేవలం లెక్కల కోసం వేళ్ల మీద పేర్లు చెప్పే సంస్కృతి ఒకటి ఉంది. అలాంటి వారిని విమర్శిస్తూ కూర్చోవడం కంటే, దళిత రచనల్లోని తాత్విక గాఢతను గురించి, వస్తు వైవిధ్యం గురించి రాసుకోవాలనిపించింది. అలా రాసుకున్న వ్యాసాలే దశాబ్ద కాలం తరువాత పుస్తకంగా వేసుకున్నాను. 


ఇటీవల వెలువరించిన మీ ‘ఇమ్మతి’ సాహిత్య వ్యాసాల సిద్ధాంత భూమిక, నేపథ్యం ఏమిటి?

వెయ్యేండ్ల తెలుగు సాహిత్యం అంతా రెండే భాగాలుగా ఉంది. 1. చాతుర్వర్ణ కుల వ్యవస్థను కాపాడే సాహిత్యం. 2. కులవ్యవస్థను బద్ధలుకొట్టే అంబేద్కరైట్‌ అస్తిత్వవాద సాహిత్యం. ఈ నేపథ్యంలో అస్తిత్వవాదాలుగా లేవనె త్తిన ప్రశ్నకు, నిర్మించిన ప్రత్యామ్నాయ భావజాలా నికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా గడిచిన దశాబ్దంన్నర కాలంగా నాదైన దృక్కోణం నుండి దళిత, తెంగాణ, గ్లోబలైజేషన్‌ ఉద్యమాల సాహిత్యాన్ని విశ్లేషించే పనికి పూనుకున్నాను. అలా నేను వెలువరించిన పుస్తకాలే ‘ఇమ్మతి’, ‘గ్లోబలైజేషన్‌ సాహిత్య విమర్శ’ సంపుటాలు. దళిత సాహిత్యం విషయానికి వచ్చినపుడు మన సమాజంలో దళితులకు జరిగిన అన్యాయమే దళిత సాహిత్యానికి కూడా జరిగింది. కేవలం లెక్కల కోసం వేళ్ల మీద పేర్లు చెప్పే సంస్కృతి ఒకటి ఉంది. అలాంటి వారిని విమర్శిస్తూ కూర్చోవడం కంటే, దళిత రచనల్లోని తాత్విక గాఢతను గురించి, వస్తు వైవిధ్యం గురించి రాసు కోవాలనిపించింది. అలా రాసుకున్న వ్యాసాలే దశాబ్ద కాలం తరువాత పుస్తకంగా వేసుకున్నాను. 

దళిత సాహిత్యంలో మీ కథలు ఏ విధంగా భిన్నమైనవి?

నాకంటే ముందు దళిత రచయితలు కథా సాహిత్యంలో తమదైన ముద్రను వేశారు. వారు వదిలిపోయిన వస్తువును నేను రాసే ప్రయత్నం చేస్తున్నాను. దళిత కథకు వస్తువు గ్రామీణ జీవితమే ప్రధానం. నా కాలానికి కులం ఆధుని కంగా విస్తరిస్తున్న జాడలు నన్ను కలవరపరిచాయి. అట్లా నేను ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’ కథలు రాయగలిగాను. మన కళ్లముందే కనిపిస్తున్న ఒక సామాజిక రుగ్మతను గురించి రాయకుండా ఎలా ఉండగలం?! నా మట్టుకు నేను కథ రాయాలంటే నాకు ఒక సత్యం సాక్షాత్కారం కావాలి. అది నలుగురిలో చర్చకు పెట్టాలి. నా కథ వల్ల కొందరైనా ఆ సమస్యను గురించి ఆలోచించాలి. అందుకే నా కథలు ఎక్కువగా సామాజిక అసమానతకే పరిమితం అయ్యాయి. ఈ విషయాన్ని పాజిటీవ్‌గా తీసుకున్నవారు ఉన్నారు, నెగటివ్‌గా విమర్శించినవారు ఉన్నారు. నా కథల్ని తిట్టడం కోసమే చదివినవారు ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన స్టేట్‌మెంట్‌ కూడా చేశారు. ‘‘ఈ రోజుల్లో కులం ఉంటే ఉన్నది. అందిరికీ తెలిసిన విషయమే కదా మళ్లీ దీనిపై రాయాల్సిన అవసరం ఏముంది?’’ అని విప్లవ శిబిరం నుండి ఒక మిత్రుడు నా కథపై సమీక్షరాస్తూ చేసిన వ్యాఖ్య అది. అలాగే ఒక అగ్రవర్ణ పాఠకురాలు నా కథల్ని చదివి ‘‘ఇవాళ్టికి కూడా మీరు ఇట్లా కులంవల్ల నలిగిపోతున్నందుకు... ఈ కులంలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా’’ అన్నారు. ఇట్లా మిశ్రమ స్పందనలు వచ్చాయి, వస్తున్నాయి. అయినాసరే రాయడం నా సామాజిక బాధ్యత. అంబేద్కర్‌ కలలుగన్న కులనిర్మూన జరిగే వరకు నా వస్తువు మారకపోవచ్చు.  

దళిత కథకు వస్తు, శిల్ప ప్రాధాన్యతల్లో ఏది ముఖ్యం?

దళిత జీవితమే అత్యంత కళాత్మకమైంది. దాన్ని వ్యక్తీకరించే కళారూపానికి శిల్పం పేరుతో ఆంక్షలు పెట్టడం ఎప్పటి నుంచో ఉంది. ఇది పెద్ద అడ్డంకి. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పి నట్టు ఆటలో గెలవాంటే ఆటగాళ్లను మార్చడం కాదు, ఆట రూల్స్‌ను మార్చాలి. ఈ నేపథ్యంతో కథను కొలిచే విమర్శ సూత్రాలు ఆధిపత్య ప్రాంతాల స్వభావంతో ఉన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల సాహిత్యం వారికి రుచించకపోవచ్చు. అలాగే వెనుకబడిన కులాల సాహిత్యం విషయంలో కూడా ఇదేరకమైన నిర్ణయానికి రావచ్చు. కానీ, ఇది తప్పు. సామాజిక విముక్తికి దోహదం చేయలేని ఎంత గొప్ప శిల్పంతో కూడిన రచన అయినా వృథానే. అస్తిత్వవాద సాహిత్యాలకు స్వానుభవమే గొప్ప శిల్పాన్ని ఇస్తుంది. శిల్పం కిందికులాల సాహిత్యానికి సంకెల వేయకూడదు. 

పసునూరి రవీందర్‌ 

77026 48825


Updated Date - 2020-02-17T11:32:13+05:30 IST