Abn logo
Mar 15 2020 @ 22:14PM

నాటకం వారికోసమేగానీ.. నంది బహుమతి కోసం కాదు: బుర్రా సాయిమాధవ్‌

ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌. కళాకారుల కుటుంబంలో పుట్టి, కళాకారుడుగా ఎదిగి కళామ్మతల్లి సేవలో పునీతుడవుతున్న రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక సినీ రచయిత. నాటకం నంది బహుమతులకోసమో, పరిషత్తుల కోసమో కాదు, నాటకం ప్రజలకోసం అంటున్న సాయిమాధవ్‌ ఇంటర్వ్యూ..


కళలకు కాణాచి, గుంటూరు జిల్లా సాంస్కృతిక కేంద్రం తెనాలి పట్టణం బుర్రా సాయిమాధవ్‌ స్వస్థలం. ప్రముఖ రంగస్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రఖ్యాత రంగస్థల నటి జయలక్ష్మిల కుమారుడు ఆయన. ఆయన తమ్ముడు బుర్రా నరసింహ. జర్నలిస్టు, ప్రస్తుతం సినీ రచయితగా ఎదుగుతున్నారు.


నటన తప్ప మరోటి తెలియదు 

తల్లిదండ్రులు రంగస్థల నటులు కావడంతో, బుర్రా సాయి మాధవ్‌ బాల్యం నుంచీ రంగస్థలం మధ్య, నాటకం రిహార్సల్స్‌ మధ్యే పెరిగారు. ఆయన అమ్మమ్మ పిచ్చమ్మకు సినిమాలంటే మహాఇష్టం. దాంతో ఆమె కూడా వెళ్ళి ప్రతి సినిమా చూసేవారు. ఎన్‌.టి.ఆర్‌, ఎఎన్నార్‌లను ఇమిటేట్‌ చేస్తూ వాళ్ళల్లా నటిస్తూ, కత్తియుద్ధాలు ప్రాక్టీస్‌చేస్తూ ఆ సినిమాలోకంలోనే ఎదిగారు. అమ్మానాన్నలవెంట వెళ్ళి ప్రతి పౌరాణిక నాటకాన్నీ శ్రద్ధగా చూసేవారు.


దుమ్మురేపిన రంగస్థలం ఎంట్రీ....

రంగస్థలంపై ఎలాంటి అనుభవం లేకపోయినా, తన ఆరవయేట ఆపద్ధర్మంగా, అప్పటికప్పుడే లోహితాసుడు పాత్రతో స్టేజీ ఎక్కి, ఎలాంటి రిహార్సులూ లేకుండానే, తన నటనతో, రంగస్థల దిగ్గజం డి.వి.సుబ్బారావును దిగ్ర్భాంతి పరిచారు సాయి మాధవ్‌.  ప్రముఖ నటుడు ధూళిపాళ ఆ నాటకంలో విశ్వామిత్రుడు. తన తల్లి సూచనతో ధూళిపాళకు పాదాభివందనం చేసి స్టేజీ ఎక్కి దుమ్మురేపారు సాయి మాధవ్‌. ‘‘పెద్దపులి వచ్చినా భయపడను తండ్రీ!’’ అంటూ, హరిశ్చంద్ర పాత్రధారి డి.వి.సుబ్బారావు ఒరలోంచి కత్తి బయటకులాగి ఎన్‌.టి.ఆర్‌లా కత్తి పైకెత్తి చూపించి తన సొంత ప్రతిభతో నటించారు. ఆ సీనుతో ఆ రంగస్థలమంతా ప్రేక్షకులతో చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ ప్రతిభచూసి ముగ్ధుడైపోయిన డి.వి.సుబ్బారావు.. సాయి మాధవ్‌ను ముద్దుపెట్టుకుని, ‘‘లోహితాసుడు పాత్రకు వన్నెతెచ్చి చప్పట్లు కొట్టించుకున్న తొలి నటుడివి నువ్వే, ఇన్నాళ్ళుగా నేను నాటకాలు ఆడుతున్నానుగానీ, నీలాంటి నటుణ్ణి మొదటిసారి చూస్తున్నా, నువ్వు ఎంతో గొప్పవాడివి అవుతావ్‌’’ అని ఆశీర్వదించారు.


రంగస్థలంపై పేరు ప్రతిష్టలు

రంగస్థలంపై ఎన్నో నాటకాలు ప్రదర్శించి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు సాయి మాధవ్‌. తొలుత ఆయన స్కూలు టీచర్‌ బొల్లిముంత కృష్ణ నేత్రత్వంలో ‘గడియారం’ నాటిక రిహార్సల్స్‌ చేస్తూ, నటనలో ఫండమెంటల్స్‌ నేర్చుకుని, క్రమంగా నాటకరంగం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దుర్యోధనుడు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయాలు చేసేవారు సాయి మాధవ్‌. ప్రతి నాటకానికీ ముందు ఆయన ఏకాత్రాభినయ ప్రదర్శన ఉండేది. మాఢభూషి దివాకర్‌బాబు రాసిన ‘రేపేంది’ నాటికలో నటించి 200 ప్రదర్శనలిచ్చారు సాయి మాధవ్‌. ‘పుటుక్కు జరజర’ నాటకానికి 50 ప్రదర్శనలిచ్చారు. అమ్మకానికో అబ్బాయి, హిమజ్వాల, మంచంమీద మనిషి, వర విక్రయం, భయం, ఈనాడు...ఇలా ఎన్నో నాటకాల్లో విజయవంతమైన నటుడుగా పేరు తెచ్చుకున్నారు. నాటక వ్యామోహంతో కాలేజీకి వెళ్ళకపోయినా, తర్వాత బి.ఏ పూర్తిచేశారాయన.


నాటికీ నేటికీ కమ్యూనిస్టునే 

నేతి పరమేశ్వర శర్మ, పగడాల శ్యాంసుందర్‌, కన్నెగంటి నర్సయ్య, దాలిశెట్టి కృష్ణారావు, ఎం.పి.కన్నేశ్వర్రావు, మొక్కపాటి కృష్ణమోహన్‌ లాంటి దిగ్గజాలైన రంగస్థల నటుల మార్గదర్శకత్వంలో ఎదిగారు సాయి మాధవ్‌. బాల్య స్నేహితుడు చెరుకుమల్లి సింగారావు సాహచర్యంలో వామపక్షభావజాలంవైపు మళ్ళి, అప్పుడే విపరీతంగా సాహిత్యాధ్యయనం చేశారాయన. గురువు బొల్లిముంత కృష్ణను అనుసరిస్తూ, అభ్యుదయ కళాసమితిలో సభ్యుడుగా చేరారు. ప్రజానాట్యమండలి తెనాలిశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అరసం ఆం.ప్ర. కార్యవర్గంలో ఈనాటికీ ఆయన సభ్యుడే. ‘‘నాటికీ నేటికీ నాది కమ్యూనిస్టు భావజాలమే’’ అంటారాయన.


నాటక రచయిత, దర్శకుడుగా...

నాటక పరిషత్తులను శాసించిన తెనాలికి పూర్వవైభవం తీసుకురావాలని చిన్న వయసులోనే కంకణం కట్టుకున్న సాయి మాధవ్‌ ‘బ్రోచేవారెవరురా’ నాటిక రాసి దర్శకుడయ్యారు. అయితే దీనికి బహుమతి రాలేదు. దాంతో మళ్ళీ ఎయిడ్స్‌ మీద ‘దాకలమూచి’ అనే నాటిక రాసి ప్రదర్శించి బహుమతి పొంది, పరిషత్తుల్లో జయకేతనం ఎగరేశారు. ‘అద్దంలో చందమామ’ అనే మరో నాటకం రాసి, నాటకరంగ పితామహుడు కె.ఎస్‌.టి.సాయితో దర్శకత్వంలో ఆ నాటిక ప్రదర్శించి రికార్డు సృష్టించారు. ఎక్కడకు వెళ్ళినా బహుమతులన్నీ ఈ నాటకానికే వచ్చేవి. అలా ఈ నాటకాన్ని 50సార్లు ప్రదర్శించారు.సినిమా స్ర్కిప్టు రచనలో శిక్షణ

పెళ్ళయ్యాక సంపాదనపై దృష్టి పెట్టారు సాయి మాధవ్‌. మొబైల్‌ యాడ్స్‌కి స్ర్కిప్టులు రాసి 50రూపాయలు సంపాదించేవారు. తెనాలి సిటీ కేబుల్‌లో స్ర్కిప్టు రైటర్‌గా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచీ కళారంగంతప్ప మరోటి తెలియని సాయి మాధవ్‌ సినిమారంగంలో స్థిరపడాలనే కోరికతో 2003లో హైదరాబాద్‌ వచ్చి తన గురువులు నూతలపాటి సత్యనారాయణ, బొల్లిముంత శివరామకృష్ణలను ఆశ్రయించారు. ‘తాళికట్టు శుభవేళ’ చిత్రానికి సత్యనారాయణగారికి సహాయకుడుగా పనిచేశారు. మిత్రుడు చెరుకుమల్లి సింగ దర్శకత్వంలో వచ్చిన ‘సిరి’ బాలల చిత్రానికి సాయి మాధవే కథ సమకూర్చారు. దీనికి నంది పురస్కారం ప్రకటించారు. ఈ మిత్రులిద్దరూ బొల్లిముంతగారి వద్ద సినిమా స్ర్కిప్టు రచన నేర్చుకున్నారు.


టీవీ సీరియల్స్‌, క్రిష్‌ సాంగత్యం 

ప్రముఖ టీవీ ఛానల్స్‌కు హిట్‌ సీరియల్స్‌ రాశారు సాయి మాధవ్‌. రాజాచంద్ర దర్శకత్వంలో ‘అభినందన’ టెలిఫిలిమ్‌ రచించారు. మూడునాలుగు టెలిఫిలిమ్స్‌ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌’లో మలినేని రాధాకృష్ణ దర్శకత్వంలో ‘పుత్తడిబొమ్మ’ అనే హిట్‌ సీరియల్‌కి స్ర్కిప్టు రాశారు. ‘‘ఈ డైలీ సీరియల్‌ నన్నొక రచయితగా నిలబెట్టింది. నా గురించి నాకు తెలిసేలా చేసింది. దీనివల్ల నాకెంతో పేరు ప్రతిష్టలొచ్చాయి’’ అన్నారు. తర్వాత కళ్యాణ తిలకం, శిఖరం, స్వాతి చినుకులు, రాధాకళ్యాణం, సీతామహాలక్ష్మి లాంటి ఎన్నో హిట్‌ సీరియల్స్‌కు కథలు సమకూర్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు సాయి మాధవ్‌.


కృష్ణం వందే జగద్గురుం

‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రానికి మాటల రచయితగా సాయి మాధవ్‌కు అవకాశం ఇచ్చారు దర్శకుడు క్రిష్‌. ‘‘నేను రంగస్థల కళాకారుల కుటుంబం నుంచి రావడం, నా తొలి సినిమా కూడా నాటరంగమే బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండటం, నా చిన్నప్పటి నాటకరంగ వాతావరణాన్ని డిస్కస్‌చేసి హీరో బీటెక్‌ బాబు పాత్రను తీర్చిదిద్దడం... ఇదంతా ఆ సాయిబాబా అనుగ్రహమే’’ అంటారు సాయి మాధవ్‌. ఈ చిత్రం హిట్టయ్యాక ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రానికి కూడా డైలాగ్స్‌ రాశారు ఆయన.


మెగాస్టార్‌–బాలయ్య‌ల మైల్‌స్టోన్‌ చిత్రాలు

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ నటించిన ‘గోపాల గోపాల’తో సాయిమాధవ్‌ సినిమా రచయితగా స్థిరపడ్డారు. మూడో సినిమాకే మల్టీస్టారర్ మూవీకి డైలాగ్స్‌ రాయడం, అది మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారాయన. కంచె సినిమాకు ఆయనే మాటల రచయిత. బాల్యం నుంచీ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ, వాళ్ళిద్దరికీ అభిమానిగా ఉండేవారు సాయి మాధవ్‌. అయితే ఎవరో ఒకరికే ఫ్యాన్‌గా ఉండాలని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వాళ్ళు ఈయనతో గొడవపడేవారట. కానీ తాను ఇద్దరికీ అభిమానినే అనేవారట సాయి మాధవ్‌. ఈ నేపథ్యంలోనే, ‘‘బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీనెంబర్‌ 150’ ఈ రెండు చిత్రాలకూ నేనే రచయితగా పనిచేయడం నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని సంఘటన. ఇది నా జీవితంలో ఒక మైలురాయిగా, గొప్ప అదృష్టంగా భావిస్తాను’’ అన్నారు సాయి మాధవ్‌.


ఎక్సట్రార్డనరీ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌

మహానటి, సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కూడా బుర్రా సాయి మాధవే సంభాషణలు సమకూర్చారు. బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి సారథ్యంలో శరవేగంగా తయారవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి కూడా సాయి మాధవే డైలాగ్స్‌ రాస్తున్నారు. ‘‘ఇదొక అద్భుత చిత్రం. ‘బాహుబలి’ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమ ఒక లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా ఇంకా నెక్ట్స్ లెవల్‌కి వెళ్ళిపోతుంది. ఇదొక ఎక్సట్రార్డనరీ మూవీ. ఈ సినిమాకు పనిచేయడం నా భాగ్యం. ధన్యుణ్ణి’’ అన్నారు సాయి మాధవ్‌. క్రిష్‌–పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో చిత్రానికి కూడా డైలాగ్స్‌ సాయిమాధవే. రవితేజ ‘క్రాక్‌’, శర్వానంద్‌తో మరో చిత్రాకినీ ఆయనే సంభాషణలు సమకూరుస్తున్నారు. మరో నాలుగైదు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.


నంది అవార్డుల తీరు మారాలి

‘‘ప్రభుత్వాలు చేసే తప్పుల్ని నిష్పక్షపాతంగా, సూటిగా ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తెచ్చే గొప్ప నాటకాలకు నంది బహుమతి ఇవ్వకుండా పక్కన పెట్టేయడంవల్ల, నంది బహుమతుల కోసం రచయితలు వారి స్వేచ్ఛను వారే నియంత్రించుకుంటున్నారు. ఘాటు విమర్శలకు వెనకాడుతోంది నాటకరంగం. దీనివల్ల నాటకరంగ మౌలిక లక్ష్యం దెబ్బతింటోంది. అందుకే నంది నాటకోత్సవం బై లా లో సంస్కరణలు తేవాలి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే గొప్ప నాటకాలకు నంది బహుమతులిచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలి’’ అన్నారు సాయి మాధవ్‌.

‘‘నాటకాన్ని నాటకంలా రాయాలి. నాటకాన్ని ప్రజలకోసం రాయాలి. ప్రజా చైతన్యం కోసం రాయాలి. ప్రజల సమస్యలను స్వేచ్ఛగా చెప్పాలి. ఒకప్పుడు ‘మాభూమి’ నాటకం ప్రదర్శనప్పుడు పోలీసులు జైల్లో పెట్టినాగానీ కళాకారులు భయపడలేదు. ఇప్పటికీ కొంతమంది రచయితలు అలాంటి గొప్ప రచనలు చేస్తున్నారు. నాటకం లక్ష్యం నంది బహుమతులు, పరిషత్తుల్లో ప్రైజులు సంపాదించడం కాదు, కేవలం ముగ్గురు నలుగురు జడ్జీల తీర్పు కోసం కాదు, ప్రజలకోసం నాటకం రాయాలి, నాటకం వ్యాపారం కాదు, కళాకారులకు స్వేచ్ఛలేని సమాజం ఎప్పటికీ బాగుపడదు’’ అన్నారు సాయి మాధవ్‌.కావాల్సిన విధంగా బతుకుతున్నా

‘‘బాల్యం నుంచీ నేను ఏం కావాలనుకున్నానో అదే అయ్యాను. ఎలా బతకాలనుకున్నానో అలాగే బతుకుతున్నాను. నా జీవితంలో నేను నిర్దేశించుకున్న ఆశయాన్ని సాధించాను. కోరుకున్న విధంగా జీవిస్తున్నాను’’ అన్నారు బుర్రా సాయి మాధవ్‌. 1999లో ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు వెంకట సీత. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మీనాక్షి. బి.బి.ఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. రెండో అమ్మాయి సాయి లక్ష్మి. బి.బి.ఏ బి.ఎల్‌ చదువుతోంది.  

-రామ్మోహన్

Advertisement
Advertisement
Advertisement