లేటరైట్‌కు రైట్‌రైట్‌!

ABN , First Publish Date - 2022-09-21T08:43:58+05:30 IST

లేటరైట్‌కు రైట్‌రైట్‌!

లేటరైట్‌కు రైట్‌రైట్‌!

జనాలు పెద్దగా లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

చింతలూరు కొండల్లో తవ్వకాలకు ఇద్దరు వైసీపీ నేతలకు లీజు

ముఖ్య నేత సిమెంట్‌ ఫ్యాక్టరీకి తరలించేందుకు ప్లాన్‌


కాకినాడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా చింతలూరు కొండల్లో లేటరైట్‌ గనులపై అధికార పార్టీ నేతలు వాలిపోయారు. ఏటా 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ను తవ్వి ముఖ్య నేత సిమెంట్‌ ఫ్యాక్టరీకి తరలించేలా పావులు కదుపుతున్నారు. ముఖ్య నేత బంధువైన ఓ ఎంపీ త్వరలో ఇక్కడ కొండలను పిండి చేయబోతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా ముగించి ఆమోదముద్ర వేయించుకున్నారు. ప్రత్తిపాడు మండలం చింతలూరు కొండల్లో అపారమైన లేటరైట్‌ నిల్వలున్నాయి. వీటిపై రాష్ట్ర ముఖ్య నేత బంధువులు కన్నేశారు. వైసీపీ నేతలను లీజుదారులుగా తెరపైకి తెచ్చారు. రెండేళ్ల కిందటే దరఖాస్తు చేయించారు. చింతలూరులోని రెవెన్యూ సర్వే నంబర్‌ 1లో మెస్సర్స్‌ మేర్లిన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్వర్ణభారతి సంస్థలకు లీజులు కట్టబెట్టేశారు. ఇందులో మేర్లిన్‌ ఇన్‌ఫ్రా గతంలో కాకినాడ ఎంపీగా పోటీచేసి ఆ తర్వాత వైసీపీలో చేరిన చలమశెట్టి సునీల్‌ రక్త సంబంధీకులది కాగా.. సర్వభారతి సంస్థ సునీల్‌కు సన్నిహితుడైన రాంబాబుది. మేర్లిన్‌ సంస్థకు చింతలూరు కొండపై 16.290 హెక్టార్లు, స్వర్ణభారతి సంస్థకు 13.559 హెక్టార్ల లేటరైట్‌ లీజులను గనుల శాఖ ఇటీవల కేటాయించేసింది. ఈ రెండు లీజుల ద్వారా ఏడాదికి 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ తవ్వి తరలించడానికి ప్రభుత్వ పెద్దలు అనుమతి ఇప్పించారు. లీజుదారులతో కడప జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ రాయబేరాలు కుదుర్చుకున్నారు. వాస్తవానికి చింతలూరు కొండలపై ఇప్పటికే ఓ కంపెనీ లేటరైట్‌ తవ్వకాలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అదే చింతలూరు కొండల్లో ప్రభుత్వ పెద్దలు తమకు కావలసిన ఇద్దరు నేతలకు కొత్తగా మైనింగ్‌ లీజులు ఇప్పించడం గమనార్హం. మైనింగ్‌ లీజులు ఇచ్చే ప్రదేశానికి సమీపంలో తోటపల్లికి చెందిన కొండపోడు భూము లు ఉన్నాయి. ఇక్కడ నెమళ్లు, దుప్పులు, జింక లు, ఇతర వన్యప్రాణులున్నాయి. అయినా పట్టించుకోకుండా లేటరైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఈ అంశంపై చింతలూరు గ్రా మంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రా య సదస్సు జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియా ఆధ్వర్యంలో జరిగింది. చింతలూరు చుట్టుపక్కల 4 గ్రామాల్లో 5 వేల మంది వరకు జనా భా ఉన్నారు. వీరంతా సభకు వచ్చి తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంది. కానీ సదస్సు గురించి చాలామందికి తెలియదు. కేవలం 300 మందితో మమ అనిపించేశారు.

Updated Date - 2022-09-21T08:43:58+05:30 IST