పసిడి పట్టేశారు

ABN , First Publish Date - 2022-08-06T10:20:26+05:30 IST

రెండు రోజుల భారత స్వర్ణ పతక ఎదురుచూపులకు కుస్తీ వీరులు తెరదించారు. రెజ్లింగ్‌ పోటీల తొలిరోజే మనోళ్లు అదిరిపోయే..

పసిడి పట్టేశారు

 రెజ్లర్లు బజ్‌రంగ్‌, దీపక్‌, సాక్షికి స్వర్ణాలు

పారా లిఫ్టింగ్‌లో సుధీర్‌కు బంగారం

అన్షు, శ్రీశంకర్‌కు రజతాలు 

దివ్య, మోహిత్‌కు కాంస్యాలు


రోహిత్‌ అదరహో..

బాక్సింగ్‌ పురుషుల వెల్టర్‌వెయిట్‌ క్వార్టర్‌ఫైనల్లో అమిత్‌ టోకస్‌ సెమీ్‌సలో అడుగుపెట్టాడు. దాంతో భారత్‌కు ఏడో పతకం ఖరారైంది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రోహిత్‌ 5-0తో గ్జేవియర్‌ (నియు)ను చిత్తుచేశాడు. ఇక అమిత్‌ పంగల్‌, నిఖత్‌ జరీన్‌, హుసాముద్దీన్‌, జాస్మిన్‌, నీతు, సాగర్‌ ఆయా విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరి ఇంతకుముందే పతకాలు ఖాయం చేసిన సంగతి తెలిసిందే. 


పాక్‌ ప్రత్యర్థిపై దీపక్‌ గెలుపు: 

పురుషుల 86 కిలోల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో దీపక్‌ పూనియా 3-0తో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ ఇనాంపై ఘన విజయం సాధించాడు. పూనియా తన విడవని ‘పట్టు’తో ప్రత్యర్థిని డిఫెన్స్‌లోకి నెట్టి విజయం అందుకున్నాడు. అంతకుముందు మాథ్యూ క్లే (న్యూజిలాండ్‌)పై, అలెగ్జాండర్‌ మూర్‌ (కెనడా)పై 3-1తో దీపక్‌ నెగ్గాడు. మహిళల 57 కిలోల ఫ్రీస్టయిల్‌ తుదిపోరులో ఒడునాయో (నైజీరియా) చేతిలో 3-7తో ఓడి న అన్షూమాలిక్‌ రజత పతకం అందుకుంది. మహిళల 68కి.లలో దివ్యా కక్రాన్‌.. టైగర్‌ లిల్లీ (టోంగా)పై గెలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. రెపిచేజ్‌ రౌండ్‌లో ఎన్‌గిరి (కామెరూన్‌)ను ఓడించిన దివ్య కాంస్య పోరుకు చేరింది. పురుషుల 125 కిలోల కాంస్య పోరులో మోహిత్‌ గ్రేవాల్‌ 6-0తో అరోన్‌ జాన్సన్‌ (జమైకా)పై గెలిచి పతకం దక్కించుకున్నాడు.  


సుధీర్‌ సత్తా

పోలియోతో దివ్యాంగుడిగా మారినా బెదిరిపోలేదు. ఆటల్లో తనదైన ముద్ర వేయాలన్న అతడి పట్టుదల కామన్వెల్త్‌లో పసిడి పతకం అందుకొనే స్థాయికి చేర్చింది. హరియాణాకు చెందిన సుధీర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్‌ హెవీవెయిట్‌ విభాగంలో అదరగొట్టాడు. ఆసియా పారా గేమ్స్‌ కాంస్య పతక విజేత సుధీర్‌ తొలి ప్రయత్నంలో 208కి. బరువెత్తాడు. రెండో యత్నంలో 212 కి.లి్‌ఫ్టచేసి 134.5 పాయింట్లు దక్కించుకున్నాడు. మూడోసారి 217 కి. ఎత్తేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. అయినా 134.5 టోటల్‌ పాయింట్లతో కామన్వెల్త్‌ నయా రికార్డు నెలకొల్పుతూ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. క్రిస్టియన్‌ (133.6) రజతం, మికీ యూలీ (130.9) కాంస్య పతకం చేజిక్కించుకున్నారు. 


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. మొదటిరోజే మనోళ్లు మూడు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్య పతకాలు కొల్లగొట్టారు. పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బజ్‌రంగ్‌ పూనియా అద్భుతంగా రాణించి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత బజ్‌రంగ్‌ 9-2తో లచ్లాన్‌ మెక్‌నీల్‌ (కెనడా)ను చిత్తుచేసి మరోసారి చాంపియన్‌గా నిలిచాడు. నాలుగు బౌట్లలో మూడింటిని బజ్‌రంగ్‌ కేవలం తొలి రౌండ్‌ లోపలే గెలిచాడంటే అతడు ఏస్థాయిలో చెలరేగాడో అర్థమవుతుంది. లో బింగామ్‌ (నౌరూ), జీన్‌ గులియన్‌ (మారిష్‌స)లను  ‘బైఫాల్‌’తో ఓడించిన బజ్‌రంగ్‌.. జార్జ్‌ రామ్‌ (ఇంగ్లండ్‌)ను సాంకేతిక ఆధిపత్యంతో మట్టికరిపించాడు. ఇక మహిళల 62 కిలోల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో అయితే సాక్షి మాలిక్‌ అసమానంగా పోరాడింది. కెనడా ప్రత్యర్థి గొంజాలెజ్‌తో ఫైనల్లో ఓ దశలో ఓటమి అంచున నిలిచిన సాక్షి.. ఆఖర్లో అద్భుతంగా పుంజుకొని గొంజాలెజ్‌ను పడదోసింది. ‘బైఫాల్‌’తో ఆమెను ఓడించి పసిడి పతకం సొంతం చేసుకుంది.


 శ్రీశంకర్‌ రికార్డు

పురుషుల లాంగ్‌జం్‌పలో మురళీ శ్రీశంకర్‌ రజత పతకం గెలుపొందాడు. తద్వారా అథ్లెటిక్స్‌లో భారత్‌ ఖాతాలో రెండో పతకం చేర్చాడు. గురువారం అర్ధరాత్రి నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల శంకర్‌ ఐదో ప్రయత్నంలో 8.08 మీ. లంఘించి పతకాన్ని ముద్దాడాడు. లక్వాన్‌ నెయిర్న్‌ (బహమాస్‌) స్వర్ణం గెలిచాడు. లక్వాన్‌ కూడా 8.08 మీ. అత్యుత్తమ దూరం దూకాడు. కానీ అతడి రెండో అత్యుత్తమ దూరం 7.98మీ., శ్రీశంకర్‌ రెండో బెస్ట్‌ 7.84మీ. కంటే ఎక్కువ కావడంతో నెయిర్న్‌కు టైటిల్‌ లభించింది. నిబంధనల ప్రకారం ఇద్దరు జంపర్లు ఒకే దూరం నమోదు చేస్తే..రెండో అత్యుత్తమ జంప్‌ ఎవరిది మెరుగ్గా ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారు. జొవాన్‌ వాన్‌ ఊరెన్‌ (సౌతాఫ్రికా, 8.06మీ.) కాంస్యం నెగ్గాడు. మరో భారత జంపర్‌ మహ్మద్‌ అనీస్‌ యహియా (7.97మీ) ఐదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్‌లో పురుషుల లాంగ్‌జం్‌పలో రజతం సాధించిన తొలి భారత పురుష అథ్లెట్‌గా మురళీ రికార్డు నెలకొల్పాడు. 


భళా..భవినా

టోక్యో పారా ఒలింపిక్స్‌లో రజత పతకంతో సత్తా చాటిన భవినా పటేల్‌ కామన్వెల్త్‌లోనూ జోరు కొనసాగిస్తూ మహిళల సింగిల్స్‌ 3-5 విభాగంలో ఫైనల్‌కు దూసుకుపోయింది. తద్వారా భారత్‌కు ఓ పతకం ఖరారు చేసింది. సెమీ్‌సలో 11-6, 11-6, 11-6తో స్యూ బెయిలీ (ఇంగ్లండ్‌)ను భవినా చిత్తు చేసింది. 35 ఏళ్ల గుజరాత్‌ ప్లేయర్‌ శనివారం జరిగే స్వర్ణ పతక పోరులో క్రిస్టియానా (నైజీరియా)తో అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీ్‌సలో సొనాల్‌బెన్‌ పటేల్‌ 11-8, 6-11, 4-11, 7-11తో ఇక్‌పియోయి చేతిలో ఓడింది. దాంతో భవినా చేతిలో పరాజయం పాలైన బెయిలీతో కాంస్య పతకం కోసం సొనాల్‌బెన్‌ తలపడుతుంది. పురుషుల 3-5 కేటగిరీ సెమీఫైనల్లో రాజ్‌ అరవిందన్‌ 11-7, 8-11, 4-11, 7-11తో నసీరు (నైజీరియా)పై ఓడిపోయాడు. ఫలితంగా అతడు కాంస్య పతకం కోసం ఇసావు (నైజీరియా)ను ఢీకొంటాడు. 




 రెండు రోజుల భారత స్వర్ణ పతక ఎదురుచూపులకు కుస్తీ వీరులు తెరదించారు. రెజ్లింగ్‌ పోటీల తొలిరోజే మనోళ్లు అదిరిపోయే ‘పట్టు’ పట్టారు. దాంతో కుస్తీలో  ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు భారత్‌ ఖాతాలో చేరాయి. స్టార్లు బజ్‌రంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, దీపక్‌ పూనియా పసిడి పతకాలతో ఔరా అనిపించగా.. అన్షూమాలిక్‌ రజతం, దివ్యా కక్రాన్‌, మోహిత్‌ కాంస్యాలతో మెరిశారు. అంతకుముందు పారాలిఫ్టర్‌ సుధీర్‌ కూడా బంగారు పతకంతో సత్తాచాటాడు. లాంగ్‌జంప్‌లో అంచనాలను నిలబెట్టుకున్న మురళీ శ్రీశంకర్‌ రజతంతో అబ్బురపరిచాడు. ఇక పారా టీటీ సింగిల్స్‌లో భవినా పటేల్‌ తుది పోరుకు, బాక్సర్‌ రోహిత్‌ సెమీస్‌కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. 


Updated Date - 2022-08-06T10:20:26+05:30 IST