పతకం ‘పట్టే’యాలని..

ABN , First Publish Date - 2021-05-13T06:16:36+05:30 IST

సీమా బిస్లా.. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన ఈమె టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత నాలుగో మహిళా రెజ్లర్‌గా ఘనత వహించింది. ఇటీవల బల్గేరియా రాజధాని సోఫియాలో...

పతకం ‘పట్టే’యాలని..

  • రోహ్‌తక్‌ నుంచి టోక్యో వరకు
  • రెజ్లర్‌ సీమా బిస్లా ప్రస్థానం


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

సీమా బిస్లా.. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన ఈమె టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత నాలుగో మహిళా రెజ్లర్‌గా ఘనత వహించింది. ఇటీవల బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరడం ద్వారా బిస్లా టోక్యో బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఆ టోర్నీలో సీమ ఏకంగా స్వర్ణం పట్టేసింది. వాస్తవంగా సీమా బిస్లాది రోహ్‌తక్‌ జిల్లాలోని గుంధన్‌ గ్రామం. చిన్నకారు రైతు అయిన ఆమె తండ్రి ఆజాద్‌ సింగ్‌ కూడా రెజ్లర్‌. అలా సీమకు సహజంగానే రెజ్లింగ్‌పై ఆసక్తి కలిగింది. అయితే గ్రామంలో ఉంటే ఆమె తన నైపుణ్యాలను మెరుగుపర్చుకోలేదు. అలాగని రోహ్‌తక్‌ పంపేందుకు తండ్రి ఆర్థిక పరిస్థితి అనుకూలించని దుస్థితి. పైగా తండ్రి క్యాన్సర్‌ పేషెంట్‌ కూడా. దాంతో నలుగురు అక్కలలో పెద్దదైన సుశీల, ఆమె భర్త నఫెసింగ్‌.. సీమను మేటి రెజ్లర్‌గా తీర్చిదిద్దే బాధ్యత చేపట్టారు. హరియాణా పోలీసు విభాగంలో సహాయ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన నఫెసింగ్‌ తన జీతంలో అధికభాగం సీమ శిక్షణ కొరకే వినియోగించాడు. 




2009లో బ్రేక్‌..

రోహ్‌తక్‌లో శిక్షణ ద్వారా జాతీయస్థాయి రెజ్లర్‌గా ఎదిగిన సీమ.. 2009లో పుణెలో జరిగిన ఏషియా కేడెట్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది. కానీ మూడేళ్ల తర్వాత మెడ, భుజం గాయాల కారణంగా రెగ్యులర్‌గా తాను తలపడే 53 కిలోల విభాగం నుంచి 67 కేజీలకు మారింది. ఆ కేటగిరీలో 2012లో జూనియర్‌ నేషనల్స్‌ టైటిల్‌ అందుకున్న సీమ.. 2012, 2013లో ఏషియన్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్సలో వరుసగా కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. తిరిగి 53 కేజీల విభాగంలోకి మారిన ఆమె.. 2015, 2016లో సీనియర్‌ నేషనల్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. 2017లో రైల్వేలో ఉద్యోగంలో చేరిన సీమ.. ఆ తర్వాత పరమ్‌జీత్‌ యాదవ్‌కోచింగ్‌లో మరింత రాటుదేలింది. బిస్లాలోని లోపాలను సరిదిద్దిన పరమ్‌జీత్‌ ఆమెను మేటిగా తీర్చిదిద్దాడు. ఇక 2018లో స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ 53 కిలోలకు మారడంతో సీమ మరోసారి తన కేటగిరిని ప్రస్తుత 50 కేజీలకు మార్చుకుని ఒలింపిక్స్‌ బెర్త్‌ పట్టేసింది. 


జాతీయ పోటీలలోనే గెలుస్తానని అనుకోలేదు. ఇక.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించానన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అవకా శాన్ని సద్వినియోగం చేసుకొని కచ్చితంగా పత కంతో తిరిగొస్తా.            - సీమా బిస్లా 


Updated Date - 2021-05-13T06:16:36+05:30 IST