శిథిల దద్దణాల

ABN , First Publish Date - 2022-04-25T05:11:12+05:30 IST

బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు దద్దణాల. దీని వల్ల ప్రత్యక్షంగా 1,516 ఎకరాలకు, పరోక్షంగా పది వేల ఎకరాలకు సాగు నీరు, 15 గ్రామాలకు తాగునీరు దీని ద్వారా అందుతోంది.

శిథిల దద్దణాల

13 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని గేట్లు 

10 అడుగులకు చేరిన పూడిక 


బనగానపల్లె, ఏప్రిల్‌ 24: బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు దద్దణాల. దీని వల్ల ప్రత్యక్షంగా 1,516 ఎకరాలకు, పరోక్షంగా పది వేల ఎకరాలకు సాగు నీరు, 15 గ్రామాలకు తాగునీరు దీని ద్వారా అందుతోంది. 13 ఏళ్లుగా ప్రధాన గేట్లు, పూడిక గేట్లకు మరమ్మతు చేయలేదు. ఒక ప్రధాన గేటు, రెండు పూడిక గేట్లు, పంట పొలాలకు నీటిని వదిలే స్లూయిస్‌ గేట్ల నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 


ప్రాజెక్టు నిర్మాణం ఇలా..


దద్దణాల ప్రాజెక్టును బనగానపల్లె మండలం పాతపాడు గ్రామ సమీపంలోని రెండు ఎరమల కొండల మధ్య నిర్మించారు. 1959లో అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత పెండేకంటి వెంకటసుబ్బయ్య చొరవతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో 0.02 టీఎంసీల నీటి నిల్వ చేసే విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. 1516 ఎకరాలకు ప్రత్యక్షంగా సాగు నీరందించడంతోపాటు 15 గ్రామాల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించడమే ప్రాజెక్టును ఉద్దేశం. కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజలు రెండు కార్లు పంటలు పండించుకునేవారు. వర్షాభావ పరిస్థితుల వల్లనీరు లేక ప్రాజెక్టు వెలవెలబోతోంది. 12 ఏళ్లుగా ఏనాడూ ఈ ప్రాజెక్టు నిండిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద కొండలపై వచ్చే వర్షపు నీటికి అడ్డుకట్ట వేస్తూ పెద్ద చెక్‌డ్యాంను నిర్మించారు. అప్పట్నుంచి వర్షపు నీరు ఆ చెక్‌డ్యాంలోకి వెళ్లిపోతుండడంతో దద్దనాల ప్రాజెక్టుకు నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎస్సార్బీసీ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి పనులు పూర్తి చేయడంతో నాలుగేళ్ల నుంచి ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. 


13 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రధాన గేట్లు 


దద్దణాల ప్రాజెక్టుకు గతంలో వర్షపు నీరు సరిగ్గా రాకపోవడం, ప్రాజెక్టు నిండకపోవడంతో మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం మానేశారు. ప్రాజెక్టుకు సంబంధించి గత 13 ఏళ్ళుగా ఒక ప్రధాన గేటు, పూడిక గేట్లు, పంట పొలాలకు నీరు అందించే స్లూయిస్‌ గేట్లు పూర్తిగా పనిచేయడం లేదు. గత మూడేళ్ల క్రితం ప్రధాన గేట్లకు సంబంధించి మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినా ఒక గేటు మాత్రమే మరమ్మతులకు నోచుకుంది. ఒక్క గేటు మాత్రం నేటికీ మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పూడికగేట్లు, స్లూయిస్‌ గేట్లు కూడా మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే ప్రాజెక్టులో నీరు రాకపోవడంతో 10 అడుగులకు పైగా లోతు పూడిక తో నిండిపోయింది.


దెబ్బతిన్న పంట కాల్వలు, ప్రాజెక్లు ప్లాట్‌ఫాం


గత కొన్ని ఏళ్లుగా పంటకాల్వలు దెబ్బతిన్నాయి. పంట కాల్వలు ముళ్ల కంపలతో నిండిపోయాయి. ప్రాజెక్టు ప్లాట్‌ఫారాన్ని కూడా కనీసంగా మరమ్మతు చేయలేదు. పంటకాల్వలు లేక రైతులు బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. సుమారు 1,516 ఎకరాల పంటకాల్వలు శిథిలమై ముళ్ల కంపలతో నిండిపోయాయి. 


ప్రాజెక్టు మరమ్మతు కోసం రూ.14.12 కోట్లతో ప్రతిపాదనలు


దద్దణాల ప్రాజెక్టు గేట్లు, పూడికగేట్లు, ప్లాట్‌ఫారం, కాల్వల నిర్మాణం, లైనింగ్‌, జనరేటర్‌ ఇతర పనులకు రూ.14.12 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. 


-మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈ నవజీవన్‌రెడ్డి

Updated Date - 2022-04-25T05:11:12+05:30 IST