Abn logo
Jan 13 2021 @ 04:57AM

గాయాల ‘గాబా’రా!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముందుకు సాగుతున్నా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్య జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాయాల కారణంగా జట్టులో కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మ్యాచ్‌లకు దూరమవుతున్నారు. తాజాగా పేస్‌ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో బ్రిస్బేన్‌ టెస్ట్‌ నుంచి అవుటయ్యాడు. అశ్విన్‌ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. కనీసం వంగడానికి శరీరం సహకరించకపోయినా అశ్విన్‌ సిడ్నీలో బ్యాటింగ్‌ చేశాడు. దీనికితోడు ఆసీస్‌ పేసర్లు విసిరిన షార్ట్‌ బాల్స్‌ శరీరానికి తగలడంతో మరింత విలవిల్లాడాడు.


అద్భుతమైన డిఫెన్స్‌తో ఆసీస్‌ బౌలర్లను నిలువరించిన బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి కూడా తొడకండర గాయమైంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేలు ఫ్రాక్చర్‌ కావడంతో సిరీ్‌సకు దూరమయ్యాడు. బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ కూడా గాయపడిన జాబితాలో చేరిన నేపథ్యంలో.. శుక్రవారం నుంచి గాబా స్టేడియం వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్‌కు టీమిండియా ‘ఫిట్‌ లెవెన్‌’ను ఎంపిక చేయడం కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ రహానెకు విషమ పరీక్షలా మారింది. మొత్తంగా ‘మినీ హాస్పిటల్‌’ను తలపిస్తున్న టీమిండియాలో గాయపడిన ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి. 

మహ్మద్‌ షమి: ఆసీస్‌ టూర్‌లో షమి రూపంలో తొలి దెబ్బ తగిలింది. అడిలైడ్‌ టెస్ట్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కమిన్స్‌ వేసిన షార్ట్‌ బాల్‌ తగలడంతో అతని చేతి ఎముక చిట్లింది. దీంతో మిగతా మూడు టెస్ట్‌లకు దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు కూడా షమి సందేహమే.

ఉమేష్‌ యాదవ్‌: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఉమే్‌షకు కండర గాయమైంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తూ అర్ధంతరంగా తప్పుకొన్నాడు. పునరావాసం కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు.  

కేఎల్‌ రాహుల్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన కేఎల్‌ రాహుల్‌.. టెస్ట్‌ల్లో చోటుదక్కించుకొనే సమయంలో గాయమైంది. ఎంసీజీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా మణికట్టుకు గాయమైంది.
 త్వరగా కోలుకొనేందుకు అతడిని భారత్‌కు పంపించారు. రాహుల్‌ లేకపోవడంతో మిడిల్డార్‌లో బ్యాకప్‌ ఆటగాడు లేకుండా పోయాడు. 

రవీంద్ర జడేజా: సిడ్నీ టెస్ట్‌లో స్టార్క్‌ వేసిన షార్ట్‌ డెలివరీని ఆడే క్రమంలో బంతి జడేజా బొటనవేలిని తాకింది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్‌గా తేలడంతో రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. 

రిషభ్‌ పంత్‌: సిడ్నీ టెస్ట్‌లో కమిన్స్‌ వేసిన బంతి మోచేతికి తగలడంతో రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ కీపింగ్‌ చేయలేకపోయాడు. అయితే, అతని చేతి ఎముకకు ఎలాంటి ఫ్రాక్చర్‌ కాకపోవడం ఊరటనిచ్చే విషయం. నాలుగోటెస్ట్‌లో పంత్‌ ఆడే చాన్సుంది. 

హనుమ విహారి: సిడ్నీ హీరో విహారికి తొడ కండర గాయమైంది. 161బంతులు ఎదుర్కొన్న విహారి.. అశ్విన్‌ సాయంతో మ్యాచ్‌ను డ్రా చేశాడు. అయితే, గాయం తీవ్రమైనది కావడంతో గాబా టెస్ట్‌తోపాటు ఇంగ్లండ్‌ సిరీస్‌కూ దూరం కానున్నాడు.  

రవిచంద్రన్‌ అశ్విన్‌: ఈ సిరీ్‌సలో 134 ఓవర్లకుపైగా బౌలింగ్‌ చేసిన అశ్విన్‌.. వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. కనీసం వంగి షూ లేస్‌ కూడా కట్టుకోలేని పరిస్థితి. అయితే, ఫిజియోథెరపీతో పాటు పెయిన్‌కిల్లర్స్‌ తీసుకొని అతడు నాలుగో టెస్ట్‌లో ఆడే అవకాశముంది. 

మయాంక్‌ అగర్వాల్‌: తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమవడంతో మూడో టెస్ట్‌లో అగర్వాల్‌కు చోటు దక్కలేదు. అయితే, విహారి స్థానంలో మయాంక్‌కు చోటు కల్పించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కానీ, నెట్‌ ప్రాక్టీ్‌సలో చేతికి బంతి తగలడంతో అతడిని స్కానింగ్‌కు తీసుకెళ్లారు. స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement