అడుగడుగునా అధ్వానమే..

ABN , First Publish Date - 2022-05-07T06:30:42+05:30 IST

అడుగుకో గొయ్యి. రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు వాహనచోదకులు.

అడుగడుగునా అధ్వానమే..
గనిఆత్కూరు - చెవిటికల్లు రోడ్డు దుస్థితి ఇది

రోడ్డెక్కాలంటేనే భయం

ఈ దారులు బాగుపడేదెప్పటికో?

రహదారు‘ణా’లు-2


అడుగుకో గొయ్యి. రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు వాహనచోదకులు. రహదారుల అభివృద్ధి మాటనే మరిచారు పాలకులు. మారుమూల గ్రామాల్లోనే కాదు.. జిల్లా కేంద్రమైన విజయవాడలోనూ రహదారులు నరకమార్గాలే. జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాలన్నా దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించలేక దూరాన్ని లెక్కచేయక, చుట్టూ తిరిగి వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌) : సాఫీగా ప్రయాణం సాగించే రహదారులు చాలా తక్కువ జిల్లాలో. పది నిమిషాల్లో ప్రయాణించే దూరానికి అర్ధగంట సమయం వెచ్చించాలి. ఎక్కడ ఏ గొయ్యి ఉంటుందో.. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పడం కష్టం. ఇక రాత్రి వేళ ప్రయాణమంటే వాహనచోదకులకు దడే. జిల్లా ప్రజలకు నరకం కళ్లెదుటే కనిపిస్తోంది.   


ప్రమాదాల మార్గం

పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు - గుమ్మడిదుర్రు రహదారి అధ్వానంగా తయారు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనిగండ్లపాడు నుంచి గుమ్మడిదుర్రు పెద్ద కాలువ వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల రహదారి దారుణంగా తయారైంది. గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు తిరుపతమ్మ దర్శనం కోసం వచ్చే వీరులపాడు, ఎర్రుబాలెం ప్రాంతాల భక్తులు ఈ రోడ్డు మీదుగానే రావాలి. ఈ రోడ్డు అధ్వానంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 


చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే 

వత్సవాయి మండలంలోని ఇందుగపల్లి - పెదమోదుగపల్లి రోడ్డు రామచంద్రాపురం వద్ద దారుణంగా తయారైంది. చెరువుకట్ట వద్ద తారురోడ్డు రూపు మారి రాళ్లు, కంకర తేలి మట్టిరోడ్డుగా కనిపిస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన జగ్గయ్యపేట వెళ్లాలంటే చిట్యేల, కన్నెవీడు, ఇందుగపల్లి, రామచంద్రాపురం గ్రామస్థులకు ఈ రోడ్డే ఆధారం. కానీ రోడ్డు సరిగా లేకపోవడంతో నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగి మంగొల్లు మీదుగా జగ్గయ్యపేట వెళుతున్నారు. ఇందుగపల్లి -పెదమోదుగపల్లి రోడ్డుకు మూడేళ్లుగా దోసెడు మట్టి కూడా పోయలేదు. దీంతో ఈ రోడ్డు ప్రయాణానికి వీలుగాలేకుండా పోయింది. ఆటోలవాళ్లు ఇటువైపు రావడమే మానేశారు. పెదమోదుగపల్లి గ్రామస్థులు సైతం మండల కేంద్రమైన వత్సవాయికి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగి మక్కపేట మీదుగా వెళుతున్నారు.  





Read more