Tokyo నగరంలో గత 150 ఏళ్లలో ఎరుగని ఎండలు.. విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-06-28T16:25:58+05:30 IST

జపాన్‌(Japan) వాసులు వేసవితాపాన్ని తాళలేకపోతున్నారు. ఆ దేశ రాజధాని టోక్యో(Tokyo)లో గత 150 ఏళ్లలో చూడని ఎండలు దంచికొడుతున్నాయి.

Tokyo నగరంలో గత 150 ఏళ్లలో ఎరుగని ఎండలు.. విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు

టోక్యో : జపాన్‌(Japan) వాసులను తీవ్ర ఎండలు దంచికొడుతున్నాయి. ఆ దేశ రాజధాని టోక్యో(Tokyo)లో గత 150 ఏళ్లలో చూడని వేసవితాపాన్ని చవిచూస్తున్నారు. టోక్యోలో మంగళవారం 36 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత(Temparature) నమోదయింది. రికార్డ్ స్థాయిలో వరుసగా 4వ రోజు 35 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత రికార్డయింది. 1875 జూన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం(Electricity consumption) భారీగా పెరిగిపోయింది. సప్లయ్‌(supply)లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిటీ అధికారులు వెల్లడించారు. విద్యుత్ కోతలు(Power cuts) పెరిగాయని తెలిపారు.


తీవ్ర ఎండల వడదెబ్బతో టోక్యో నగరంలో హాస్పిటల్‌లో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు అధికారులు కీలకమైన సూచనలు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ఫేస్‌మాస్క్(Facemask) ధరించాలని సూచించారు. కరోనా(Corona) సమయంలో వాడినట్టుగానే ఎండలో ఉన్నప్పుడు మాస్క్‌ని వినియోగించాలని పేర్కొన్నారు. కాగా మరో రెండు వారాల్లోనే జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి జనాల్ని ఎండలు దంచికొడుతున్నాయి. జపాన్ మీడియా ‘ఫ్యూజీ న్యూస్ నెట్‌వర్క్’ సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి టోక్యోలో 13 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇద్దరు చనిపోయినట్టుగా మీడియా వివరించింది. 


విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు..

విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు కారణంగా ‘పవర్ సేవింగ్‌’కు ప్రాధాన్యత ఇవ్వాలని టోక్యో వాసులను మంత్రులు కోరారు. విద్యుత్ జనరేటింగ్ కెపాసిటీ తగ్గిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రిపూట లైట్లు ఆపివేశారు. కార్యాలయాల్లో ఎలివేటర్ల వినియోగాన్ని కూడా నిలిపివేశారు. తీవ్ర ఎండలు, విద్యుత్ కోతల నేపథ్యంలో యాహూ జపాన్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌కండీషనర్ల సాయంతో వేసవితాపాన్ని తప్పించుకోగలుతున్నా.. ఏసీలు ఆపివేస్తున్నామని 53 శాతం మంది టోక్యో వాసులు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బయటకి వెళ్లినప్పుడు మాస్కులు వినియోగించడంలేదని 12 శాతం మంది అన్నారు.

Updated Date - 2022-06-28T16:25:58+05:30 IST