జగనన్న కాలనీలకు దారేదీ!

ABN , First Publish Date - 2022-07-25T04:03:39+05:30 IST

జగనన్న ఇళ్ల కాలనీలను సమస్యలు వెంటాడుతున్నాయి. నివాసయోగ్యానికి అనుకూలంగా లేకపోవడంతో చాలా చోట్ల ఖాళీ స్థలాలే దర్శనమిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు, అధికారపార్టీ నేతలు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సదుపాయాలు లేక నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీల్లో రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి చెరవులను తలపిస్తున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు.

జగనన్న కాలనీలకు దారేదీ!
పలాస : కోసంగిపురం లేఅవుట్‌ అధ్వానంగా రహదారి

- అధ్వానంగా రహదారులు

- లోతట్టు ప్రాంతాల్లో లేఅవుట్‌లు

- చెరువులను తలపిస్తున్న పరిసరాలు

- విద్యుత్‌, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు

- కానరాని మౌలిక వసతులు 

- నత్తనడకన ఇళ్ల నిర్మాణాలు 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

జగనన్న ఇళ్ల కాలనీలను సమస్యలు వెంటాడుతున్నాయి. నివాసయోగ్యానికి అనుకూలంగా లేకపోవడంతో చాలా చోట్ల ఖాళీ స్థలాలే దర్శనమిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు, అధికారపార్టీ నేతలు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సదుపాయాలు లేక నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీల్లో రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి చెరవులను తలపిస్తున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. అసౌకర్యాల నడుమ ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియక సతమతమవుతున్నారు. శ్రీకాకుళం నగర ప్రజలకు సంబంధించి రాగోలు, పాత్రునివలస-1, పాత్రునివలస-2, పొన్నాడ వద్ద ఇళ్ల స్థలాలను కేటాయించారు. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత్రునివలస-1 వద్ద రోడ్డు మొత్తం పాడైపోవడంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం లేదు. పాత్రునివలస-2లో ఇళ్ల చుట్టూ వర్షపునీరు చేరడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక, సిమెంట్‌ తదితర నిర్మాణ సామగ్రి ఉంచేందుకు వీలు పడక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పొన్నాడలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అలాగే నీటి సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 819 జగనన్న కాలనీల్లో బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. పొన్నాడ వద్ద బోర్లు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. ట్యాంకులకు కుళాయిలు ఏర్పాటు చేసినా ఒక కుళాయి నుంచి మాత్రమే నీరు వస్తోంది. పొన్నాడలో మరో ప్రాంతం వద్ద నీటి వసతి లేక.. ఇళ్ల నిర్మాణం కోసం ట్యాంకులతో నీటిని తెప్పిస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపెడు అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక విద్యుత్‌ స్తంభాలను అమర్చుతున్నారు. యాభై శాతం కూడా విద్యుదీకరణ జరగకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.  


పూర్తయినవి 7523 ఇళ్లు మాత్రమే..

జిల్లావ్యాప్తంగా ‘పేదలందరికీ ఇళ్లు’ పఽథకంలో భాగంగా 83,456 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటివరకు 7,523 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 74,458 ఇళ్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అయ్యాయి.  35,542 ఇళ్లు.. పునాదుల కోసం గోతులు సిద్ధంచేశారు.  9,778 ఇళ్లు పునాదుల స్థాయిలో ఉన్నాయి. రూఫ్‌లెవల్‌లో 4656 ఇళ్లు ఉన్నాయి. 11054 ఇళ్లు శ్లాబు పూర్తయ్యాయి. ఇంకా 5,285 ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభించలేదు. కేటాయించిన స్థలాలు నచ్చకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, నిర్మాణ వ్యయం పెరగడమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.  


జిల్లాలో ఇదీ పరిస్థితి


- ఆమదాలవలస/రూరల్‌: మునిసిపాలిటీలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 2,158 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. గాజులకొల్లివలస, తిమ్మాపురం, చింతాడ సమీపంలో స్థలాలు కేటాయించారు. చింతాడ లేఅవుట్‌లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో  ఒక్కరు కూడా నిర్మాణానికి ముందుకు రాలేదు. తిమ్మాపురంలో 8 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ పూర్తయ్యాయి. గాజులకొల్లివలసలో రెండు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నిమ్మతొర్లవాడలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ గత ఏడాది సెప్టెంబరులో ముంపునకు గురైంది. దీంతో నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. మండలంలోని పలు గ్రామాల్లో కాలనీల నిర్మాణాలకు స్థలాలు అందుబాటులో లేవు.  


- ఇచ్ఛాపురం/రూరల్‌: మునిసిపాలిటీ పరిధిలో 1547 గృహాలు మంజూరు కాగా 616చోట్ల  పనులు ప్రారంభం కాలేదు. రత్తకన్న, పురుషోత్తపురం, ఏఎస్‌పేటల్లో లేఅవుట్లు వేశారు. రత్తకన్న సమీపంలో 432 గృహ నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఏఎస్‌పేట వద్ద మంజూరైన 593 గృహాలలో ఒక్కటీ కూడా పనులు ప్రారంభం కాలేదు.  డబ్బులు లేక కొంతమంది, ఇసుక, సిమెంట్‌ అందుబాటులో లేక మరికొందరు, పనులు సగంలోనే నిలిపివేశారు. మండలంలో 20 లేఅవుట్లలో 853 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 280 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ధర్మపురం, తులసిగాం పంచాయతీల్లో లోతట్టు ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేయడంతో బురదమయమవుతున్నాయి. దీంతో నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. 


- కవిటి : కొత్తపాలెంలో పంటపొలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పరిసర ప్రాంతాలు జలమయమవుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


- కంచిలి: మండలంలో 2429 గృహాలు మంజూరు కాగా.. 1530 గృహాలకే లేఅవుట్లు వేశారు. మఖరాపురం వద్ద ఇళ్ల నిర్మాణాలకు గోతులు తవ్వి విడిచిపెట్టారు. మరికొన్నిచోట్ల పునాదుల లెవల్‌ వరకు నిర్మించి నిలిపివేశారు.  


- ఎచ్చెర్ల: మండలంలో 45 జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు రుప్పపేటలో స్థలాన్ని సేకరించారు. ఈ లేవుట్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు కూడా లేదు. దీంతో ఇక్కడి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి కూడా ముందుకు రావడంలేదు. 


- గార : మండలంలో 900 ఇళ్లను మంజూరు చేయగా.. సుమారు 600 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రహదారులు, విద్యుత్‌ సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. శాలిహుండం కొండపక్కన ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో నీటికోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. 


- రణస్థలం:  మండలంలో 1445 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. రణస్థలం, జేఆర్‌పురం పంచాయతీ పరిధిలో 272 మంది లబ్ధిదారులకు బీరు పరిశ్రమ సమీపాన ఇళ్ల స్థలాలు కేటాయించడంతో నేటికీ పనులు ప్రారంభించలేదు. రోడ్లు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయక.. ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 


- పలాస : కోసంగిపురం రహదారిలో ఉన్న జగనన్న కాలనీ పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు కురుస్తుండడంతో రహదారులన్నీ బురదగా మారాయి. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాయి. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు మూడు గృహాలకు 50 ఎకరాలు కేటాయించారు. ఎక్కడా మౌలిక వసతులు కానరావడం లేదు. నిర్మాణాలకు అవసరమైన నీటిని లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారు. నిర్మాణాలు ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు, పాలకులు హెచ్చరిస్తుండడంతో అప్పు చేసి నిర్మాణాలు సాగిస్తున్నారు.  


- టెక్కలి రూరల్‌: ఆంజనేయపురం గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఆదిఆంధ్రావీధి దరి వంశధార కాలువ పక్క నుంచి లేఅవుట్‌కు వెళ్లే మార్గం బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి కాలనీల్లో రహదారుల రూపురేఖలు మారిపోయాయి. 


- నరసన్నపేట: జమ్ము పంచాయతీల్లో పరిధిలో రావాడపేట, గడ్డెయ్యపేట, జమ్ము గ్రామాల్లో నరసన్నపేట, జమ్ము, బొరిగివలస, నరసన్నపేట పంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు ఆరు లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లేఅవుట్లు లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. పునాదులకే సుమారు రూ.2లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


- మందస: మందసలో 279 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా ఏడుగురు మాత్రమే శ్లాబ్‌ లెవల్‌ వరకూ నిర్మాణాలు చేపట్టారు. 20 మంది పునాదుల స్థాయి వరకు పనులు చేశారు.  


- పోలాకి: ఈదులవలస, దీర్గాశి దుర్గాకాలనీ, కోడూరు, ప్రియాగ్రహారం, నర్సాపురం గ్రామాల్లో వేసిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈదులవలసలో శ్మశాన వాటికలో పట్టాలు ఇవ్వడంతో ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీర్గాశి దుర్గాకాలనీలో కనీసం మౌలిక వసతులు లేవు. కోడూరులో జీడితోటల మధ్య ఇవ్వడంతో నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నర్సాపురంలో నిర్మాణాలు జరుగుతున్నా బిల్లులు అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


- నందిగాం: మండలంలో వేసిన పది జగనన్న లేఅవుట్లు ఊరుకి దూరంగా ఉండడంతో నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. మొత్తం 2,940 మందికి ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. ఊరుకి దూరంగా కొండలకు ఆనించి ఉన్న స్థలాలే ఎక్కువగా ఉన్నాయి. కాపుతెంబూరు, పెద్దతామరాపల్లి, పెద్దలవునిపల్లి, జడ్యాడ, పెంటూరు(ఎస్సీ), దిమిలాడ, తురకలకోట, దిమ్మిడిజోల, గోవాడ, కొత్తగ్రహారం-1, నర్సిపురం-1 లేఅవుట్లలో పనులు ప్రారంభం కాలేదు. 


- జలుమూరు: జలుమూరు, చల్లవానిపేట, తిమడాం, నగిరికటకం గ్రామాల్లోని లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేవు. చినుకు పడితే రహదారులు దమ్ము మడిని తలపిస్తున్నాయి.  


- సంతబొమ్మాళి: మండలంలో 43 జగనన్న లేఅవుట్‌ల్లో 889 లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో 170 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో నిర్మాణాలు జరగుతున్నాయి. బోరుభద్ర, మలగాం, జగన్నాఽథపురం, ఉమ్మిలాడ, లక్కివలస, గెద్దలపాడు, పాతమేఘవరం, మర్రిపాడు, కోటపాడు, నరసాపురం, గోవిందపురం, కాకరాపల్లి, ఉద్దండపాలెం, గొదలాం గ్రామాల్లోని లేఅవుట్లలో ఒక్క నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. 


- హిరమండలం : మండలంలో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపునీరు చేరి.. ఇక్కడ నిర్మాణాలు సాధ్యమా అనే ఆలోచనకు పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-07-25T04:03:39+05:30 IST