Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు

- శిఽథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలు

- ప్రమాదపు అంచున పాఠశాలల్లోని విద్యార్థులు

- పలుచోట్ల పెచ్చులూడి విద్యార్థులపై పడిన సంఘటనలు

- కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కల్పించని పరిస్థితి

- ఎస్‌డీఎఫ్‌ పరిశీలనలో బయటపడ్డ ప్రభుత్వ పాఠశాలల తీరు

- జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తీరుపై ఎస్‌డీఎఫ్‌ బృందం పరిశీలన

- ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం గాలికి వదిలేసిందంటున్న బృందం ప్రతినిధులు

- పేద ప్రజలు చదివే పాఠశాలలను విస్మరించడం ఎంత వరకు సబబు

- ఽరూ.1500 కోట్లు రైతుబంధుకు పెట్టిన డబ్బులు పేద ప్రజలు చదివే పాఠశాలలకు ఖర్చు పెట్టరా?

- రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఎస్‌డీఎఫ్‌ ఫోరం ప్రతినిధి ఆకునూరి మురళి


కామారెడ్డి, కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 4: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి ప్రభుత్వాలు చేశాయి. కనీస వసతులు కల్పించకపోవడంతో ఆ బడులు కాస్తా శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేని పరిస్థితిగా మారాయి. ప్రభుత్వాలే కాకుండా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సైతం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతోందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు మానవహక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద విద్యా బోధనలు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఎదురవుతోంది. వేల కోట్ల నిధులను పలు పథకాలకు ప్రభుత్వాలు మంజూరు చేస్తుండగా ప్రతీ పౌరుడికి ప్రాథమిక హక్కు అయిన విద్యకు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యావ్యవస్థ నీరుగారే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో గ్రామీణ స్థాయి పేద విద్యార్థులు విద్యకు నోచుకోవడం లేదని పలు సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితి, పనితీరుపై ఎస్‌డీఎఫ్‌(సోషల్‌ డెమెక్రటిక్‌ ఫోరం) ప్రతినిధులు శనివారం పలు పాఠశాలలను పరిశీలించారు. ఈ పరిశీలనలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు వెలుగులోకి వచ్చాయి. 

కూలే దశకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలో వెయ్యికి పైగానే ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో చాలా వరకు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కులుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పెచ్చులు ఊడుతున్న సీలింగ్‌, కూలేదశకు చేరిన పాఠశాల భవనంలోని తరగతి గదిలో, లేదంటే చెట్ల కింద పాఠాలను బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెచ్చులు ఊడిన భవనాల సీలింగ్‌, పలు మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన నిధులు  ప్రభుత్వం నుంచి రాకపోవడంతో చాలా చోట్ల బిక్కుబిక్కుమంటునే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఇక వర్షాకాలంలో వర్షాలు పడి తరగతి గదులల్లో నీరు నిండిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయిన వాటికి పైపైనే మెరుగులు దిద్దించడంతో ఇవి మళ్లీ యదాస్థితికి చేరుకుంటున్నాయి. ఇక గంజ్‌ పాఠశాలలో తరగతి గది పెచ్చులు రాలడంతో కొద్దిమేర మరమ్మతులు చేపట్టినప్పటికీ కిటికీలు, తలుపులు, ఫర్నిచర్‌ మాత్రం అధ్వానస్థితిలోనే ఉన్నాయి.

పాఠశాల ఆవరణలు మరింత అధ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులతో పాటు ఇతర పనులు చేసేందుకు స్కావెంజర్లు, ఇతర సిబ్బంది గతంలో పని చేసినప్పటికీ ప్రభుత్వం స్కావెంజర్లను తీసివేసి గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందిచే ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయించాలని ఆదేశించింది. అయితే ఈ సిబ్బందికి అటు పట్టణం, పల్లెల్లో నెలకొన్న పారిశుధ్య పనులతోనే తీరిక లేకుండా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు అడపాదడప చూస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు, ఆవరణ అంతా మరింత అధ్వానంగా తయారయి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలలోనైతే విద్యార్థుల ఇబ్బందులు చూడలేక ఉపాధ్యాయులే తలా కొన్ని డబ్బులు వేసుకుని పాఠశాలలను శుభ్రం చేసే పరిస్థితులు నెలకొనడం కొసమెరుపు.

ఎస్‌డీఎఫ్‌ పరిశీలనలో వెలుగు చూసిన ప్రభుత్వ పాఠశాలల దుస్థితి

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎంతమేర ప్రాతినిథ్యం ఇస్తుందనే పలు అంశాలను పరిశీలించేందుకు రిటైర్డ్‌ ఐఎస్‌ఎస్‌ అధికారి ఆకునూరి మురళితో పాటు పలువురు ప్రొఫెసర్లు ఏర్పాటు చేసిన ఎస్‌డీఎఫ్‌ బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ వాడ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి, గర్గుల్‌ తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి  మాట్లాడుతూ  రైతుబంధుకు రూ.1500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పేద రైతులను ఆదుకుంటే తాము సమ్మతిస్తాం కానీ ధనిక రైతులకు కూడా డబ్బులు అందిస్తూ పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు నిధులు కేటాయించకుండా విద్యావ్యవస్థ కుంటుపడేలా చేస్తుండడం ఎంత వరకు సబబుఅని ప్రశ్నించారు. శనివారం ఉదయం నుంచి కామారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలిస్తే  పాఠశాలల్లోని పరిస్థితులు అత్యంత దయనీయస్థితిలో ఉన్నాయని కనీస సదుపాయాలు లేకుండా కొన్ని పాఠశాలలు మూసివేసిన పరిస్థితి తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్‌బోర్డు రాయలేని పరిస్థితి, విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యాలు, పాఠశాలలకు ప్రహారీలు లేవని, తరగతి గదులు పెచ్చులూడి గచ్చుపాడెందని, మంచినీరు కూడా లేని స్థితిలో పాఠశాలలు ఉన్నాయని కనీసం పారిశుధ్య కార్మికులు కూడా లేని దుస్థితి ఉందని తెలిపారు. తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలో భవనం మొత్తం కూలిపోవడంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను కుంటుపడేస్తున్నారని వారు తెలిపారు. శనివారం రాత్రి తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలో రాత్రి బస చేసి విద్యార్థులు, తండా ప్రజలతో మాట్లాడి వారి పిల్లలకు అందుతున్న విద్యపై చర్చించనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌డీఎఫ్‌ ప్రతినిధులు ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, రజిత, ప్రణతి, శుభశ్రీ, ప్రకాష్‌, బాబాన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement