అధ్వానంగా నర్సాపూర్‌-నత్నాయపల్లి రోడ్డు

ABN , First Publish Date - 2022-01-21T05:05:12+05:30 IST

నర్సాపూర్‌-నత్నాయపల్లి రోడ్డును డబుల్‌ రోడ్డుగా మారుస్తామని ప్రజాప్రతినిధులు హామీఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడం లేదు.

అధ్వానంగా నర్సాపూర్‌-నత్నాయపల్లి రోడ్డు
కొండాపూర్‌-నత్నాయపల్లి మధ్య గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్డు

గుంతలమయమైనా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు 

నర్సాపూర్‌, జనవరి 20 : నర్సాపూర్‌-నత్నాయపల్లి రోడ్డును డబుల్‌ రోడ్డుగా మారుస్తామని ప్రజాప్రతినిధులు హామీఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడం లేదు. దీంతో ఉన్న రోడ్డు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపంలోని కొండాపూర్‌ గేటు నుంచి కొండాపూర్‌, కాగజ్‌మద్దూర్‌, నత్నాయపల్లి మీదుగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని పలు గ్రామాల నుంచి పటాన్‌చెరుకు ఈ రోడ్డు ఉన్నది. పటాన్‌చెరుకు ఈ రోడ్డు దగ్గర అవుతుండటంతో నర్సాపూర్‌ ప్రాంతం నుంచి పటాన్‌చెరు వెళ్లేవారు ఇదే రోడ్డును ఆశ్రయిస్తారు. ఇంత ప్రాధాన్యం ఉన్న రోడ్డును స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి డబుల్‌రోడ్డుగా మారుస్తానని మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హామీఇచ్చారని, కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదన్నారు. కనీసం ఉన్న రోడ్డునైనా బాగు చేయిస్తారానకుంటే అదీ లేకపోవడంతో ఆ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు. అంతేకాకుండా పలుమార్లు గుంతల వద్ద అదుపు తప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా చేసి ఈ ప్రాంత ప్రజల, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-21T05:05:12+05:30 IST