చిల్లకంపతో నిండిన సాగర్‌ కాలువ

ABN , First Publish Date - 2022-08-20T05:55:16+05:30 IST

అన్నదాతలు సక్రమంగా తమ పొలాల్లో పంటలు పండించాలంటే వర్షాలు కురవాలి. జలాశయాలు నిండాలి, ఆ నీరు కాలువల ద్వారా పొలాలకు చేరాలి.

చిల్లకంపతో నిండిన సాగర్‌ కాలువ
చిల్లకంపతో నిండిన సాగర్‌ కాలువ

త్రిపురాంతకం, ఆగస్టు 19: అన్నదాతలు సక్రమంగా తమ పొలాల్లో పంటలు పండించాలంటే వర్షాలు కురవాలి. జలాశయాలు నిండాలి, ఆ నీరు కాలువల ద్వారా పొలాలకు చేరాలి. అయితే జలాశయాల్లో నీరున్నా అధికారులు పొలాలకు నీరు వదిలితే మాత్రం ఆ నీరు పొలాలకు చేరే అవకాశం కనిపించడంలేదు. మేజర్లు, మైనర్లలో పిచ్చికంప విపరీతంగా పెరిగి అడవులను తలపించడంతో నీరు పారే అవకాశం లేకుండా పోతోంది.

త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌డివిజన్‌లో 12 మేజర్లు, 60 మైనర్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు 35 మంది వరకు లస్కర్లు, ఆరుగురు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉంది. అయితే   ముగ్గురు లస్కర్లు ముగ్గురు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కాలువలలో పిచ్చి కంపను తొలగించే నాథుడే కరువయ్యాడు. సిబ్బంది సరిపోక పోవడంతో కార్యాలయ సిబ్బందిని, మహిళా మజ్దూర్‌లను కూడా కాలువలపై విధుల్లో ఉపయోగిస్తున్నా కంపను తొలగించే పరిస్థితి లేదు. దీంతో సాగర్‌ జలాలు పొలాలకు ఎంతవరకు వస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో శ్రీశైలం జలాశయానికి, నాగార్జునసాగర్‌కు నీరు భారీగా చేరింది. దీంతో పంటలు  సాగు చేసేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ సాగర్‌ జలాలు వచ్చేందుకు కాలువల్లో పిచ్చికంప విపరీతంగా పెరగడం అవి తొలగించకపోవడం, పలు ప్రాంతాల్లో మేజర్లకు గండ్లు పడడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెస్పీ అధికారులు మేజర్లు, మైనర్లపై దృష్టిసారించి గండ్లకు మరమ్మతులు చేయించాలని, పిచ్చికంపను తొలగించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2022-08-20T05:55:16+05:30 IST