పనిహక్కు భావనను ఆమోదించి, అమలుపరచాల్సిన సమయం ఆసన్నమయిందా? అవును అనేదే ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం. తీవ్రమవుతున్న నిరుద్యోగ సంక్షోభం, దాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను నిశితంగా గమనిస్తే పనిహక్కు ఆవశ్యకత తేటతెల్లమవుతుంది. పని చేయగల సామర్థ్యమున్న ప్రతి ఒక్కరికీ జీవనాధారాన్ని లేదా పరిహారాత్మక భత్యాన్ని సమకూర్చగల ఒక బృహత్ విధానాన్ని చట్టబద్ధమైన పూచీతో మనం రూపొందించుకుని, అమలుపరచుకోవలసిన అవసరముంది. పనిహక్కు ఆవశ్యకత గురించిన వాదన మూడు ప్రశ్నలకు సమాధానమిచ్చి తీరాలి. అవి: మనకు ఆ హక్కు అవసరమా? నిరుద్యోగ సమస్యకు అది సరైన పరిష్కారమా? సత్ఫలితాలు ఇచ్చే విధంగా దాన్ని అమలుపరచుకోగలమా? మరింత ముఖ్యమైన ప్రశ్న : పనిహక్కు అమలుకు అవసరమైన ధనం మనకు ఉన్నదా?
మన దేశంలో ప్రస్తుతం పనిచేయగల వయస్సులో ఉన్న 101 కోట్ల మందిలో 40 శాతం మంది ఉద్యోగాన్వేషణలో ఉన్నారని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ’ అధ్యయనంలో వెల్లడయింది. ఈ విషమ పరిస్థితి రానురానూ మరింత తీవ్రమవుతోంది. పనిచేసే వయస్సులో ఉండి ఉద్యోగాన్ని వెదుక్కుంటున్న వారి శాతం గత ఐదేళ్లలో 46 నుంచి 40 శాతానికి పడిపోయింది. అంటే ఆరు కోట్ల మంది ప్రజలు ఉద్యోగాన్వేషణను మానివేశారు. ఎందుకని? ఉద్యోగం లభించే అవకాశం వారికి కనుచూపు మేరలో కనిపించకపోవడమే. మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ అది లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేము మరి. ఒక ప్రామాణిక అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం రేటు 7.6 శాతం. అంటే 3.3 కోట్ల మందికి ఎటువంటి పనీ లేదు. నిరుద్యోగం నిర్వచనాన్ని కొద్దిగా విస్తృతం చేస్తే నిరుద్యోగుల సంఖ్య ఐదు కోట్లుగా లెక్క తేలుతుంది. ఏమైనా నిరుద్యోగ సమస్యను మీరు ఏ విధంగా చూసినా ఉద్యోగం లేని వారు, అయితే అవకాశం లభిస్తే ఉద్యోగం చేసేందుకు సుముఖంగా ఉన్న వారి సంఖ్య పది కోట్లకు తక్కువగా ఉండదు. ‘నిరుద్యోగులు కాబోతున్న వారి’ని, ‘సరైన జీతభత్యాలు లేని’ ఉద్యోగాలు చేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ మహాజనుల సంఖ్య ఇంచుమించు 14 కోట్లుగా ఉండగలదని ఖాయంగా చెప్పవచ్చు. ఆధునిక చరిత్రలో మహాఘోరంగా వర్ధిల్లిన నిరుద్యోగంతో మన ప్రస్తుత నిరుద్యోగ సమస్యను పోల్చి చూడండి. 1930లలో అమెరికాలో నెలకొన్న మహా మాంద్యమే నేను ప్రస్తావించిన మహా ఘోర నిరుద్యోగం. ఆనాడు అమెరికాలో 1.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. అమెరికాలోని మొత్తం కార్మికులలో వారు 25 శాతం మంది. నేడు మన దేశంలో పరిస్థితి మెల్లగా సమీపిస్తున్న మహా మాంద్యంలా ఉంది. ఇప్పటికే, నాటి అమెరికాలో కంటే అనేక కోట్ల మంది అధికంగా నిరుద్యోగం కోరల్లో విలవిలలాడిపోతున్నారు.
మార్గాంతరమేమిటి? అరకొర పరిష్కారాలు పనిచేయవు. రంగాల వారీగా ఎంపిక చేసుకున్న పరిశ్రమల (లేక పారిశ్రామికవేత్తలు!)కు ఉద్దీపనలు ఇస్తే సరిపోదు. ‘వ్యాపార సౌలభ్యం’ లేదా ‘ఆత్మ నిర్భరత’ ఇత్యాది అవిశ్వసనీయమైన విధానాలతో ఉద్యోగాల సృష్టి జరగదు. 1930ల నాటి మహా సంక్షోభాన్ని అమెరికా ప్రభుత్వం ‘న్యూ డీల్’ పథకంతో సమర్థంగా ఎదుర్కొన్నట్టే , మనకు ముంచుకొస్తోన్న మహా సంక్షోభాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున సమగ్ర కార్యాచరణతో ఎదుర్కోవాలి.
నిరుద్యోగ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంలో ఆర్థిక నమూనాపై పునరాలోచన అనేది విధిగా ఒక భాగంగా ఉండితీరాలి. స్థూల ఆర్థిక విధానం, పారిశ్రామిక విధానంపై కొత్త ఆలోచనలు చేయాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పటిష్ఠపరచేందుకు ప్రాధాన్యమివ్వాలి. అయితే ఈ ప్రయత్నాలన్నీ దీర్ఘకాలంలో మాత్రమే సరైన ఫలితాల నిస్తాయి. అయితే మనకు కాలం మించిపోతోంది. ఈ విపత్సమయంలో పనిహక్కు కల్పనే మన మహాసంక్షోభానికి సమగ్ర ప్రతిస్పందన అవుతుంది. అదృష్టవశాత్తు పనిహక్కును అమలుపరిచే పద్ధతుల గురించి మనకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అర్థశాస్త్ర ఆచార్యులు జీన్ డ్రెజె, సంతోష్ మెహ్రోత్ర, అమిత్ బసోలెల ప్రతిపాదనలు మన ముందున్నాయి. సోషలిస్ట్ చింతకుడు రాకేశ్ సిన్హా అధ్యయన పత్రం ‘బెరోజ్ గారి: సమస్య ఔర్ సమాధాన్’ పనిహక్కు భావనకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను కల్పించింది.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు విధాలుగా జోక్యం చేసుకోవల్సి ఉన్నది. ఈ నాలుగు పరిష్కారాలూ పనిహక్కు అనే సమగ్ర పరిష్కారంలో భాగంగా ఉంటాయి. ఉద్యోగితను పెంచడం ఎక్కడ అవసరమవుతుందో, ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి మరింత స్పష్టంగా చెప్పాలంటే ఉద్యోగితను నేరుగా పెంచేందుకు ప్రభుత్వం నిబద్ధమవ్వాలి. ఖాళీగా ఉన్న 25 లక్షల ప్రభుత్వోద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి. తద్వారా విద్యావంతులైన యువజనులకు ఊరట కల్పించాలి. దీంతో పాటు ఆరోగ్య భద్రత, విద్య, పోలీస్ దళాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ఇంకా పర్యావరణ విధ్వంసక నిరోధం మొదలైన రంగాలలో అదనపు ఉద్యోగాలను సృష్టించాలి.
ప్రభుత్వం చేపట్టవలసిన రెండో చర్య కార్మికులు, ఉద్యోగులను యాజమాన్యాల దోపిడీ నుంచి రక్షించడం. వంద ఉద్యోగాలకు పదివేల మంది పోటీపడుతున్న దురదృష్టకర పరిస్థితుల్లో జీత భత్యాల విషయంలో యాజమాన్యాల దోపిడీని కార్మికులు ఎదుర్కొలేక పోతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మన రాజ్యాంగం నిర్దేశించింది. ఈ రాజ్యాంగ ఆదేశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు సమర్థించింది. దీన్ని అమలుపరచడం ప్రభుత్వ కర్తవ్యం. ముఖ్యంగా, మున్ముందుగా తన కార్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి రాజ్యాంగ విహిత న్యాయం సమకూర్చాలి.
మూడో పరిష్కార చర్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీని దాని మౌలిక ప్రణాళిక ప్రకారం పునరుద్ధరించడం. ‘ఉపాధి హామీ’ పథకం తొలుత డిమాండ్–ఆధారిత పథకంగా ఉండేది. అంటే భౌతిక శ్రమ చేయగల ప్రతి ఒక్కరూ అడిగిన వెంటనే పని కల్పించేదిగా ఉండేది. మౌలిక లక్ష్యం ఏమైనప్పటికీ ఉపాధి హామీ అమలులోకి వచ్చిన కొద్దినాళ్లలో సరఫరా ఆధారిత పథకంగా మారిపోయింది. నిధుల సమస్య ఏర్పడింది. దీనిపై కేంద్రం రాష్ట్రాలు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. గ్రామీణ భారతంలో సంక్షోభం సమసిపోవాలంటే గ్రామీణ ఉపాధి హామీని డిమాండ్ ఆధారిత పథకంగానే అమలు పరచాలి. కొవిడ్ కారణంగా కోట్లాది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లడంతో గ్రామీణ భారతంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నది విస్మరించలేని వాస్తవం.
ప్రభుత్వం చేపట్టవలసిన నాలుగో పరిష్కార చర్య– పట్టణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ఉపాధి హమీ పథకం వలే ఇది కూడా కనీస వేతనంపై కనీసం 100 రోజుల పాటు పనికల్పనకు హామీ కల్పిస్తుంది. పట్టణ స్వపరిపాలన సంస్థలు దీన్ని అమలుపరచవలసి ఉంది. అయితే గ్రామీణ ఉపాధి హామీ కంటే దీన్ని భిన్నంగా అమలుపరచవలసి ఉంది. అనిపుణ కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు నిపుణ కార్మికులకు ముఖ్యంగా మహిళలకు పార్ట్ –టైం ఉద్యోగాలను కోరుకునే మహిళలకు ఉపాధి కల్పించవలసి ఉన్నది. ఈ పథకం అమలులో ప్రైవేట్ సంస్థలను కూడా ఏదో ఒక విధంగా భాగస్వాములను చేసేందుకు అవకాశమున్నది. గ్రామీణ ఉపాధి హామీ వలే, ఇది కూడా పనికి దరఖాస్తు చేసుకుని, పనిని పొందలేనివారికి నిరుద్యోగ భృతి సమకూర్చాలి. ఈ సరికొత్త పట్టణ ఉపాధి హామీ పథకం అమలుకు అవసరమైన మౌలిక కృషి ఇప్పటికే జరిగింది. ఆర్థికవేత్తలు జీన్ డ్రెజ్, అమిత్ బసోలెల ప్రతిపాదనల ఆధారంగా ఆ కృషి జరిగింది. కేరళ, హిమాచల్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇప్పటికే ఇటువంటి పథకాలను అమలుపరుస్తున్నాయి.
అసలు ప్రశ్న ఏమిటంటే పనిహక్కును ‘మనం’ అమలుపరచగలమా? మొదటి మూడు పరిష్కార చర్యలు ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల ఆధారంగా అమలుపరిచేందుకు ఆస్కారమున్నది. కొంత అదనపు వ్యయం అవసరమవుతుంది. నాల్గవది అంటే పట్టణ ఉపాధి హామీ పథకం అమలుకు చాలా పెద్ద మొత్తంలో అదనపు నిధులు అవసరమవుతాయి. ఈ పథకం కింద రూ.2.8 లక్షల కోట్లతో 3.3 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని అమిత్ బసోలే నేతృత్వంలోని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం పరిశోధకులు అంచనా వేశారు. ఈ వ్యయం మన జీడీపీలో 1.7 శాతం. మొదటి మూడు పరిష్కార చర్యలకు అవసరమయ్యే అదనపు వ్యయాన్ని కూడా కలుపుకుంటే పనిహక్కు అమలుకు అయ్యే మొత్తం వ్యయం మన జీడీపీలో 3 శాతంగా ఉండగలదు. నిజానికి ఇదేమంత పెద్ద వ్యయం కాదు. ఇటీవలి సంవత్సరాలలో ‘మనం’ చేసిన కొన్ని ఇతర వ్యయాలతో పోల్చి చూడండి. ఒక్క 2021 సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 2లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయి. పరిశ్రమలకు నేరుగా సబ్సిడీల రూపేణా రూ.1.9 లక్షల కోట్ల ఆర్థిక సహాయమందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల రాబడిని కోల్పోయింది. మరి పనిహక్కు అమలుకు అవసరమైన అదనపు ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుందని మీరు చింతిస్తున్నారా? అలాంటి చింత అవసరం లేదు. కొవిడ్ మహమ్మారి కాలంలో మన కోటీశ్వరులు రూ.20లక్షల కోట్ల లాభాలను ఆర్జించారు. నిరుద్యోగ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తే అవసరమైన ఆదాయం అందుబాటులో ఉంది. అంతేకాదు మరింత ఆదాయాన్ని సృష్టించేందుకు అనేక అవకాశాలున్నాయి. మరి నిరుద్యోగం సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తుందా? ఇస్తుందని నేను భావించడం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అసలు సమస్య తీవ్రతనే గుర్తించడం లేదు. ఇక పరిష్కారానికి ఎలా పూనుకుంటుంది? పటిష్ఠ రాజకీయ సమీకరణల ద్వారా మాత్రమే మోదీ సర్కార్ వైఖరిని మార్చవలసి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ప్రజా సమీకరణలు ఎంతైనా అవసరం. ప్రభుత్వం తన ఆర్థిక విధానాలపై పునరాలోచన చేసేలా ఉద్యమాల రూపేణా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. పనిహక్కు అమలుకు ఒక ప్రజా ఉద్యమం అవసరం.
యోగేంద్ర యాదవ్
(ఐఐటి, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ విద్యాధికుడు విక్రమ్ శ్రీనివాస్ ఈ వ్యాసరచనలో విశేషంగా తోడ్పడ్డారు)
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)