కొనుగోళ్ల ’వర్రీ’..!

ABN , First Publish Date - 2022-01-24T05:02:29+05:30 IST

వాయుగుండం ప్రభావంతో నవంబరులో కురిసిన వర్షాల ధాటికి జిల్లావ్యాప్తంగా వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. కొన్నిప్రాంతాల్లో అయితే అప్పటికే కోత కోసి ఉంది. దీంతో ఆ ధాన్యమంతా రంగుమారాయి. గింజలు మొలకెత్తాయి. దీంతో రైతు ఆవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఽధాన్యం విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రంగుమారిన ధాన్యం కొనే విషయంలో నిబంధనలు సడలించడంతో పాటు ఇతర నిబంధనల విషయంలో కూడా మినహాయింపుల ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో రైతులకు భరోసానిచ్చింది.

కొనుగోళ్ల ’వర్రీ’..!
ఏల్చూరులో ధాన్యాన్ని బస్తాలకు నింపుతున్న రైతులు

ధాన్యం సేకరణలో ని‘బంధనలు’

ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

వర్షాల నేపథ్యంలో సడలింపులిస్తామని గతంలో ప్రకటన

కేంద్రానికి నమూనాలు పంపి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం

చేసేది లేక తక్కువ ధరకు బయట అమ్ముకుంటున్న రైతులు

ఇక మామూలు ధాన్యాన్ని కొనని పరిస్థితి

ఆర్బీకేల్లో కొనుగోళ్లు అంతంతమాత్రమే

ఒంగోలు(జడ్పీ)/అద్దంకి/ ముండ్లమూరు, జనవరి 23: 

పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాటలతో సరిపెట్టింది. చేసేదేమీ లేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకుని రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. వాస్తవానికి జిల్లాలో ఖరీఫ్‌ ఆలస్యంగా మొదలైనప్పటికీ వరి దిగుబడుల విషయంలో ఈ దఫా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వాయుగుండం ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. దీంతో రైతన్నకు మళ్లీ నిరాశే మిగిలింది. అంతోఇంతో మిగిలిన ధాన్యం కూడా వర్షాల ధాటికి రంగుమారింది. కొన్నిచోట్ల మొలకెలత్తాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17శాతం వరకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. తేమ విషయంలో కానీ, రంగుమారిన ధాన్యం కొనుగోళ్లు లాంటి విషయాల్లో నిబంధనల సడలింపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదని యంత్రాంగం చెబుతోంది. దీంతో జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వాయుగుండం ప్రభావంతో నవంబరులో కురిసిన వర్షాల ధాటికి జిల్లావ్యాప్తంగా వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. కొన్నిప్రాంతాల్లో అయితే అప్పటికే కోత కోసి ఉంది. దీంతో ఆ ధాన్యమంతా రంగుమారాయి. గింజలు మొలకెత్తాయి. దీంతో రైతు ఆవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఽధాన్యం విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రంగుమారిన ధాన్యం కొనే విషయంలో నిబంధనలు సడలించడంతో పాటు ఇతర నిబంధనల విషయంలో కూడా మినహాయింపుల ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో  రైతులకు భరోసానిచ్చింది. ధాన్యం నమూనాలను కేంద్రానికి పంపడం మినహా రాష్ట్రప్రభుత్వం అప్పటి నుంచి చేసిందేమీ లేదు. డిసెంబరు చివరి నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. యథావిధిగా యంత్రాంగం నిబంధనలకు లోబడే ఉన్న ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు సేకరిస్తున్నారు తప్ప ఎటువంటి సడలింపులు ఇవ్వడం లేదు. ఎప్పటిలాగానే రైతు మాత్రం బహిరంగ మార్కెట్‌లో  వచ్చినకాడికి పంటను అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నాడు. 

8,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం

వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలో కలిపి 8,500 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ఖరీఫ్‌కుగాను 7,200 ఎకరాల్లో, రబీకి 1,300 ఎకరాల్లో వరి దెబ్బతిందని యంత్రాంగం తేల్చింది. ఈ నష్టం ఎక్కువగా గిద్దలూరు, కొమరోలు, బేస్తవారపేట, రాచెర్ల, కనిగిరి, వెలిగండ్ల, సీఎస్‌పురం, తర్లుపాడు, కంభం ప్రాంతాల్లోని రైతాంగానికి జరిగింది. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద పలికే వారు కరువయ్యారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలని లేకుంటే మరింతగా నష్టపోతామని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 

తక్కువ ధరకే బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్న రైతులు

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకం క్వింటాలుకు రూ.1960, సాధరణ రకం క్వింటాలుకు రూ.1940గా ఉంది. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం వరకు ఉంటేనే కొనుగోలు చేస్తారు. పాడైన, మొలకెత్తిన గింజల విషయంలో 4శాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో ధాన్యం చాలావరకు రంగు మారిపోయింది. వాటిని కొనే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన వ్యక్తం చేయకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో దళారులకు రూ.1100కే అమ్ముకుని రైతాంగం నష్టపోతోంది. ధాన్యం కొనుగోలు పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోనిది అయినప్పటికీ వారితో మాట్లాడి ఒప్పించడమో లేక ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమకు ఆసరాగా నిలిస్తే మేలు జరిగేదని వరి రైతాంగం చెబుతోంది.

ఆర్బీకేలలోనూ అదే పరిస్థితి

రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు పూర్తిభిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో  రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. కానీ రైతులు మాత్రం అక్కడ విక్రయించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆర్‌బీకేల్లో సిబ్బంది నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తున్నారు. తేమ 17శాతం మించితే ధాన్యం సేకరించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో తక్కువ ధరకే దళారుల ద్వారా వ్యాపారులకు బస్తాకు రూ.100 తక్కువకే అమ్ముకుంటున్నారు. ఆ ప్రకారం ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు దిగుబడి ఉన్నా సుమారు రూ.3వేలు నష్టపోతున్నారు. 

మూడు వారాల్లోనే డబ్బులు జమ అని ప్రకటన

జిల్లావ్యాప్తంగా డిసెంబరు చివరి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం చేపట్టింది. కొనుగోళ్లు జరిపిన మూడు వారాల్లోపు అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని గతంలో తెలిపింది. ఇప్పటివరకు 96 కొనుగోలు కేంద్రాల ద్వారా  4,005 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. వాటి తాలూకా రూ.7.59కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాలను జనవరి 21లోపు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. గడచిన రబీలో ధాన్యం కొన్న డబ్బులను దాదాపు నెలన్నర తర్వాత తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, ఇప్పుడన్నా చెప్పిన గడువులోపల డబ్బులు జమ చేస్తే తమకు పెట్టుబడులకు ఉపయుక్తంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. 

 

తడిసిన ధాన్యం కొనటం లేదు:

-కోట శ్రీనివాసరావు, శ్రీనివాసనగర్‌, అద్దంకి మండలం

అకాల వర్షాలకు వరి ఓదెలు తడిశాయి. ధాన్యం కూడా కొద్దిగా రంగు మారాయి. బయట మార్కెట్‌లో అమ్ముదామంటే దళారులు ముందుకు రావటం లేదు. రైతు భరోసా కేంద్రంలో అడిగితే అద్దంకి తీసుకు వెళ్ళమంటున్నారు. ఏమి చేయాలో అర్ధం కాక రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉంచుకుని చేసేది లేక అయిన కాడికి అమ్మేస్తుకున్నా.

19ముండ్ల2, జెపిజి నాగండ్ల రమణ, రైతు 

దళారులకు వచ్చినకాడికి అమ్ముకున్నా..

-నాగండ్ల రమణ, రైతు, ఈదర, ముండ్లమూరు మండలం 

నేను 11ఎకరాల్లో వరి సాగు చేశా. ఇటీవల పంట దిగుబడి వచ్చింది. 330బస్తాల వరి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవటంతో బయట దళారులు అడిగిన కాడికి 75 కేజీల బస్తా రూ.1100లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పటం తప్పా రైతులను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు.




Updated Date - 2022-01-24T05:02:29+05:30 IST