Abn logo
May 16 2021 @ 23:19PM

చిరుద్యోగులకు చింతేనా?

సర్వీసు రెగ్యులరైజ్‌ చేయాలని ఉద్యమిస్తున్న చిరుద్యోగులు

సర్వీసు రెగ్యులర్‌ కాకుండానే పదవీ విరమణ

 వారి గోడు పట్టని ప్రభుత్వం

రాష్ట్రంలో 5,589 మంది

 జిల్లాలో 56 మంది బాధితులు

నెల్లిమర్ల, మే 16: ప్రభుత్వ విధుల్లో సుమారు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారికి ఇప్పటికీ ప్రభుత్వ ఫలాలు అందడం లేదు. ఇతర ప్రయోజనాలకూ నోచుకోవడం లేదు. కనీసం వేతనం కూడా అందుకోలేని దుస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో ఎన్‌ఎంఆర్‌లుగా, కంటింజెంట్‌ వర్కర్లుగా, పార్ట్‌ టైమర్లుగా, ఫుల్‌ టైమర్లుగా, కన్సాలిడేటెడ్‌ పే విధానంపై పనిచేస్తున్న సుమారు 5589 మంది చిరుద్యోగుల వ్యధ ఇది. జిల్లాలో సుమారు 56 మంది వరకు ఉన్నట్లు సమాచారం. గత 30 ఏళ్లుగా వీరు చేస్తున్న పోరాటం గాలిలో కలిసిపోతోంది. ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు.

రాష్ట్ర స్థాయి పాలకులకు వీరు అందజేసిన అర్జీలన్నీ చెత్తబుట్టల్లోకి వెళ్లిపోయాయి. 1994లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన యాక్ట్‌ 2 జీవో ఈ చిరుద్యోగుల జీవితాలనే నాశనం చేసింది. ఆ జీవోను ఇప్పటికీ మార్చేందుకు గాని, రద్దు చేసేందుకు గాని తర్వాత ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో వారు ఆర్థికంగా చీకట్లలోనే మగ్గుతున్నారు. వీరిలో ఫుల్‌ టైమర్లు 4850 మంది ఉండగా, పార్ట్‌టైమ్‌ విధానంలో పనిచేస్తున్న వారు 739 మంది ఉన్నట్లు సమాచారం. సుమారు 15 శాఖల్లో సేవలు అందిస్తున్నారు. 1994లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు వీరి జీవితాలను చీకట్లోకి నెట్టేశాయి. 1993కి ముందు ప్రభుత్వ విధుల్లో చేరి 1993 నవంబరు 15వ తేదీ నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన పుల్‌టైమర్లు, 10 సంవత్సరాలు పూర్తి చేసిన పార్ట్‌ టైమర్‌ ఉద్యోగులను అప్పట్లో సర్వీసు క్రమబద్ధీకరణ చేశారు. ఈ జీవోతో ఆ నిబంధనలు పూర్తి చేసుకున్న కొంత మంది ఉద్యోగులు గట్టెక్కారు. మిగతా వారు అదే జీవో ప్రకారం, అదే కోవలో సర్వీసు పూర్తయిన వెంటనే తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆశపడ్డారు. కానీ నేటికీ అడియాశలుగానే మిగిలిపోయాయి. 

కొత్త జీవోతో కష్టాలు

ఈ తరహా ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చేయరాదని 1994లో అప్పటి ప్రభుత్వం యాక్ట్‌ 2 పేరిట జారీ చేసిన జీవో వీరి జీవితాలకు అడ్డంకిగా మారింది. అనంతర కాలంలో వచ్చిన అన్ని ప్రభుత్వాల పెద్దలకు వినతులు సమర్పిస్తున్నప్పటికీ హామీలే గాని ఆచరణకు నోచుకోలేదు. అయితే వీరి వ్యధ విన్న గత ప్రభుత్వ పెద్దలు 2018లో వీరి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయకుండా కేవలం టైమ్‌ స్కేల్‌ అమలు చేసేందుకు నిర్ణయించి అందుకు సంబంధించి జీవోలను జారీ చేశారు. దీంతో వీరి ఆదాయం వందల్లో నుంచి 13వేల రూపాయలకు చేరింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్‌మోహనరెడ్డికి లిఖిత పూర్వక వినతి పత్రాలు అందజేసినప్పుడు సర్వీసు రెగ్యులరైజేషన్‌కు ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల గురించి మంత్రి వర్గ సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు గాని 15 సంవత్సరాల ముందునుంచీ ప్రభుత్వ విధుల్లో ఉన్న ఈ తరహా చిరుద్యోగుల సమస్యపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో ఈ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వ పెద్దల వద్ద మరో సారి మొరపెట్టుకోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు మీ సమస్యను కూడా ఎజెండాలో పెడతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్ల కాలం గడుస్తున్నా వీరి బాగోగుల గురించి అతీగతీ లేకుండా పోయింది. 1993 కన్నా ముందే చిరుద్యోగులుగా ప్రభుత్వ విధుల్లో చేరిన వీరిలో చాలా మంది పదవీ విరమణ చేయడం, మరి కొంత మంది పదవీ విరమణకు దగ్గరకు రావడం, పలువురు మరణించడం కూడా జరిగింది. అయినప్పటికీ అధికారుల్లో గాని, పాలకుల్లో గాని వీరి సమస్యలపై స్పందన రాకపోవడం విచారకరం. 

సర్వీసును క్రమబద్ధీకరించాలి

1993 కిముందు నుంచీ ప్రభుత్వ విధుల్లో ఉన్నాను. నేను నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో  30 ఏళ్ల కాలంగా కంటింజెంట్‌ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాలాంటి వారందరి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలి. అలాగే సర్వీసు రెగ్యులర్‌ కాకుండానే పదవీ విరమణ చేసిన వారికి పింఛను సదుపాయం కల్పించాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్యనియామక అవకాశం ఇవ్వాలి. 

- ఎం.శంకరరావు, చిరుద్యోగిAdvertisement