2021లో ఈ 10 విమానాశ్రయాల్లోనే అత్యంత రద్దీ.. ఏ ఎయిర్‌పోర్టు నుంచి ఎంత మంది ప్రయాణించారంటే..

ABN , First Publish Date - 2022-01-27T19:05:38+05:30 IST

2020తో పోలిస్తే 2021లో అంతర్జాతీయ ప్రయాణాలు భారీగానే జరిగాయి. ఎందుకంటే మహమ్మారి కరోనావైరస్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించాయి.

2021లో ఈ 10 విమానాశ్రయాల్లోనే అత్యంత రద్దీ.. ఏ ఎయిర్‌పోర్టు నుంచి ఎంత మంది ప్రయాణించారంటే..

ఇంటర్నెట్ డెస్క్: 2020తో పోలిస్తే 2021లో అంతర్జాతీయ ప్రయాణాలు భారీగానే జరిగాయి. ఎందుకంటే మహమ్మారి కరోనావైరస్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించాయి. దాంతో చాలావరకు జనాలు అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. ఇలా 2021లో కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో రద్దీ బాగా పెరిగింది. అలా గతేడాదిలో అత్యంత రద్దీ గల టాప్-10 విమానాశ్రయ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలవడం విశేషం. ఆ తర్వాత వరుసగా హీత్రో విమానాశ్రయం, ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయం షిపోల్, పారిస్ చార్లెస్ డి గల్లె విమానాశ్రయం, ఇస్తాంబుల్ విమానాశ్రయం, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అడాల్ఫో సువారెజ్ మాడ్రిడ్-బరాజాస్ విమానాశ్రయం, జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం, మీయామి అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. 


2021లో అత్యంత రద్దీగా ఉన్న టాప్-10 ఎయిర్‌పోర్ట్స్..

1. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 

ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 2021 డిసెంబర్‌లో ఏకంగా 35.42 లక్షల మంది ఇంటర్నెషనల్ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. ఇక గతేడాది డిసెంబర్ మధ్యలో వందశాతం సామర్థ్యంతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పని చేయడం ప్రారంభించింది. దాంతో మొదటి 11 నెలలు 2.4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తే.. చివరి ఒక్క నెలలోనే ఏకంగా 35లక్షలకు పైగా మంది ఈ విమానాశ్రయం నుంచి జర్నీ చేశారు. ఇలా ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి మొత్తం 2.50 కోట్ల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. అటు దుబాయ్ 2022 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గమ్యస్థానంగా కూడా ఉన్నట్లు ట్రిప్యాడ్వైజర్(ప్రముఖ అమెరికన్ ట్రావెల్ ఏజెన్సీ) వెల్లడించింది. 


2. హీత్రో విమానాశ్రయం

బ్రిటన్ రాజధాని లండన్‌లోని హీత్రో విమానాశ్రయం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 2021 డిసెంబర్‌లో ఏకంగా 25 లక్షలకు పైగా మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. లండన్‌లోనే హీత్రో ఒక ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం. దీంతో పాటు లండన్‌లో గాట్విక్, సిటీ, లుటన్, స్టాన్‌స్టెడ్, సౌత్‌ఎండ్ వంటి ఐదు ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. కాగా, 1966 మందు వరకు హీత్రో ఎయిర్‌పోర్టును లండన్ విమానాశ్రయంగానే పిలిచేవారు. 


3. ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయం (షిపోల్)

ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయం. ప్రస్తుతం ఈ ఎయిపోర్టును షిపోల్ విమానాశ్రయంగా పిలుస్తున్నారు. ఇది ఆమ్‌స్టర్‌డామ్‌కు నైరుతి దిశలో 9 కి.మీ దూరంలో ఉంటుంది. గతేడాది డిసెంబర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 24.26 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. 


4. పారిస్ చార్లెస్ డీ గల్లె విమానాశ్రయం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని చార్లెస్ డీ గల్లె విమానాశ్రయాన్ని రోయిసీ ఎయిర్‌పోర్టు అని కూడా అంటారు. ఆ దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఇది. అంతేగాక ఐరోపాలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్స్‌లో ఇది ఒకటి. గతేడాది డిసెంబర్‌లో ఈ విమానాశ్రయం ద్వారా 22.83 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. దీంతో పారిస్ విమానాశ్రయం నాల్గో స్థానంలో నిలిచింది. 


5. ఇస్తాంబుల్ విమానాశ్రయం

టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయం గతేడాది అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్ట్స్‌ల జాబితాలో ఐదో స్థానం కైవసం చేసుకుంది. 2021 డిసెంబర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 20.95 లక్షల మంది ప్రయాణించారు. 


6. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం

జర్మనీలోని ప్రధాన ఇంటర్నెషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం ఒకటి. ఆ దేశంలో మేజర్ అంతర్జాతీయ ప్రయాణాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇది లుఫ్తాన్సా సిటీలైన్, లుఫ్తాన్సా కార్గో, కాండోర్, ఏరోలాజిక్‌లతో సహా లుఫ్తాన్సాకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక 2021 డిసెంబర్‌లో ఈ విమానాశ్రయం నుంచి 20.43 లక్షల మంది రాకపోకలు కొనసాగించారు. దీంతో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. 


7. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఖతార్ రాజధాని దోహాలో ఉండే హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ దేశంలోని ఏకైక ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడి నుంచి ఆ దేశ జాతీయ ఎయిర్‌లైన్‌కు చెందిన ఖతార్ ఎయిర్‌వేస్ ప్రపంచంలోని చాలా దేశాలకు విమాన సర్వీసులు నడిపిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 17.65లక్షల మంది ప్రయాణించడంతో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల లిస్ట్‌లో ఏడో స్థానం పొందింది.


8. అడాల్ఫో సువారెజ్ మాడ్రిడ్-బరాజాస్ విమానాశ్రయం(మాడ్రిడ్ ఎయిర్‌పోర్ట్)

స్పెయిన్‌లోని మాడ్రిడ్-బరాజాస్  ఎయిర్‌పోర్ట్ ఏకంగా 7,500 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. విస్తీర్ణం పరంగా చూస్తే ఐరోపాలోనే రెండో అతిపెద్ద విమానశ్రయం. స్పెయిన్‌లో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్. 2021 డిసెంబర్‌లో ఈ విమానాశ్రయం ద్వారా 15.17 లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎనిమిదో ర్యాంక్ సాధించింది. 


9. జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం

న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం గతేడాది అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్ట్స్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2021 డిసెంబర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 13.38  లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. న్యూయార్క్‌లోని మిగతా ఐదు విమానాశ్రయాల కంటే ఈ ఎయిర్‌పోర్టే ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడి ఆరు ఖండాలకు వివిధ గమ్యస్థానాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తుంటాయి. 


10. మీయామి అంతర్జాతీయ విమానాశ్రయం 

అగ్రరాజ్యం అమెరికాలోని మరో ఎయిర్‌పోర్ట్ మీయామి అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా గతేడాది డిసెంబర్‌లో 11.21 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో అత్యంత రద్దీ గల టాప్-10 విమానాశ్రయాల జాబితాలో ఇది చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడి డైలీ వెయ్యి వరకు విమానాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. వీటిలో 160 వరకు డొమెస్టిక్ విమానాలు ఉంటే.. మిగతావి ఇంటర్నెషనల్ ఫ్లైట్స్.     

Updated Date - 2022-01-27T19:05:38+05:30 IST