లోకల్ టూర్..చలోయార్..

ABN , First Publish Date - 2020-09-27T17:53:08+05:30 IST

ట్రాలీబ్యాగ్‌లు, పాస్‌పోర్టులు, కెమెరాలతో పనిలేదు. రెండు నీళ్లబాటిళ్లు, మూడు పులిహోర ప్యాకెట్లు తీసుకుని బయలుదేరితే చాలు. పొద్దున వెళ్లి సాయంత్రానికి

లోకల్ టూర్..చలోయార్..

ట్రాలీబ్యాగ్‌లు, పాస్‌పోర్టులు, కెమెరాలతో పనిలేదు. రెండు నీళ్లబాటిళ్లు, మూడు పులిహోర ప్యాకెట్లు తీసుకుని బయలుదేరితే చాలు. పొద్దున వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చే పర్యాటక ప్రదేశాలు మన చుట్టూ బోలెడన్ని ఉన్నాయి. కరోనా వల్ల .. ఆరేడు నెలలుగా ఇంటికే అతుక్కుపోయిన మనకు.. ఇప్పుడు ఏ చిన్న కొత్త ప్రదేశం చూసినా యూరప్‌లా కనిపిస్తుంది.. అమెరికాలా అలరిస్తుంది. అందుకే లాంగ్‌టూర్లకు వెళ్లలేమన్న బాధను పక్కనపెట్టి.. లోకల్‌టూర్లకు వెళ్లండి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అబ్బురపరిచే అందాల ప్రదేశాలెన్నో కనువిందు చేస్తున్నాయి. నేడు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ . ఈ సందర్భంగా స్థానిక పర్యాటక ప్రదేశాలను గుర్తుచేసుకుందాం.. 


కడపలో ‘గ్రాండ్‌ కాన్యన్‌’

నేలకు సమాంతరంగా ఉన్నట్లుంటుంది. నాలుగు అడుగులు ముందుకేసి చూస్తే... భారీ అగాథం దర్శనమిస్తుంది! అందులో... గంభీరంగా ప్రవహించే నది!... ఈ వర్ణన చూడగానే మీకు కచ్చితంగా అమెరికాలోని ‘గ్రాండ్‌ కాన్యన్‌’ గుర్తుకొస్తుంది కదూ! కానీ, అది చూసేందుకు అమెరికా దాకా వెళ్లాలంటే మాటలా! అలాగని నిరాశపడకండి. మనకూ ఉందో కాన్యన్‌. అదే... గండికోటలోని పెన్నా నదీ లోయ. కడప జిల్లా జమ్మలమడుగుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఏడున్నర కిలోమీటర్ల పొడవు... 300 మీటర్ల వెడల్పు ఉన్న కాన్యన్‌లో పెన్నా నది పరవళ్లు తొక్కుతుంటుంది. లోయ పొడవునా ఎర్రటి రాళ్లు అరలు అరలుగా పేర్చినట్లు అబ్బురపరుస్తాయి. లోయకు ఒకవైపున గండికోట జలాశయం, దిగువ భాగంలో మైలవరం జలాశయం ఉండటంతో పెన్నా నదీ లోయ నిత్యం జలకళతో కనువిందు చేస్తుంది. ఇక్కడి ఎత్తైన ఎర్ర రాళ్లపైన కూర్చుని, పక్షుల కిలాకిలా రావాలు వింటూ... సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ.. ప్రపంచాన్నే మరిచిపోవచ్చు. సమీపంలోని కాకతీయులు, కుతుబ్‌షాహీల పాలనలో నిర్మితమైన కోట, మాధవరాయ స్వామి, రంగనాథ ఆలయాలు, జుమ్మా మసీదు, కావలి మంటపం, ధాన్యాగారం, కారాగారాలనూ చూడవచ్చు. చుట్టుపక్కల వాళ్లు పొద్దున వెళ్లి సాయంత్రం వచ్చేయొచ్చు.


భలా... కొండపల్లి ఖిలా!

జస్ట్‌ ఊహించుకోండి! చిక్కటి పచ్చటి అడవి, మలుపులు తిరిగే ఘాట్‌ రోడ్డు, పైదాకా వెళ్లాక అక్కడ ఒక కోట, అడవుల్లో ట్రెక్కింగ్‌ ట్రయల్స్‌, భారీ వర్షాలు కురిసినప్పుడు జలపాతాల సందడి. ఇవన్నీ విజయవాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే! అదే... కొండపల్లి కోట. ‘కొండపల్లి’ పేరు వినగానే చెక్కతో చేసే సుందరమైన బొమ్మలు గుర్తుకొస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం దాటిన వెంటనే... కొండపల్లి ఖిలా దారి వస్తుంది. దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు ఘాట్‌ రోడ్‌లో ప్రయాణం సాగుతుంది. పైన... కోట దర్శనమిస్తుంది. విస్తీర్ణంలో గోల్కొండ అంత పెద్దది కాకపోవచ్చు కానీ... చారిత్రక ప్రాధాన్యం, నిర్మాణం, అందంలో కొండపల్లి ఖిలా తక్కువేమీ కాదు. ఈ కోటను రెడ్డి రాజులు శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఆ తర్వాత... ఇది ఒరిస్సా గజపతి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్‌ షాహీలు, నిజాంల చేతులు మారి... ఫ్రెంచ్‌ వలస పాలకుల చేతికి చిక్కింది. బ్రిటిష్‌ పాలకులు దీనిని సైనిక శిక్షణ కేంద్రంగా ఉపయోగించారు. ప్రకృతితో ప్రయాణంతోపాటు చారిత్రక అనుభవం కావాలంటే... చలో కొండపల్లి ఖిలా!.


ఎగిరే పైకెగిరే.. ఉప్పలపాడు పక్షి కేంద్రం

బారడేసి రెక్కలు... పొడవాటి ముక్కు... ఎగురుతుంటే ఒక అందం... కిందకు వాలుతుంటే మరో  అందం! కాసేపు అలా ఆ పక్షులను చూస్తుంటే... మనసు పులకిస్తుంది. ఒత్తిడి మాయమవుతుంది. అందమైన పక్షుల రకరకాల విన్యాసాలను చూడాలంటే... ఏదైనా పక్షి సంరక్షణ కేంద్రానికి వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో... కొల్లేరు, నేలపాడు వంటి పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే, మరీ మారుమూల ప్రాంతంలో కాకుండా... విజయవాడకు 36 కిలోమీటర్లు, గుంటూరు నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే ఉంది... ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం. శ్రీలంక, ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాల నుంచి ఇక్కడికి 25 రకాల పక్షులు తరలి వస్తాయి. చుక్కలముగ్గు చింక బాతు, ఎర్రకాళ్ల కొంగ, చింతవాబి, తెరపిముక్కు కొంగ, నల్లతల కంకణం, పాముబాతు, చిన్న నీటికాకి, కంచురెక్కల జకాన, తెల్లకొంగ, దొసికొంగ, చిన్న మునుగకోడి... ఇలా అనేక రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. 30 ఎకరాల చెరువులో తొమ్మిది ఎకరాల్లో పక్షి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబరు నుంచి పక్షుల రాక మొదలువుతుంది. 


కోరింగలో... ‘లంకావీ’

అల్లంత దూరాన విశాలమైన సముద్రం.. దానిని సంధానిస్తూ బ్యాక్‌ వాటర్స్‌. అటూ ఇటూ గీత గీసినట్లుగా పచ్చటి మడ అడవులు. ఆ నీళ్లలో హీరో, విలన్ల మధ్య ‘చేజింగ్‌’ సీన్‌! ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి మనవాళ్లు మలేషియాలోని లంకావీకో, లేకుంటే కేరళకో వెళుతుంటారు. అస్సలు అక్కర్లేదు. కాకినాడ దగ్గరున్న కోరింగ మడ అడవులు ఇంతకుమించిన ఉత్కంఠను రేకెత్తిస్తాయి. నది సముద్రాన్ని చేరే చోట సహజ సిద్ధంగా ఏర్పడేవే మడ అడవులు. గోదావరికి సంబంధించి 58 వేల ఎకరాల్లో మడ అడవులు విస్తరించాయి. కోరింగ వద్ద దాదాపు 48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. సుందర్‌బన్‌ తర్వాత అత్యంత విశాలమైన మడ అడవులు ఉన్నది ఇక్కడే. ఇందులో అటవీ శాఖ వారు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్లలో సురక్షితంగా విహరించవచ్చు. కోరింగ అభయారణ్యంలో 35 జాతుల మడ చెట్లు ఉన్నాయి. కొక్కి రాయులు, చెకుముకి పిట్టలు, నారాయణ పక్షి, నీటి కాకి, గునపం కోడి, గువ్వలు, గద్దలు... ఇలా 120 రకాల పక్షులను కూడా చూడవచ్చు.  


ఎల్లోరాను పోలిన భైరవ కోన

బౌద్ధులు కొండరాళ్లను తొలచి ఆరామాలుగా మలుచుకున్నారు. మహాబలిపురంలో పల్లవులు కొండలనే గుహాలయాలుగా, శిల్పాలుగా చెక్కించారు. అదే పల్లవులు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక గుహాలయాన్ని నిర్మించారు. అదే భైరవకోన! ఇది ‘మినీ ఎల్లోరా’. ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య వెలిసిందీ క్షేత్రం. ఒకే రాతిలో ఎనిమిది గుహాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన ఆలయం శివాలయం. అలాగే... బ్రహ్మ ముఖాన్ని పోలినట్లుగా... త్రిముఖ దేవీ (లక్ష్మి, సరస్వతి, పార్వతి) ఆలయం ఇక్కడి ప్రత్యేకత. శిల్ప కళ తమిళనాడు సంప్రదాయాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. ఆలయానికి సమీపంలోనే సుందరమైన జలపాతం కూడా ఉంది. నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో... ప్రకాశం జిల్లా సీఎస్‌ పురం మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందీ క్షేత్రం. భైరవకోనకు వెళ్లిన వారు... ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో మైలిచర్ల గ్రామంలో ఉన్న మూడు శతాబ్దాల కిందటి మెట్ల బావినీ దర్శించుకోవచ్చు.


‘ఆంధ్రా అజంతా...’ గుంటుపల్లి

శిలలపై శిల్పాలు చెక్కడమే కాదు... కొండలనే గుహలుగా మలిచి, వాటిని ఆవాసాలుగా, ఆరామాలుగా, విద్యాలయాలుగా మార్చుకున్న ఘనత బౌద్ధ బిక్షువులది. ‘ఇలాంటి గుహలు చూడాలంటే... అజంతా వెళ్లాల్సిందే’ అనుకుంటున్నారా? అంతదూరం  వెళ్లక్కర్లేదు.  ఏలూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని గుంటుపల్లి (జీలకర్రగూడెం) గుహలకు వెళితే చాలు. 1889లో బ్రిటిష్‌ పురాతత్వ శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ రే వీటిని గుర్తించారు. ఇక్కడ సుమారు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో గుహారామాలు, చైత్యాలు వెలిశాయి. 400 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ఆరామాలకు వెళ్లేందుకు మూడు వైపుల నుంచి మెట్ల మార్గాలున్నాయి.  కొండపైన ఉన్న పాలరాతి స్థూపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 


అభయారణ్యంలో కిన్నెరసాని.. 

‘కిన్నెరసాని వచ్చిందమ్మ.. వెన్నెల పైటేసి..’ ఆ పాటను ఒక్కసారి వింటే మరిచిపోలేం. అభయారణ్యానికి ఆభరణంగా శోభిల్లుతున్న కిన్నెరసాని ప్రాజెక్టు అందాలను చూసినా అలాంటి మధుర జ్ఞాపకమే మనసులో పదిలంగా ఉండిపోతుంది. గోదావరి నదికి ఉపనది కిన్నెరసాని. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మేడారం-తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి.. ఆగ్నేయ దిశగా పరవళ్లు తొక్కుతూ.. కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలోని భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరిలో కలుస్తుంది. పాల్వంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద కిన్నెరసాని ప్రాజెక్టును నిర్మించారు. దీని చుట్టూ పచ్చటి పట్టుచీర కట్టినట్లు.. అభయారణ్యం చుట్టేసింది. మనుబోతులు, మచ్చలజింక, కృష్ణజింకలు, కింగ్‌ఫిషర్‌, గిజిగాడు వంటి జంతుజాలం, పక్షులు.. ఆ పట్టుచీరపై బుట్టబొమ్మల్లా కనిపిస్తాయక్కడ. పాల్వంచ పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్లు వెళితే.. కిన్నెరసాని ప్రాజెక్టును చూడొచ్చు.


తెలంగాణ అమెజాన్‌ ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ అల్లంత దూరంలో ఉంటుంది కానీ.. తెలంగాణ అమెజాన్‌ అడవుల జిల్లా అని చెప్పుకోవచ్చు. సుమారు 40 శాతం అటవీ విస్తీర్ణంతో.. తెలంగాణలోనే అత్యధిక అడవులు కలిగిన ప్రాంతం ఇది. ఉత్తరం, తూర్పు, పశ్చిమం ఇలా మూడు వైపుల మహారాష్ట్రలోని దట్టమైన అటవీ సరిహద్దులతో అల్లుకుని ఉంటుందీ జిల్లా. దక్షిణాన గోదావరి, తూర్పున ప్రాణహిత, ఉత్తరాన వార్దా, పెన్‌గంగా పోటీపడి పరవళ్లు తొక్కుతుంటాయి. జిల్లాలో కుంతల, పొచ్చెర, కడెం జలపాతాలు.. సహ్యాద్రి, సత్మాల్‌ కొండలు ప్రకృతిశోభకు ప్రతీకలు. ఎక్కడో తయారైన నాసిరకం ప్లాస్టిక్‌ చైనాటాయ్స్‌ను కొనడం కంటే.. ఇక్కడ దొరికే ప్రకృతి ప్రసాదిత నిర్మల్‌ కొయ్య బొమ్మల్ని కొనడం మేలు. ఇవెంత ప్రఖ్యాతి అంటే.. విదేశీయులు సైతం వాటిని ప్రేమగా కొని తీసుకెళుతుంటారు. ఎందుకంటే ఈ బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది మరి. అడవులు, నదులు, నీళ్లు, జలపాతాలు, కొండలు, బొమ్మలు... ఆ సహజ అందాల ఆదిలాబాద్‌ పర్యాటకులకు ఆనంద నిలయం.


ఓరుగల్లు కోటలో.. 

ఒకవేళ మెట్రో రైలులా టైమ్‌మిషన్‌ ఉంటే, అందులో కూర్చుని కాకతీయుల రాజ్యానికి వెళితే... ఎంత బావుణ్ణు? వరంగల్‌లోని ఓరుగల్లు కోట ప్రవేశద్వారం బోర్డుపైనున్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి.. లోపలికి వెళితే చాలు. మీరు కాకతీయుల రాజ్యంలోకి అడుగుపెట్టినట్లే!. అక్కడ రాతికట్టడాలు రాజుల కథలు చెబుతాయి.. శిల్పాలు నాట్యం ఆడతాయి.. స్థంభాలు జ్ఞాన బాండాగారాల్లా భ్రమింపజేస్తాయి. తెలంగాణ చరిత్రకు ఓరుగల్లు కోట నిలువెత్తు తోరణం. కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవుడు ఆ కోట నిర్మాణాన్ని ప్రారంభిస్తే.. రాణిరుద్రమ పూర్తి చేశారు. కాకతీయ కీర్తితోరణాలు, స్వయంభూ శివాలయం, ఏకశిలగుట్ట, గుండుచెరువు, ఖుష్‌మహల్‌...ఇలా ఎన్నో అపురూప కట్టడాలు ఉన్నాయి. కోట ద్వారంపైన ఉన్న కీర్తితోరణం.. నేటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. కాకతీయుల కాలంలో ఈ కోట 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. ఇక్కడున్న వెయ్యిస్థంభాల గుడి, భద్రకాళీ విగ్రహం చూడాల్సిందే. అలాచూసి ఇలా వచ్చేది కాదీ ప్రాంతం. చరిత్ర పుస్తకంలోని ప్రతి పేజీని శ్రద్ధగా చదివినట్లు మనసుతో చదవాలి. అప్పుడే టైమ్‌మిషన్‌లో రాజుల కాలానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చరిత్రతో ప్రయాణించిన సంతృప్తి  మిగులుతుంది. 


ఆక్సిజన్‌ గని అనంతగిరి..

అవసరమైనంత ఆక్సిజన్‌ దొరకడమే .. భాగ్యనగరవాసులకు మహా భాగ్యం. ఊపిరిసలపనంత బిజీల్లో పడిపోయిన వాళ్లు.. గుండెలనిండా ఊపిరి పీల్చుకోవాలంటే అనంతగిరి కొండలకు వెళ్లాల్సిందే!. హైదరాబాద్‌ నుంచి 90 కిలోమీటర్లు, వికారాబాద్‌ నుంచి 10 కిలోమీటర్లు వెళితే అనంతగిరికి చేరుకోవచ్చు. కరోనా ఒత్తిడికి చక్కటి ఉపశమనం లభిస్తుందిక్కడ. పచ్చటి రంగేసినట్లున్న కొండలు, చిట్టడవులు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మనలో ఇన్‌స్టంట్‌ ఎనర్జీకి ప్రకృతి ఏదో కొత్త టానిక్‌ ఇచ్చిన కొత్త ఉత్సాహం కలుగుతుంది. వర్క్‌ఫ్రంహోమ్‌లో వేడెక్కిన కంప్యూటర్లను రీస్టార్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో.. ఒత్తిళ్ల మధ్య అలసిపోయిన వాళ్లు తమను తాము రీస్టార్ట్‌ చేసుకోవచ్చిక్కడ. ఎందుకంటే అనంతగిరిపై ఆక్సిజన్‌ వైఫైలా మన చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి. పనిలోపనిగా 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత పద్మనాభస్వామి ఆలయం, మూసీ జన్మస్థానం వంటివన్నీ చూడొచ్చు..


అలనాటి ఠీవీ.. రాచకొండ రాజధాని

ఎప్పుడూ చూసిన ప్రదేశాలనే చూస్తే ఏమంత థ్రిల్‌ ఉండదు. ఈసారి రాచకొండ కోటకు వెళ్లండి. హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉన్న రాచకొండ అలనాటి తెలంగాణ రాజధాని. శత్రుదుర్భేద్యమైన ఈ కోట 7.8 చదరపు కి.మీ. మేర విస్తరించింది. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో నెలకొంది. ఈ కోటది అపురూప చరిత్ర. 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకులు రాచకొండను రాజధానిగా చేసుకుని పాలించారు. అప్పటి ఆస్థాన కవులలో గౌరన, పోతన ప్రసిద్ధులు. కోట ప్రాంతంలో రాయసముద్రం, అనపోతన అనే చెరువులు, వీరభద్ర, రామస్వామి, దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకునేందుకు రహస్యసొరంగం ఉందన్న ప్రచారం ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి ముప్పయి కి.మీ. వెళితే రాచకొండ వస్తుంది. ఇదే యాదాద్రి జిల్లాలో కొలనుపాక జైనదేవాలయం, ఏకశిలపై వెయ్యేళ్ల కిందట నిర్మించిన భువనగిరికోట వంటివన్నీ చూడొచ్చు. ఈమధ్య పర్యాటకుల తాకిడి పెరిగింది.


బోడకొండ చూడతరమా!

హీరో హీరోయిన్లు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు.. వాళ్ల వెనకున్న జలపాతాన్ని కళ్లింతలు చేసుకుని చూస్తాం. ఆ సుందర జలపాతం ఎక్కడో ఉండదు. వెతికితే మనకు దగ్గర్లోనే ఉంటుంది. అయినా మనమెప్పుడూ చూసుండం. అలాంటిదే బోడకొండ పర్యటక ప్రదేశం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉందీ షూటింగ్‌ స్పాట్‌. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరం. ఇబ్రహీంపట్నం- గునగల్‌- బోడకుంటకు చేరుకోవచ్చు. వంద మీటర్ల ఎత్తున ఉండే భారీ గుట్ట మీద వందల ఎకరాల్లో పచ్చటి పొలాలు విస్తరించాయి. అందమైన మూడు గ్రామాలు ఉన్నాయిక్కడ. చెరువులు, కుంటలతో పాటు గుట్ట నుంచి కిందికి జారే వరదనీటి దృశ్యాలు కళ్లు తిప్పుకోనివ్వవు. ఆదివారం వస్తే చాలు.. ఓ వెయ్యిమంది ప్రకృతి ప్రియులు వాలిపోతుంటారిక్కడ. ఆ గుట్టల్లోని పచ్చదనం, ఆ ప్రవాహ జలసవ్వడి.. కొత్త అనుభూతిని మిగుల్చుతాయి. హోటళ్లలో వేడివేడిగా మాంసాహారం, శాఖాహారం లాగించొచ్చు. గతంలో ఇక్కడ టీవీ సీరియళ్లను చిత్రీకరించారు. ఈ మధ్యనే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఒక దృశ్యాన్ని తెరకెక్కించడంతో.. మరింత ప్రాచుర్యం పొందింది.


- మారబోయిన మధుసూదన్‌

- తొమ్మండ్రు సురేష్‌ కుమార్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధుల సహకారంతో)

Updated Date - 2020-09-27T17:53:08+05:30 IST