Abn logo
May 12 2021 @ 09:55AM

శెభాష్‌ సిస్టర్స్‌

కరోనా బాధితుల పాలిట దేవతలు.. ఈ నర్సులు 

ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: కరోనా కల్లోలంలో బాధితులుగా మారుతున్నవారికి కొవిడ్‌ ఆసుపత్రుల్లో డాక్టర్లు మందుల ద్వారా వైద్యం అందిస్తుంటే.. నర్సులు సొంత ఆప్తుల్లా వేళకు మందులు అందిస్తూ.. అవసరమైన సపర్యలు చేస్తూ ప్రశంసలందుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల వద్దకు వెళ్లడానికి రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు, బంధువులు సైతం భయ పడుతున్న తరుణంలో నర్సులు రేయింబవళ్లు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తూ అన్నీ తామై సేవలందిస్తున్నారు. నర్సుల సేవలకు ప్రతీకగా నిలిచిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని పురస్కరించుకుని బుధవారం ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 


కరోనా సెకండ్‌వేవ్‌ విలయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వైరస్‌ బారిన పడుతున్నవారిని కాపాడటంలో వైద్యుల పాత్ర ఎంత ముఖ్యమో.. నర్సుల పాత్ర కూడా అంతే కీలకం. జిల్లాలో కరోనా బాధితులకు వైద్యసేవలందిస్తున్న ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో సుమారు వెయ్యి మంది వరకు నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారు. హెడ్‌నర్సులు, స్టాఫ్‌ నర్సులు, ట్రైనీ, స్టూడెంట్స్‌ ఇలా ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి అవిశ్రాంత సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది నర్సులు వైరస్‌ బారినపడి చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారు. ఇలా కోలుకుంటున్న నర్సులు మళ్లీ విధుల్లో చేరి కరోనా బాధితులకు వైద్యసేవలందిస్తూ ‘శెభాష్‌’ సిస్టర్స్‌ అనిపించుకుంటున్నారు. 


నర్సుల సేవలను ప్రభుత్వం గుర్తించాలి 

కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పాజిటివ్‌ బాధితులకు వైద్య సేవలందిస్తున్న నర్సుల సేవలను ప్రభుత్వం గుర్తించాలి. కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన నర్సులకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా విధుల్లో ఉన్న నర్సులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు, అదనపు పోస్టులను భర్తీ చేయాలి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులకు క్వారంటైన్‌ లీవులు అమలు చేయాలి. 

- మంజులదేవి, గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు 

కరోనా తగ్గిన వెంటనే విధుల్లోకి..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ క్రమంలోనే నాకు, నాద్వారా మా ఇద్దరు అబ్బాయిలకు కరోనా సోకింది. మేమందరం హోం క్వారంటైన్‌లో ఉన్నాం. మావారే సేవలు చేస్తున్నారు. మూడు రోజుల్లో హోం క్వారంటైన్‌ పూర్తవుతుంది. పరీక్ష చేయించి నెగెటివ్‌ వస్తే మళ్లీ విధులకు వస్తాను. బాధితులకు మా సేవలు అత్యవసరం. నాలాగే ఎంతోమంది నర్సులు వైరస్‌ బారినపడ్డారు. కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక నర్సు ప్రాణాలను కోల్పోయారు. 

- వి.దానేశ్వరి, హెడ్‌ నర్సు


మా వంతు బాధ్యతగా... 

నేను జీజీహెచ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తున్నాను. రెం డు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ సోకింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. మా అబ్బాయే దగ్గరుండి సేవలు చేస్తున్నాడు. కరోనా తగ్గితే మళ్లీ డ్యూటీకి వెళ్లాలి. సెకండ్‌ వేవ్‌లో భయం కరమైన పరిస్థితులను చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది మా కళ్ల ముందే చనిపోతున్నారు. ఆ దారుణాలను చూడలేకపోతున్నాం. ఈ సమయంలో మా వంతు సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది. 

- ఎ.బేబీరాణి, హెడ్‌నర్సు 

జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ వదల్లేదు...:  బి.నవకుమారి, స్టాఫ్‌నర్సు 

గత ఏడాది మార్చి నుంచి కొవిడ్‌ వార్డులలోనే పని చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తుండగా గత నెల 28న ఫీవర్‌ వచ్చింది. టెస్ట్‌ చేయిస్తే పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. అదే ఆసుపత్రిలో చికిత్స పొంది మూడు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాను. రేపు 14వ తేదీతో సెలవులు అయిపో తాయి. మళ్లీ డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. అయినా భయపడను. నాకు ఇద్దరు అమ్మాయిలు. నా ద్వారా వాళ్లకు వైరస్‌ సోకు తుందని రామవరప్పాడులో అక్క వాళ్ల ఇంట్లో ఉంటున్నారు.


కరోనాను జయించి మళ్లీ విధులకు...: వాసవి, స్టాఫ్‌నర్సు 

ఆరు నెలలుగా కొవిడ్‌ వార్డులలో విధులు నిర్వహిస్తున్నాను. వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నాను. సెకండ్‌ డోస్‌ 24న తీసుకోవాల్సి ఉంది. అదే రోజు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మళ్లీ టెస్ట్‌ చేయిస్తే నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. మొన్న శనివారం మళ్లీ డ్యూటీలో జాయినయ్యాను. మొదట్లో భయం వేసినా.. డాక్టర్లు ధైర్యం చెప్పారు. నాద్వారా  మా పిల్లలిద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. వారు కూడా నాతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తగ్గిపోయింది. మా వారే మాకు సేవలు చేశారు. నేనిప్పుడు మళ్లీ విధుల్లో చేరి ఆసుపత్రి ఓటీలో పని చేస్తున్నాను. 


జన్మ సార్థకమైనట్టు భావిస్తున్నా..:  గరికపాటి పార్వతి వెంకట రమణ,స్టాఫ్‌నర్సు 

ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న క్రమంలో నేను కూడా పాజిటివ్‌ అయ్యాను. నా ద్వారా మా వారికి, నా సోదరుడికి కూడా వైరస్‌ సోకింది. చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు పాటించడంతో కరోనా తగ్గిపోయింది. నాలుగు రోజుల క్రితమే మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యాను. నా వల్ల ఇంట్లోవారు ఇబ్బందులు పడకూడదనే  పెయిడ్‌ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరువుతున్నాను. ఆసుపత్రిలో బాధితుల దగ్గర కుటుంబ సభ్యులెవరూ ఉండరు. వారికి మా సపోర్టు చాలా అవసరం. బాధితులతో ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు.. రోగులకు సేవ చేసే గొప్ప వృత్తిలో ఉన్నందుకు జన్మ సార్థకమైనట్టుగానే భావిస్తున్నా.

Advertisement