Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచమా, సందేశం అందిందా?

మిరుమిట్లు గొలిపే అభివృద్ధి ఎవరి స్వేదఫలితమో, అంతిమ పరిశీలనలో, కాలపరీక్షలో పనిచోటు కంటె ఉనికిపట్టే ఎంత ముఖ్యమో ఈ మహా వలసలు నిరూపించాయి. ఈ ఎడతెగని ఊరేగింపులకు దారుల పొడువునా సాటి మనుషులు, మేటి మనుషులు ఆశ్రయమిచ్చారు, ఆహారమిచ్చారు, ఆదరణ చూపారు. ఎవరు రిక్తహస్తాలను ప్రదర్శించారో ఎవరు వాస్తవికతకు కళ్లు మూసుకున్నారో చరిత్రలో నమోదయింది.


కొందరికి 2020 కూడా అన్ని సంవత్సరాల లాంటిదే. మరి కొందరు 2020 మనిషికి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చిందని, పాఠం చెబుతున్నదని దాన్ని గ్రహించకపోతే ప్రమాదమని హెచ్చరిక చేస్తున్నారు. దురాశ, ప్రలోభం, ప్రకృతి విధ్వంసం, లుప్తమవుతున్న మానవీయ అనుబంధాలు, పరస్పర సహకారం- వంటి అంశాలలో మనుషులు తమ దారిని మార్చుకోవాలని ఈ సంవత్సరం సూచిస్తోందా? కరోనా మీద వచ్చిన కవితల్లో అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి పొందినది ‘‘ది గ్రేట్ రియలైజేషన్’’. మనుషులందరూ వైరస్ తాకిడి నుంచి రక్షించుకోవడానికి దాక్కొనవలసివస్తుంది, ఆ సమయంలో మనుషులు ఒకరినొకరు తెలుసుకుంటారు. కలసిమెలసి ఉండడం ఏమిటో వారికి గుర్తువస్తుంది. ఈ కవితలో ఒక చరణం ఇట్లా ఉంటుంది: ‘‘మనుషులు ఒకప్పటిలాగా తిరిగి ఒక్కటవ్వడానికి ఇటువంటి వైరస్ రావాలా?/ అవును, కుశలపడడానికి ముందు ఒక్కోసారి మనం జబ్బు పడవలసివస్తుంది.’’


ఇంకాఅయిపోలేదు. ముడుచుకోవడం, మూగ బోవడం ఇంకా ముగిసిపోలేదు. మంచి రోజులు వస్తాయన్న కబురు ఉన్నది కానీ, ఇంకా తెల్లవారలేదు. మున్నూట అరవై ఐదు రోజులు గడిస్తే ఒక ఏడాది, సూర్యుణ్ణి ఎన్ని కోటానుకోట్ల సార్లు చుట్టిందో ఈ భూమి, నక్షత్రపుంతలు అనేకం దట్టించిన కాలమానంలో ఒక ఏడాది అనగానెంత? ఖండఖండాలుగా విస్ఫుటించిన క్షణమాత్రం! ఈ సాపేక్ష సూక్ష్మక్షణికలో ఎంత బీభత్సం, ఎంత విధ్వంసం? ఒక కొమ్ములు మొలిచిన సూక్ష్మాతిసూక్ష్మ అర్ధజీవి ఝళిపించినదెంత మృత్యు పరిహాసం!


2020 ఇట్లా ఉండబోతుందని ఏ విజనరీకి కూడా తెలియకపోయింది. ఏ గడిలో ఏ గ్రహం దూరిందో జ్యోతిష్యానికి లెక్క తేలడం లేదు. గత్తరల చరిత్రనంతా తిరగరాసి, ఈ అతిక్రిమి ప్రపంచాన్నంతా చుట్టేసింది. రోగులు పట్టని ఆస్పత్రులు, దేహాలకు చోటు లేని శ్మశానాలు. చావుకీ బతుకుకీ నడుమ భయంభయంగా సంచరించిన మానవాళి. హాహాకారాలు, ఆర్తనాదాల నడుమ మనుగడ కోసం పరితాపం. 


జబ్బు సరే, చావు కూడా సరే. ఇది ప్రతి మనిషి శ్వాసకీ జల్లెడలు బిగించింది. స్పర్శకూ స్పందనకూ మధ్య గోడలు కట్టింది. ఉనికికీ ఉపాధికీ నడుమ లంకె తెంచింది. మానవ క్రియలన్నీ స్తంభించిపోయి, రెక్కాడకుండా పోయింది. రోగంతో పాటు ఆకలి కూడా మాటు వేసింది. చలనం ఆగిపోయింది. విహారం నిలిచిపోయింది. పరామర్శ మూగబోయింది. సమూహం సింహస్వప్నమైంది. స్నేహాలింగనం వికర్షితమైంది. ఆవరించిన అనిశ్చితి, అర్థరహితంగా మారిపోయిన రాత్రింబగళ్లు. విమానాలు లేని ఆకాశాలు. నిశ్శబ్దాన్ని చూడడానికి రహదారులపైకి ప్రవహించిన అడవి. 


మనుషులు ఉద్రిక్త, సంక్షోభ పరిస్థితులలో మునుపు బతకలేదని కాదు. బాంబుకీ బాంబుకీ నడుమ ఎడం చేసుకుని జీవితం గడిపిన యుద్ధక్షేత్రాలున్నాయి. ఎప్పుడు తెల్లారుతుందో తెలియని అంతర్యుద్ధ కల్లోలాలున్నాయి. దుర్భిక్షంతో కృశించిపోతున్న దేశాలున్నాయి. జాతిహననంతో యమదూతలు చెలరేగిన సందర్భాలున్నాయి. అధికారకాంక్షతో, సంపద మీద లాలసతో, జాతివైరంతో, అహంకారపు దుర్మార్గంతో చీకటిశక్తులు సృష్టించిన బీభత్సాలున్నాయి. ఈ లోకానికి హింస కొత్తది కాదు. భూకంపాలు, సునామీలు, తుఫానులు.. కోట్ల మందిని నమిలిమింగిన కలరాలూ ప్లేగులూ తెల్లజ్వరాలూ నల్లజ్వరాలూ తెలియనవి కావు.


వాటన్నిటి కంటె మించినది -ఈ కరోనా వైరస్, ఈ కొవిడ్–19. ఇది మనిషిని నిలువెల్లా కంపింపజేసింది. ఒక ప్రయోగ సన్నివేశంలో మనిషిని ముంచి అతని మంచిచెడ్డలను బట్టబయలు చేసింది. మనిషిలోని స్వార్థజీవిని, పరోపకారిని, తాత్వికుడిని, దుర్మార్గుడిని, సాత్వికుడిని ఆవిష్కరించింది. భారతదేశంలో కొవిడ్ ఒక కొత్త సన్నివేశాన్ని ముందుకు తెచ్చింది. సుదూర ప్రాంతాలకు, పట్టణప్రాంతాలకు వలసవెళ్లిన కోట్లాదిమంది శ్రామికులు ఒక్కసారిగా రహదారులపై తిరుగువలస మొదలుపెట్టారు. మిరుమిట్లు గొలిపే అభివృద్ధి ఎవరి స్వేదఫలితమో, అంతిమ పరిశీలనలో, కాలపరీక్షలో పనిచోటు కంటె ఉనికిపట్టే ఎంత ముఖ్యమో ఈ మహా వలసలు నిరూపించాయి. ఈ ఎడతెగని ఊరేగింపులకు దారుల పొడువునా సాటి మనుషులు, మేటి మనుషులు ఆశ్రయమిచ్చారు, ఆహారమిచ్చారు, ఆదరణ చూపారు. ఎవరు రిక్తహస్తాలను ప్రదర్శించారో ఎవరు వాస్తవికతకు కళ్లు మూసుకున్నారో చరిత్రలో నమోదయింది. 


రోజువారీ పనులు లేవు, చిరుద్యోగాలు మాయమయ్యాయి, ఉద్యోగాలున్నా జీతాలకు కోతలొచ్చాయి, వర్క్ ఫ్రమ్ హోమ్- ఉద్యోగాలు కొన్ని రంగాలలో ఇంకా కొనసాగుతున్న విలాసమే, పని లేకుండా ఇంటిపట్టునే ఉండవలసిరావడం కొందరికి ఇంకా తప్పని విషాదమే. ఆర్థిక వ్యవస్థ కష్టాలు, హాహాకారాలు బాగానే ప్రతిధ్వనిం చాయి కానీ, గణాంకాల కింద మూలుగులు అణగారిపోయాయి. స్తంభించిన జీవి తాలు, ఆదాయాలు మాత్రమే కాదు, విరామం లేకుండా సాగవలసివచ్చిన జీవితాల గురించి కూడా చెప్పుకోవాలి. రైతు విశ్రమించలేదు. వైద్యుడు, ఆరోగ్యసేవకులు విరామం తీసుకోలేదు. పోలీసులు, పాత్రికేయులు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. 


ఎవరి జీవితాల నుంచి వారు సందేశాలను గ్రహిస్తూ ఉండవచ్చు. తమ వారెవరో పరులెవరో ఆపదకాలపు వర్తనలను బట్టి తెలుసుకోవచ్చు. కానీ, ప్రముఖులు, ప్రసిద్ధులు మాత్రం తమ గ్రహింపులను చాటింపు వేసుకుని మరీ చెబుతారు. కుటుంబ సంబంధాలు విలువ తెలిసివచ్చిందని, ఇంటిపని ఎంత కష్టమో అర్థమయిందని, తల్లికి టిఫిన్ చేసిపెట్టానని, కుక్కపిల్లతో ఆడుకునే టైము చిక్కిందని.. ఇట్లా కొందరి అనుభవాలు ఆర్భాటాలయ్యాయి. ఎంతో సాహసాన్నో, త్యాగాన్నో ప్రదర్శించిన సాధారణ వ్యక్తుల కథలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. 2020 మార్చి మొదలుకొని మన జీవితంలో నుంచి ఒక్కొక్కటి ఎట్లా నిష్క్రమించాయో, ఒక్కొక్కటి ఎట్లా ప్రవేశించాయో జాబితాలు వేసుకుంటే - కొత్తపాతల అంచనాలు వేసుకోవచ్చు. 


బయటకు పోవడం నిషిద్ధమయ్యేసరికి, లోపలికి ప్రయాణించడం మొదలుపెట్టాను- అని ఎవరో చెప్పారు. తెలిసి కానీ, తెలియక కానీ, కొంత మౌనానికీ ధ్యానానికీ 2020 సమయం కల్పించింది. కేవలం మరణభయం మాత్రమే సమస్య కాదు. అది ఎప్పుడూ ఉండేదే. దీర్ఘకాలం జీవించగలగడమే అసాధారణం తప్ప, అకాలమరణాలు సాధారణమే. అయితే, తెలియకుండా వచ్చే ప్రమాదం వేరు, తెలిసి వస్తున్న ప్రమాదం వేరు. అకస్మాత్తుగా జీవితాంతానికి సిద్ధపడవలసి రావడం ఒక విషాదం. గత్తరల్లోను, యుద్ధాల్లోనూ మానవప్రాణం విలువ బాగా కుంచించుకుపోతుంది నిజమే కానీ, ఇది దృశ్యమానంగా ఉన్న ఆరోగ్యవైపరీత్యం కాదు. ఊపిరితిత్తులలోకి దూరి లోపలినుంచి తొలిచే జబ్బు. జబ్బు వస్తే దాన్ని అధిగమించగలమా అన్న భయం ఉంటుంది, అదే సమయంలో అనేక అంచెల వైద్య సహాయం అందుతుంది కాబట్టి, మరణాల లెక్కలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, అక్కడ భయాన్ని ఆశ జయించే అవకాశం ఉంటుంది. ప్రాణభయానికి తోడు, ఒక అనిశ్చితికి సంబంధించిన స్ఫురణ, అకస్మాత్తుగా జీవన సన్నివేశం తలకిందులు కావడానికి సంబంధించిన దిగ్ర్భాంతి- మనుషులను ఎక్కువగా బాధిస్తున్నాయి. నిరంతరాయంగా అనిశ్చితిని భరించడం సామాన్యం కాదు. మనం అలవాటు పడిన, లేదా సమకూర్చుకున్న మానవ, భౌతిక పర్యావరణాలు ఎప్పుడైనా మారిపోవచ్చునని, మనం ఆ మార్పు ఎదుట నిస్సహాయులుగా ఉండిపోతామని కలిగే గ్రహింపును ఎదుర్కొనడం కష్టం.


కొందరికి 2020 కూడా అన్ని సంవత్సరాల లాంటిదే. పైగా, ఈ వైరస్‌ను దానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా తమ తమ కార్యసాధనలకు అనువుగా ఉపయోగించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలను సాధించుకున్నారు, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టారు, నిర్బంధించారు, వేటాడారు. అన్నీ యథావిధిగా జరిగాయి. సరిహద్దుల్లో ఘర్షణలు కూడా జరిగాయి. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ కొందరికి ఈ ఉపద్రవం మరొక సాధారణ స్థితి మాత్రమే. ఏవేవో ఆశయాలను సాధించడం కోసం రాజ్యాలతో, ప్రభుత్వాలతో పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నవారికి కూడా కరోనా కష్టం సాపేక్షంగా చిన్నదే కావచ్చు. ప్రపంచాన్ని మరమ్మత్తు చేయాలనుకునేవారు కూడా కరోనా కళ్లకు గడుతున్న అనేక సత్యాలను పరిగణనలోకి తీసుకోవాలేమో? 


మరి కొందరు 2020 మనిషికి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చిందని, పాఠం చెబుతున్నదని దాన్ని గ్రహించకపోతే ప్రమాదమని హెచ్చరిక చేస్తున్నారు. దురాశ, ప్రలోభం, ప్రకృతి విధ్వంసం, లుప్తమవుతున్న మానవీయ అనుబంధాలు, పరస్పర సహకారం- వంటి అంశాలలో మనుషులు తమ దారిని మార్చుకోవాలని ఈ సంవత్సరం సూచిస్తోందా? కరోనా మీద వచ్చిన కవితల్లో అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి పొందినది ‘‘ది గ్రేట్ రియలైజేషన్’’ (టామ్ రాబర్ట్స్). మనుషులందరూ వైరస్ తాకిడి నుంచి రక్షించుకోవడానికి దాక్కొనవలసివస్తుంది, ఆ సమయంలో మనుషులు ఒకరినొకరు తెలుసుకుంటారు. కలసిమెలసి ఉండడం ఏమిటో వారికి గుర్తువస్తుంది. ఇటువంటి కథాకవితాంశతో పిల్లలకు ఉద్దేశించి రాసినట్టుండే ఈ కవితలో ఒక చరణం ఇట్లా ఉంటుంది:


‘‘మనుషులు ఒకప్పటిలాగా తిరిగి ఒక్కటవ్వడానికి ఇటువంటి వైరస్ రావాలా? 

అవును, కుశలపడడానికి ముందు ఒక్కోసారి మనం జబ్బు పడవలసివస్తుంది.’’

Advertisement
Advertisement