దోమ కుడితే..

ABN , First Publish Date - 2022-08-20T06:01:59+05:30 IST

దోమ.. పేరు చిన్నదేకానీ.. దాని కాటుతో ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి.. ఆడ దోమ కుట్టి మలేరియా వ్యాధి కారణమై.. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది.

దోమ కుడితే..

వర్షాకాలంలో దోమల విజృంభణ 

ప్రతి ఏటా లక్షలాది మరణాలు 

ఏడాదికి 20 లక్షల మందికి అనారోగ్యం 

ప్రతి ఇంటికి నెలకు అదనం ఖర్చు రూ.300


దోమ.. పేరు చిన్నదేకానీ.. దాని కాటుతో ఏటా లక్షలాది  మరణాలు  సంభవిస్తున్నాయి.. ఆడ దోమ కుట్టి మలేరియా వ్యాధి కారణమై.. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. వానాకాలం వస్తే చాలు విజృంభిస్తూ మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. ఎన్ని రకాల కాయిల్స్‌ ముందులు వాడినా, చివరికి దోమలు తెరలు కుట్టుకున్నా  ప్రయోజనం లేదంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. శుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. ఈ మధ్యకాలంలో వస్తున్న వ్యాధుల్లో ఎక్కువ దోమకాటు వల్ల సోకుతున్నవే అని అనేక అధ్యయనాలు తెలిపాయి. పరిసరాలు శుభ్రంగా    ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు.  ఈ విషయాలను గమనించి  ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీటి కట్టడికి  ఏటా ఆగస్టు 20వ తేదీన    ప్రపంచ దోమల నివారణ దినం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

భీమవరం, ఆగస్టు 19 : దోమలు వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రతీ ఏడాది 7.25 లక్షల మందికి పైగా చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల 4.75 లక్షల మంది, పాము కాటు వల్ల 50 వేల మంది చనిపోతున్నారు. అంటే వీటన్నింటి కంటే దోమ కుడితే వచ్చే రోగాల వల్లే ఎక్కువమంది ప్రాణాలు పోతున్నాయని తెలుస్తుంది. దోమ కాటు వల్ల ప్రతీ సంవత్సరం 20 లక్షల మంది అనారోగ్యానికి గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 


ప్రతి ఇంటికి నెలకు రూ.300 ఖర్చు

దోమల నివారణకు నెలకు ఇంటికి రూ.300 ఖర్చు అవుతోంది. ఇది నిజం దోమల నివారణలో తేలిక పద్ధతులలో అత్యధికంగా కాయిల్స్‌, అగరవత్తులు,  లిక్విడ్‌ వాడుతారు. ఇంట్లో రెండు గదులు ఉంటే ప్రతీ రోజు 6 నుంచి 8 రూపాయలు వీటి కోసం వ్యయం చేస్తున్నారు. ఇలా లెక్కిస్తే నెలకు రూ. 300 ఖర్చు అవుతుంది. ఉదాహరణకు భీమవరం పట్టణంలో 38 వేల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఖర్చును లెక్కిస్తే నెలకు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టణాలు, పల్లెటూళ్ళలో జనాభా 19 లక్షలు మంది ఉన్నారు. ఈవిధంగా చూస్తే ఏడాదిలో కోట్ల రూపాయలు దోమల నివారణ బడ్జెట్‌ అవుతోందని  అంచనా వేయవచ్చు.


దోమల నివారణకు ప్రత్యేక నిధులు.. 

మునిసిపాలిటీ గాని, పంచాయతీలో గాని దోమల నివారణకు ప్రత్యేక  నిధులు  కేటాయిస్తుంటారు. ఏడాదికి కార్పొరేషన్‌లలో సుమారు రూ.10 లక్షలు, గ్రేడ్‌ను  బట్టి మునిసిపాలిటీ అయితే రూ. 2 నుంచి రూ.5 లక్షల వరకు బడ్జెట్‌లో దోమ నివారణకు కేటాయిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు పలు   విభాగాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం డ్రెయిన్లలోనూ, గుంతలలోనూ మలాథియాన్‌తో స్ర్పే చేస్తారు. రోజుల పాటు మడ్‌ ఆయిల్‌లో నానబెట్టిన ఆయిల్‌ బాల్స్‌  డ్రెయినేజీ నీటిలో వదులుతారు. వీటి వల్ల లార్వా నాశనమవుతుంది. సాయంత్రం వేళ ఫాగింగ్‌ యంత్రం ద్వారా పొగ వదులుతారు. ఇక ఎక్కువ విశాలంగా ఉండే డ్రెయిన్లలో గంబుచియా చేపలను వదులుతారు. ఇవి దోమలను తింటాయి. 


 చిట్కాలు ఇలా..

ఐస్‌ ముక్కలు..  దోమలు కార్బన్‌ డైఆక్సైడ్‌కు ఆకిర్షతమవుతాయి. ఐస్‌ గడ్డలు కార్బన్‌ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి ఐస్‌ గడ్లను ఓ కంటైనర్‌లో పెట్టి ఇంట్లో అక్కడ ఉంచాలి. దోమలు వీటి దగ్గరకు చేరతాయి. అప్పుడు దోమల ఎలక్ట్రిక్‌ బ్యాట్‌తో వాటి పని పట్టవచ్చు. 

జవేపనూనె.. వేప నూనె, కొబ్బరి నూనెను 1:1 నిష్పత్తిలో తీసుకొని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి. వేపలో యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ప్రోటోజోల్‌ గుణాలు ఉన్నాయి.

నిమ్మ నూనె.. దోమల నివారణకు యూకలిప్టస్‌, లెమన్‌ ఆయిల్‌ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటి హాని ఉండదు. వీటిలో ఉండే సినోల్‌ రసాయనం యాంటీ సెఫ్టిక్‌ కీటక నివారణిగా పనిచేస్తుంది. 

కర్పూరం.. చీకటి పడుతున్న వేళల్లో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించండి. 20 నిమిషాల తరువాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారణిగా పనిచేస్తుంది.

జతులసి.. దోమల లార్వాను చంపేందుకు తులసి చక్కగా  పనిచేస్తుందని ఆయుర్వేదం కూడా చెప్పింది. ప్రతీ ఇంట్లోనూ తులసి మొక్కలను ఉంచుకోవడం వల్ల చాలా వరకు దోమల సమస్య ఉండదు. 


 దోమ కుడితే సోకే వ్యాధులు..

మలేరియా.. ఆడ అనాఫిలిస్‌ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. మలేరియాతో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడం వల్ల దాని కడుపులోకి వ్యాధికారక పరాన్న జీవి ప్రవేశించి అక్కడ పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. చలి, వణుకుతో జ్వరం, శరీర ఉష్ణోగ్రత పెరగడం.. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది.

డెంగీ.. పగటి సమయంలో కుట్టే యెడీస్‌ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరస్‌ జ్వరం, కండరాలు, కీళ్ళ నొప్పులతో జ్వరం మొదలవుతుంది. ప్లేట్‌లెట్లు అమాంతం తగ్గిపోయి.. హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలు భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండటంతో పాటు చిగుళ్ళు, ముక్కు రక్తం వస్తుంది. 

మెదడు వాపు.. క్యూలెక్స్‌ ఆడదోమ కుట్టడం వల్ల మెదడువాపు వ్యాధి సంక్రమిస్తుంది. జపనీస్‌ ఎన్సెఫలైటీస్‌ వైరస్‌ ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది. ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువగా ఉండడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు కావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒక పక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్‌ రావడం. 

చికిన్‌ గున్యా.. ఎడిస్‌ దోమల వల్ల ఈ వ్యాధి వస్తుంది. చేతులు, కాళ్ళలో, కీళ్ళల్లో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా తయారవుతాడు. తలనొప్పి, వాంతులు, వికారంతో పాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ళ నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం.

ఫైలేరియా.. దీనిని బోధకాలు అంటారు. క్యూలెక్స్‌ దోమ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. శరీరంలోని ఏ భాగానికైనా బోధకాలు సోకుతుంది. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, అవయవాల వాపు, చేతులు, స్థనాలు, వరిబీజం జ్ఞానేంద్రియాలు పాడవుతాయి. 


 తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. 

నిల్వ ఉన్న గుంతలలో క్రిమిసంహారక మందులు, కిరోసిన్‌ లేదా వాడిన ఇంజనాయిల్లో ముంచిన గుడ్డలు వేయాలి. 

మురుగు నీరు బయటకు వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాలి. నీటి ట్యాంకులు, డ్రమ్ములుపై మూతలు సరిగా ఉంచాలి.

ఇంట్లో, ఇంటి చుట్టూ పనికిరాని కూలర్లు, పాత టైర్లు, డ్రమ్ములు, వాడని రోళ్ళు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, సీసాలు లేకుండా చూసుకోవాలి. 

కిటీకీలకు, డోర్లకు జాలీలు బిగించాలి. వ్యక్తిగత రక్షణకు దోమతెరలు, కాయిల్స్‌ వాడాలి. శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. 


దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమం

దోమల నివారణకు మునిసిపాలిటీ ప్రత్యేక ప్లానింగ్‌ అమలు చేస్తుంటుంది. సుమారు ఐదు లక్షల రూపాయల వరకు దోమల నివారణకు బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటాం. మున్సిపల్‌ డ్రెయిన్ల గుంతలలో దోమలు పెరుగుతాయి. వీటి నివారణ కోసం స్ర్పే, ఫాగింగ్‌, ఆయిల్‌ బాల్స్‌, గంబూచియా చేపలు వదలడంతో పాటు డ్రెయినేజీలు శుభ్రం చేస్తూ ఉంటాం.

– వేండ్ర ప్రసాద్‌, భీమవరం మునిసిపల్‌ ఇన్‌చార్జి హెల్త్‌ ఆఫీసర్‌

Updated Date - 2022-08-20T06:01:59+05:30 IST