ప్రపంచం చూపు షార్‌ వైపు

ABN , First Publish Date - 2022-08-07T07:11:31+05:30 IST

ఇస్రో తొలి బుల్లి రాకెట్‌ ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగం ఈ ప్రయోగం వైపు చూపుమరల్చింది.

ప్రపంచం చూపు షార్‌ వైపు
షార్‌ ప్రథమ ప్రయోగవేదికపై ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌

ఇస్రో తొలి బుల్లి రాకెట్‌పై సర్వత్రా ఆసక్తి 

శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 6 : ఇస్రో తొలి బుల్లి రాకెట్‌ ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగం ఈ ప్రయోగం వైపు చూపుమరల్చింది. ప్రపంచంలోనే చౌకగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేస్తుందని పేరుగాంచిన ఇస్రో మరింత కారుచౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఎస్‌ఎ్‌సఎల్వీని ఆదివారం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం రిహార్సల్స్‌ విజయవంతంగా పూర్తికావడంతో శాస్త్రవేత్తలు ప్రయోగ విజయంపై ధీమాగా ఉన్నారు. ఎంఆర్‌ఆర్‌,  ల్యాబ్‌ సమావేశాలలో సైతం శాస్త్రవేత్తలు రాకెట్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ప్రయోగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కౌంట్‌డౌన్‌ 7 గంటలపాటు కొనసాగి తదుపరి ఉదయం 9.18కి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ స్వయంగా ప్రయోగ సన్నాహాలలో పాల్గొంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు.శనివారం ప్రయోగవేదిక వద్దకెళ్లి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఎస్‌ఎ్‌సఎల్వీని పరిశీలించారు. ఆనవాయితీ ప్రకారం ఫొటో షూట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఓ వైపు ప్రయోగానికి ముమ్మరసన్నాహాలు జరుగుతుండగా మరో వైపు షార్‌ భద్రతా దళం సీఎ్‌ఫవో షార్‌ను కంటికి రెప్పలా పహరా కాస్తోంది. షార్‌ మొదటి గేట్‌ వద్ద రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాహనాలను మెటల్‌ డిటెక్టర్లతో పరిశీలిస్తున్నారు. అలాగే తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. ఇక శ్రీహరికోట పోలీసులు సైతం అటకానితిప్ప గ్రామం వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను తనిఖీలు చేస్తున్నారు. 

సందర్శకుల కోసం ఆర్టీసీ బస్సులు 

ప్రతి రాకెట్‌ ప్రయోగానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే సందర్శకులను షార్‌కు చేరవేసేందుకు సూళ్లూరుపేట ఆర్టీసీ అధికారులు ఆదివారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుండే సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్‌, హోలిక్రాస్‌ సర్కిల్‌, షార్‌ బస్టాండ్‌ నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌ మల్లికార్జున్‌ తెలిపారు.  

Updated Date - 2022-08-07T07:11:31+05:30 IST