Metaverse: మెటావర్స్ పరిణామక్రమంలో ఇది తొలి దశే.. జుకర్‌బర్గ్ మీడియా సంస్థ సీఈఓ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-04-23T23:15:38+05:30 IST

తాజాగా జరిగిన ఓ ఆర్థిక సదస్సులో మార్క్ జుకర్‌బర్గ్ సోదరి, జుకర్‌బర్గ్ మీడియా సంస్థ సీఈఓ ర్యాండీ జూకర్‌బర్గ్ మెటావర్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Metaverse: మెటావర్స్ పరిణామక్రమంలో ఇది తొలి దశే.. జుకర్‌బర్గ్ మీడియా సంస్థ సీఈఓ వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: నానాటికీ మారిపోతున్న ఇంటర్నెట్ ప్రపంచం  మలి దశ‌లో వర్చువల్ రియాలిటీ ముఖ్యపాత్ర పోషిస్తోందని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే.. ఈ ప్రపంచంపై  అధిపత్యం కోసం ఇతర టెక్ కంపెనీలన్నిటి కంటే ముందుగా తొలి అడుగు వేశారు. మెటావర్స్‌ను తలిపించే ‘మెటా’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. దాని పరిధిలోకి ఫేస్‌బుక్‌‌ను తెచ్చారు. తాజాగా జరిగిన ఓ ఆర్థిక సదస్సులో మార్క్ జుకర్‌బర్గ్ సోదరి, జుకర్‌బర్గ్ మీడియా సంస్థ సీఈఓ ర్యాండీ జూకర్‌బర్గ్ మెటావర్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెటావర్స్ పరిణామక్రమం తొలి దశలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు మెటావర్స్ అంటే ఏంటీ.. భవిష్యత్తులో ఈ వర్చువల్ ప్రపంచంలో వచ్చే మార్పులు ఏంటో ఓ మారు చూద్దాం.. 


Metaverse అంటే.. 

మెటావర్స్ అంటే ఓ వర్చువల్ ప్రపంచం. వర్చువల్ రియాలిటీ(VR), ఆగ్మెంటెండ్ రియాలిటీ(AR) సాంకేతికల ద్వారా మనం కదలకుండానే కళ్లముందుకొచ్చే వర్చువల్ ప్రపంచమే మెటావర్స్.  ఇదంతా ఇంటర్నెట్ సాయంతో జరిగిపోతుంది. మెటావర్స్ అనుభవం ఎలా ఉంటుందో ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగికి తన ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండానే ఆఫీసులో సహోద్యోగుల మధ్య ఉన్నట్టు అనుభూతి కలిగిస్తుంది ఈ మెటావర్స్. అంటే.. ఆఫీసు వాతావరణమంతా కళ్లముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ వీఆర్ హెడ్ సెట్ పెట్టుకుంటే చాలు.. ఆఫీసులో ఉన్న అనుభూతి కలుగుతుంది.


కంపెనీ ఇతర ఉద్యోగులు కూడా ఇలాంటి హెడ్‌సెట్‌ల సాయంతోనే ఈ వర్చువల్ ప్రపంచంలోకి లాగిన్ అవుతారు. ఆ తరువాత.. తమ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు, ఇతర సహోద్యోగులతో చేయాల్సిన మీటింగ్స్ అన్నీ ఈ వర్చువల్ ప్రపంచంలోనే జరిగిపోతాయి. ఆ రోజు పనంతా పూర్తయ్యాక.. వీఆర్ హెడ్‌సెట్ తీసేసి ఈ వర్చువల్ ప్రపంచం నుంచి లాగవుట్ అయిపోవచ్చు. ఆన్‌లైన్ వర్చువల్ గేమ్స్ ఆడిన అనుభవం ఉన్నవారు తరచూ ఇలాంటి ఊహాజనిత వర్చువల్ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. 


అయితే.. ఫేస్‌బుక్  మెటావర్స్‌ను మనిషి జీవితంలోని అన్ని పార్శ్వాల్లోకి చొప్పించాలని యోచిస్తోంది. నానాటికీ పెరుగుతున్న టెలికాం నెట్‌వర్క్‌ల సామర్థ్యం, భవిష్యత్తులో అందుబాటులోకి రాబోయే  వర్చువల్ గ్యాడ్జెట్స్, వీఆర్ హెడ్‌సెట్స్.. ద్వారా మెటావర్స్‌కు మరింత పాపులారిటీ పెరుగుతుందని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ నమ్ముతున్నారు. ఇప్పటికే ఇళ్లు, ప్లాట్ల కొనుగోలు వంటి రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెటావర్స్ వేదికగా జరిగిపోతున్నాయని ర్యాండీ జుకర్‌బర్గ్ తాజాగా పేర్కొన్నారు.  500 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. మరి మార్క్ జుకర్ వేసిన తొలి అడుగు ఆయన కోరిన విజయాన్ని అందిస్తుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-04-23T23:15:38+05:30 IST