World హెరిటేజ్‌ జాబితాలో మైసూరు ఉత్సవాలకు చోటు!

ABN , First Publish Date - 2022-01-15T14:00:13+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. మైసూరు జిల్లాలోని శక్తిదేవత చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఏటా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాలనుంచి

World హెరిటేజ్‌ జాబితాలో మైసూరు ఉత్సవాలకు చోటు!

బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. మైసూరు జిల్లాలోని శక్తిదేవత చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఏటా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాలనుంచి పర్యాటకులు విచ్చేస్తుంటారు. కర్ణాటకలో సంప్రదాయ దసరా ఉత్సవాలు భవ్యంగా జరుగుతాయి. అందుకే వీటికి అంతర్జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. 400 సంవత్సరాలకుపైగా భవ్య చరిత్ర కల్గిన మైసూరు దసరా ఉత్సవాల జంబూసవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దసరా ఉత్సవాలకే ఇదే ప్రధాన ఆకర్షణ. యునెస్కో సంస్థ ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వరల్డ్‌ హెరిటేజ్‌ జాబితాలో మైసూరు దసరా ఉత్సవాలను చేర్చే సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి పురాతత్వశాఖ, రాష్ట్ర సాంస్కృతికశాఖలనుంచి కొంత సమాచారాన్ని యునెస్కో కోరినట్టు తెలుస్తోంది. కన్నడ సంస్కృతిశాఖ మంత్రి వీ సునీల్‌కుమార్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్ర పురాతత్వశాఖ కమిషనర్‌ బీఆర్‌ పూర్ణిమా మీడియాతో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో ఏటా జరిగే దసరా ఉత్సవాల దుర్గా పూజలకు ప్రపంచ వారసత్వ జాబితా (వరల్డ్‌ హెరిటేజ్‌)లో చోటు దక్కిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మైసూరు దసరా ఉత్సవాలకు సంబంధించిన ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని సిద్ధం చేసి అధికారులకు సమర్పించే ఆలోచన ఉందన్నారు. చరిత్ర ప్రకారం విజయనగర సామ్రాజ్యం కాలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు అనంతరం 1610లో మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో కొనసాగాయని ఆమె వివరించారు. హైదర్‌అలి కాలంలోనూ దసరా ఆచరణ ఉన్నప్పటికీ జంబూసవారి ఉండేది కాదన్నారు. బ్రిటీష్‌ పాలకులు టిప్పు సామ్రాజ్యాన్ని ఆక్రమించున్న అనంతరం 1800 వరకు శ్రీరంగపట్టణంలో దసరా ఉత్సవాలు జరగలేదు. అనంతరం ఈ ఉత్సవాలు మైసూరులో నిర్వహించాలని నిర్ణయించడం, ఇందుకు అప్పటి మైసూరు మహారాజు చామరాజేంద్ర ఒడయార్‌ ఈ ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడంతోపాటు పూర్తి సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ హెరిటేజ్‌ జాబితాలో మైసూరు దసరా ఉత్సవాలను చేర్చేందుకు సంబంధించి త్వరలోనే యునెస్కో నిపుణుల బృందం మైసూరులోని చారిత్రాత్మక ప్రాంతాలను తిలకించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో కర్ణాటకకు చెందిన హంపి, పట్టదకల్లు, పశ్చిమకనుమలు వంటివి ఉన్నాయి. జాబితాలో మైసూరు దసరా ఉత్సవాలు చేరితే అంతర్జాతీయస్థాయి లో ఈ ఉత్సవాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని పురాతత్వశాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-01-15T14:00:13+05:30 IST