ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించిన ఏఎస్ఐ

ABN , First Publish Date - 2022-04-19T01:33:13+05:30 IST

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించింది.

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించిన ఏఎస్ఐ

హైదరాబాద్: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించింది. గత చరిత్రను గుర్తుచేసుకుంటూ  వారసత్వాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించే అంశాలపై  అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 18న  ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని  ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది.  ప్రపంచ వారసత్వ సంపదగా గత ఏడాది యునెస్కో గుర్తించి ప్రకటించిన రామప్ప దేవాలయం వద్ద  హెరిటేజ్ వాక్ నిర్వహించారు.  ఏఎస్ఐ  వరంగల్ సబ్ సర్కిల్, హైదరాబాద్ సర్కిల్ నిర్వహించిన  ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన  పురాతనమైన, రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు, కాకతీయ పాలకులు దేవాలయాన్ని నిర్మించారు.   


ప్రధాన వాస్తుశిల్పి రామప్ప పేరు మీద ఈ దేవాలయం రామప్ప దేవాలయం ప్రాచుర్యం పొందింది. వాస్తు శిల్పి పేరిట దేశంలో ప్రాచుర్యం పొందిన ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం ఒక్కటే.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పిఎస్‌టియు)లో తెలంగాణ పురావస్తు, సంస్కృతి, వారసత్వం అనే అంశంపై విద్యాపరమైన సదస్సులు జరిగాయి. ఉదయం జరిగిన సదస్సుకు  ఏఎస్‌ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్మిత ఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ స్మిత ఎస్ కుమార్ ఈ కార్యక్రమాల వల్ల  ప్రజల్లో అవగాహన పెంపొందించి  స్మారక చిహ్నాలను సంరక్షించి భావితరాలకు వాటిని అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు లక్ష్యాల మేరకు అమలు జరుగుతాయని అన్నారు.ప్రారంభోత్సవం  అనంతరం పీటీఎస్‌యూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేష్‌ ‘డెక్కన్‌ ఫిరంగులు- నిర్లక్ష్యానికి గురైన అందాలు’ అనే అంశంపై రూపొందించిన పత్రాన్ని డాక్టర్‌ ఎస్‌ జై కిషన్‌ సమర్పించారు.


సదస్సుకు  పీటీఎస్‌యూ, నిజాం కళాశాల, భవన్ కళాశాల విద్యార్థులు, ఓయూ ఆర్కియాలజీ విభాగం విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీ క్యాంపస్‌లో రామప్ప దేవాలయంపై ఫొటో ఎగ్జిబిషన్, తెలంగాణ సంస్కృతి, వారసత్వం పై లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది.పారిస్‌లోని అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు ప్రాంతాల మండలి చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా ఏప్రిల్ 18వ తేదీని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా నిర్వహించాలని యునెస్కో నిర్ణయించింది.ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏఎస్ఐ సోమవారం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఏఎస్ఐ నిర్వహణలో ఉన్న అన్ని చారిత్రక స్మారక చిహ్నాలను సోమవారం  ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పించారు.

Updated Date - 2022-04-19T01:33:13+05:30 IST