Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుండెకు సత్వర చికిత్స

(29 సెప్టెంబరు, వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా)


ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అవసరం. ఆస్పత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు, సత్వరంగా అందించే ప్రాథమిక చికిత్సలో అత్యంత కీలకమైనది ‘కార్డియో పల్మనరీ రీససిటేషన్‌ (సి.పి.ఆర్‌). హృదయ, శ్వాస సంబంధ బాధితులకు సి.పి.ఆర్‌, ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేషన్‌ చికిత్సలతో బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడే వీలుంది.


కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన తర్వాత, కోలుకునే అవకాశాలు నిమిషానికి 7 నుంచి 8ు చొప్పున శరవేగంతో తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో సత్వరం సి.పి.ఆర్‌ చేయడం వల్ల ఆ అవకాశాలు రెండు నుంచి మూడింతలు పెరుగుతాయి. సి.పి.ఆర్‌ చేసిన తర్వాత కేవలం 12ు మంది మాత్రమే ప్రాణాపాయం నుంచి బయటపడగలుగుతారు. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై ఆస్పత్రికి చేరుకునేలోపు సి.పి.ఆర్‌ అందుకుంటున్న బాధితుల సంఖ్య కేవలం 46 శాతమే ఉంటోంది.


ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది ప్రజలు గుండె జబ్బులతో మరణిస్తున్నారు. కార్డియాక్‌ అరెస్టుతో ప్రతి 90 సెకన్లకూ ఒకరు మరణిస్తున్నారు. కేన్సర్‌ మరణాల కంటే గుండె జబ్బుల మరణాలు ఎక్కువ. ప్రతి లక్ష మందిలో 4,280 మరణాలు సడెన్‌ కార్డియాక్‌ అరెస్టు వల్లే చోటు చేసుకుంటున్నట్టు భారత గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ మరణాలన్నింట్లో 30ు ఆస్పత్రి చేరుకున్న తర్వాత, అంతకంటే ఎక్కువగా 70ు మరణాలు ఆస్పత్రికి చేరుకునేలోపు సంభవిస్తున్నాయి. ఆస్పత్రి బయట జరిగే మరణాల్లో 80ు ఇళ్లలోనే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి కుటుంబసభ్యులకు సి.పి.ఆర్‌, ఎ.ఇ.డిలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మరణాలను నిలువరించవచ్చు.

అవగాహన అవసరం

పాశ్చాత్య దేశాల్లో సి.పి.ఆర్‌ గురించిన అవగాహన ప్రజల్లో ఎక్కువగా ఉంది. కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఎ.ఇ.డి అందుబాటులో ఉంది. ఆస్పత్రిలో, ఆస్పత్రి బయటా కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించిన వారి సమాచారం నమోదు చేయడం అవసరం. మన దేశంలో 2018లో, వరంగల్‌లో వరంగల్‌ ఏరియా కార్డియాక్‌ అరెస్ట్‌ రిజిస్ట్రీ ఏర్పాటైంది. ఇలాంటి రిజిస్ట్రీలు ప్రతీ నగరంలో ఏర్పాటు చేయడం అవసరం. రిజిస్ర్టీలను విశ్లేషించి, వీటి ద్వారా సామాన్య ప్రజానీకానికి అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేసి, చైతన్యపరిచి, కార్డియాక్‌ మరణాలను తగ్గించవచ్చు. నిరక్షరాస్యత, ప్రాథమిక దశలో ఉన్న అత్యవసర సేవలను అధిగమించి, సి.పి.ఆర్‌ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అవగాహనతో పాటు శిక్షణ కూడా ఇప్పించడం అవసరం.


డాక్టర్‌ బి. విజయ రావు, (యు.ఎస్‌).

ప్రొఫెసర్‌ ఆఫ్‌ రిససిటేషన్‌ మెడిసిన్‌.

ఫోన్‌: 9490752551

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...