Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 14 Feb 2020 13:12:47 IST

వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ

twitter-iconwatsapp-iconfb-icon

స‌మర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు

బ్యాన‌ర్‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌

తారాగ‌ణం:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, క్యాథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, ఇజబెల్లా లెయితె, జయప్రకాశ్, ప్రియదర్శి, శత్రు, ఆనంద చక్రపాణి త‌దిత‌రులు

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

కెమెరా: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి

ఎడిటింగ్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు:  కె.ఎ.వ‌ల్ల‌భ‌

ద‌ర్శ‌క‌త్వం: క‌్రాంతి మాధ‌వ్‌


విజ‌య్ దేవ‌ర‌కొండ‌...ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో. వ‌చ్చిన అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే హీరోగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడీ కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను న‌టించిన చిత్రాల్లో ఏడు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి. అందులో `పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` సినిమా సూప‌ర్‌సక్సెస్‌ల‌య్యాయి. మిగిలిన చిత్రాలేవీ ఆద‌ర‌ణ పొంద‌క‌పోయినా విజ‌య్‌కి యూత్‌లో క్రేజ్ త‌గ్గలేదు. త‌ను ఓపెన్‌గా మాట్లాడ‌టం కావ‌చ్చు మ‌రేదైనా కార‌ణం కావ‌చ్చు. ఈ క్రేజ్ కార‌ణంతోనే ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే కాస్త డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి విజ‌య్ ప్ర‌య‌త్నిస్తుంటాడు. అలాంటి ఈ కుర్ర హీరో ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అస‌లు ఈ `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` క‌థేంటి?  హీరో, నలుగురు హీరోయిన్స్‌తో చేసిన రొమాన్స్ ఏంటి?  చివ‌ర‌కు ఈ ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాంటే రివ్యూలోకి వెళ‌దాం...

వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ

కథ:

గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) ప్రేమికులు. సహజీవనం చేస్తుంటారు. పెద్ద రచయిత కావాలనేది గౌతమ్ లక్ష్యం. అందుకని, గొప్ప జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి... ప్రతిరోజు ఇంట్లో ఏదో రాయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఏమీ రాయడు. కొన్ని రోజులకు గౌతమ్ ప్రవర్తనపై యామినికి విసుగు వస్తుంది. బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో గౌతమ్ ఏం చేశాడు? సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) కథకు, గౌతమ్-యామిని కథకు సంబంధం ఏమిటి? అసలు, గౌతమ్ పారిస్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ అతడికి పరిచయమైన ఇజ (ఇజబెల్లా) ఎవరు? చివరికి,  గౌతమ్ - యామిని కలిశారా? లేదా? మధ్యలో గౌతమ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేది సినిమా.


వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ

విశ్లేషణ:

ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు. సినిమా ప్రారంభమే విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా బ్రేకప్ ఎపిసోడ్ తో ప్రారంభమౌతుంది. తర్వాత ఇల్లందు నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతోనూ దర్శకుడు తెరకెక్కించారు. పారిస్ ఎపిసోడ్ లో అక్కడి అందాలను తెరపై అందంగా ఆవిష్కరించారు. అందులో కథానాయకుడు చేసే త్యాగం కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. చిత్రంలో విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపించాడు. రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో అతడి గెటప్ 'అర్జున్ రెడ్డి' సినిమాలో గెటప్ ను గుర్తు చేస్తుంది. అంతకుముందు కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా మెప్పించారు. ఇల్లందు నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అయితే నటుడిగా విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొగ్గు గని కార్మికుడిగా, పదో తరగతితో చదువు ఆపేసిన యువకుడిగా... గ్రామీణ తెలంగాణ వాతావరణంలో యువకులు ఎలా ఉంటారో అలాగే కనిపించారు. పారిస్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా ఉన్నాడు.


కథానాయకుల్లో ఐశ్వర్య రాజేష్ అందరికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తుంది.‌ మినిమల్ మేకప్, చీరకట్టులో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. స్మిత మేడమ్ పాత్రలో కేథరిన్ చక్కగా నటించారు. రాశి ఖన్నా కొన్ని సన్నివేశాల్లో బాగా చేశారు. కొన్ని సన్నివేశాలలో ఆమె నటన 'తొలిప్రేమ', 'శ్రీనివాస కళ్యాణం' చిత్రాల్లో ఆమె నటనను గుర్తు చేస్తుంది. ఇజబెల్లా ఫారిన్ పైలెట్ పాత్రకు సూట్ అయింది. తమిళ నటుడు జయప్రకాష్ తనకు అలవాటైన పాత్రలో, రిచ్ ఫాదర్ గా కనిపించారు. విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ప్రియదర్శి పాత్ర రెండు మూడు సన్నివేశాలకు పరిమితమైంది. శత్రు, ఆనంద చక్రపాణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 


గోపీసుందర్ సంగీతంలో 'బొగ్గుగనిలో రంగు మణిరా' పాట బావుంది. మిగతా పాటలకు ఇంకా మంచి బాణీలు అందిస్తే బావుండేది. నేపధ్య సంగీతం పర్వాలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రథమార్థం అంతా చకచకా సాగినప్పటికీ... ద్వితీయార్థం వచ్చేసరికి కదా నెమ్మదిగా వెళ్తున్న భావన కలుగుతుంది. అందులోనూ కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ నటన అర్జున్ రెడ్డి ని తలపించడం సినిమాకు మైనస్ అయింది. సన్నివేశాల్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ... మాటల్లో అంతగా కనిపించలేదు. ఎమోషనల్ అండ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ఉంటే సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేవి.


చివరగా: వరల్డ్ ఫేమస్ లవర్... అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుంచి బయటకు రావాలి!


రేటింగ్:...2.5/5

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement