Abn logo
Mar 17 2020 @ 19:43PM

ఆ బ్రేకప్‌ బాధాకరమే.. కానీ మంచే జరిగింది: ఇజాబెల్లే

భాష రాదు, వాతావరణం, మనుషులు కొత్త...ఎటు చూసినా గందరగోళం..అయోమయం. మనసులో మాట చెప్పుకోవడానికి లేదు. బ్యాగులో కేవలం ఆరుజతల బట్టలు, పర్సులో కొంత నగదు పెట్టుకుని ఓ విదేశీ అమ్మాయి బ్రెజీల్‌ నుంచి ముంబాయిలో అడుగుపెట్టింది. అదీ కేవలం ఒకే ఒక స్నేహితురాలిని నమ్మి సంపాదన కోసం ఇండియాకు వచ్చిన ఆ అమ్మాయి ఎవరో కాదు ఇజాబెల్లే లియాట్‌. భారతదేశానికి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాలలో తను నిలదొక్కుకుని తన కుటుంబానికి ఆసరా కావడానికి ఇజాబెల్లే ఎన్ని తిప్పలు పడిందో, ఎంత కష్టపడిందో ఆమె మాటల్లోనే...


భారతదేశానికి ఎలా వచ్చారు?

నాది బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్ర రాజధాని జోం పెసావా. నేను పుట్టిందీ పెరిగిందీ అక్కడే. మా ఫాదర్‌ పోలీసాఫీసర్‌. మా మదర్‌ హౌస్‌ వైఫ్‌. నాకో సిస్టర్‌, బ్రదర్ ఉన్నారు. నాకు మొదటినుంచీ లాయర్‌ కావాలని కోరికగా ఉండేది. అనుకున్నవన్నీ జరగవు కదా. నా విషయంలోనూ అదే జరిగింది. నేను ప్లస్‌ టూ చదువుతున్నప్పుడు మా ఫాదర్‌ ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత నా మీద పడింది. చదువుకుంటూనే మోడలింగ్‌ వైపు దృష్టి సారించాను. మోడల్‌గా నాకు వచ్చే అరాకొరా సంపాదనతోనే మా ఇల్లు గడిచేది. అలాంటి పరిస్థితుల్లోనూ లాయర్‌ కావాలన్న నా కలను విడువలేదు. చాలా కష్టం మీద లాయర్‌ డిగ్రీ తీసుకోగలిగాను. డిగ్రీ అయితే సంపాదించగలిగాను కానీ, దానితో ఇంటికి సరిపడ ఆదాయం మాత్రం సంపాదించలేకపోయాను. చివరికి ఇల్లు గడవడానికి సరిపడే సంపాదన కోసం మోడలింగ్‌నే ఎంచుకున్నాను. ముంబాయిలో నాకొక స్నేహితురాలు ఉంది. ఇండియాలో మోడలింగ్‌కు అవకాశాలు ఎక్కువనీ, డబ్బు కూడా బాగా సంపాదించకోవచ్చనీ, ముంబాయి వస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. తన సలహా మేరకే చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా, కేవలం ఆరేడుజతల బట్టలతో ఇండియాలో అడుగుపెట్టాను.


ఇండియాకు వెడతానంటే మీ పేరెంట్స్‌ ఏమనలేదా?

అప్పట్లో మాకు డబ్బవసరాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆదాయం ఇక్కడ కన్నా అక్కడ బాగుంటుందనీ, కొంత సంపాదించుకున్న తరువాత తిరిగి వచ్చేస్తానని వారికి నచ్చచెప్పి వచ్చాను. నేను ఎంత నచ్చచెప్పినా, కొంత అసంతృప్తితోనే వారు నన్ను ఇండియాకు పంపారు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ ఎనిమిది సంవత్సరాలలో డబ్బుతో పాటు బోలెడంత మంది అభిమానులను కూడా సంపాదించుకోగలిగాను. బ్రెజిల్‌లోనే ఉండిపోతే ఇంత మంది అభిమానాన్ని పొందేదాన్ని కాదేమో. 


ఇక్కడ అవకాశాలు బాగా వచ్చాయా?

రాగానే నాకు ఎవరూ రెడ్‌ కార్పెట్‌ పరవలేదు. డబ్బు సంపాదించడానికీ, నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కేవలం మోడలింగ్‌ మీదే ఆశలు పెట్టుకోలేదు. సినిమా ఛాన్స్‌లు కూడా ప్రయత్నించేదాన్ని. కాకపోతే భాష తెలియదు. నాకు ఇక్కడకు వచ్చేంత వరకూ పోర్చుగీసు తప్ప మరేభాష రాదు. ఆడిషన్స్‌కు వెడితే వారు ఏం చెబుతున్నారో, అడుగుతున్నారో అర్ధమయ్యేది కాదు. డైలాగులు చెప్పమంటే బ్లాంక్‌ ఫేస్‌ పెట్టేదాన్ని. దాంతో డైలాగుల ప్రింట్‌వుట్‌ తీసుకుని రూముకొచ్చి నేర్చుకుని వెళ్ళేదాన్ని. భాషరానివారితో ఇబ్బందన్న ఉద్దేశంతో చాలా అవకాశాలు చేజారిపోయాయి. దానితో కేవలం పదిహేను రోజుల్లో హిందీ, ఇంగ్లీష్‌ నేర్చుకున్నాను. భాష ఇబ్బందులు ఇలా ఉంటే, ట్రాఫిక్‌ కష్టాలు మరోరకంగా ఉండేవి. ముంబాయి ట్రాఫిక్‌ రూల్స్‌ అస్సలు అర్ధమయ్యేవి కావు. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇక్కడి రూల్స్‌ ఫాలో కావడానికి చాలా కాలమే పట్టింది. దానితో ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలంటే భయమేసేది. నా స్నేహితురాలికి తీరిక దొరికినప్పుడే బయటకు వెళ్ళేదాన్ని. లేకపోతే రూమ్‌లోనే ఉండిపోయేదాన్ని. వీటికి తోడు వాతావరణం, ఆహారం మారడంతో ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పట్టుదలతో ప్రయత్నించేదాన్ని. నా కష్టానికి తగిన ఫలితం ఒకటి రెండు సంవత్సరాల తరువాత లభించింది. 


సినిమాలలో అవకాశం ఎలా వచ్చింది?

మోడలింగ్‌ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాలీవుడ్‌కు చెందిన కొందరితో నాకు పరిచయం కలిగింది. దానితో కరీనాకపూర్‌ సినిమా తలాష్‌లో నాకు ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమాలో నా పాత్రకు పెద్దగా డైలాగులు లేవు. దాంతో పెద్దగా ఇబ్బంది పడకుండా నటించాను. ఆ సినిమాలో నా పాత్రకి అంతగా పేరు రాలేదు. కానీ రెండు సినిమా అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత నేను హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఆ సమయంలోనే పలు ఉత్పత్తులకు మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఇక దాని తరువాత వెనుతిరిగి చూసుకోనవసరం లేకపోయింది. సినిమా అవకాశాలు రావాలంటే డ్యాన్స్‌ వచ్చి తీరాలని కొందరు అనడంతో కూచిపూడీ, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను.

తెలుగులో అవకాశమెలా వచ్చింది?

బాలీవుడ్‌లో సినిమాలు చేసే సమయంలోనే తెలుగు సినిమాల గురించి తెలిసింది. బాహుబలి, అర్జున్‌ రెడ్డి సినిమాలు నిర్మిస్తున్న సమయంలో అందులో చిన్న పాత్ర అయినా సరే చేద్దామని చాలా ప్రయత్నించాను. కానీ అవకాశం దొరకలేదు. అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో అవకాశమొచ్చింది. ఆ యూనిట్‌ వారు అఖిల్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ పాత్ర కోసం ఓ విదేశీ అమ్మాయి కోసం ప్రయత్నించారు. అప్పటికే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసిన నన్ను చూసి నాకు అవకాశమిచ్చారు. ఆ సినిమాలో నా పాత్రకు డైలాగులు లేవు. దాంతో భాష ఇబ్బందిగా అనిపించలేదు. ఆ సినిమా తరువాత బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేశాను. మా ఫ్యామిలీని చూడడానికి బ్రెజిల్‌ వెళ్ళినప్పుడు ‘వరల్ట్‌ ఫేమస్‌ లవర్‌’లో ఓ పాత్ర కోసం క్రాంతి మాధవ్‌గారు నాకు ఫోన్‌ చేశారు. మా సినిమాలో ఓ పాత్ర ఉంది చేస్తారా? అని అడిగారు. ఎప్పటి నుంచో విజయ్‌ దేవరకొండతో చేయాలన్నది నా కోరిక. క్రాంతి మాధవ్‌గారి మాటలు వినగానే బాగా సంతోషమనిపించింది. వెంటనే ఓకే చెప్పేసాను. ఈ సినిమాలో పైలట్‌ పాత్ర చేశాను. దీని కోసం ప్రత్యేకించి శిక్షణ తీసుకున్నాను. పట్టుపట్టి తెలుగు నేర్చుకుని ఈ సినిమాకు నాకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఈ సినిమాను మా మదర్‌ బ్రెజిల్‌ నుంచి వచ్చి ఇక్కడ ధియేటర్‌లో చూశారు. 


విజయ్‌తో చేయడం ఎలా అనిపించింది?

‘అర్జున్‌రెడ్డి’ సమయంలోనే తన గురించి చాలా విన్నాను. షూటింగ్‌లో తనని చూసినప్పుడు నేను విన్నవి అబద్ధాలు కాదని అర్ధమైంది. తను చాలా జోవియల్‌గా ఉంటాడు. వర్క్‌ దగ్గరకి వచ్చేసరికి సీరియస్‌ అయిపోతాడు. తెలుగులో నా రెండో సినిమానే అంత పెద్దహీరోతో చేయడం చాలా ఆనందంగా అనిపించింది.


తెలుగులో అవకాశాలెలా ఉన్నాయి?

తెలుగులో చాలా మంది అడుగుతున్నారు. కథలు విన్నాను. ఎవరికి ఓకే చెప్పలేదు. బాలీవుడ్‌లో ఒప్పుకున్న సినిమాలు రెండున్నాయి. అవిఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేను. అవి స్టార్ట్‌ కాగానే తెలుగు సినిమాలకి ఓకే చెబుతాను. ఒక్క తెలుగనే కాదు. దక్షిణాదిన ఇతర భాషల నుంచీ కూడా అవకాశాలొస్తున్నాయి. భాష అస్సలు రాదు కనుక వాటికి ఓకే చెప్పలేదు. తెలుగు నేర్చుకున్నట్టే దక్షిణాదిన మిగతా భాషలు కూడా నేర్చుకుని ఆ తరువాత అక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నాను. 


ప్రేమా పెళ్ళి మీద మీ అభిప్రాయం?

మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ వివాహ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉంది. అందుకే ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదు. చదువుకునే రోజుల్లో ఓ వ్యక్తితో నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్‌ చేశాను. ఆ తరువాత మా అభిప్రాయాలు కలవవని విడిపోయాం. అప్పుడు విడిపోవడం బాధ అనిపించినా, ఇప్పుడు నాకు మంచే జరిగింది. అప్పటి నుంచీ సింగిల్‌గానే ఉంటున్నాను. మరో రెండు మూడు సంవత్సరాల వరకూ పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు. ఇంత వరకూ ఎవరూ నాకు ప్రపోజ్‌ కూడా చేయలేదు. 


ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నారు?

దాని గురించి ఇంకా ఆలోచించలేదు. నీతినిజాయితీ ఉన్న వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్‌ పార్టనర్‌కి ఈ రెండు గుణాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వ్యక్తి సినీరంగానికి చెందిన వాడా? బయట వ్యక్తా? అన్నది ఆలోచించను. ప్రేమంచి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. 

–స్పందనరెడ్డి

Advertisement
Advertisement
Advertisement