ఆవరణాన్ని రక్షిస్తున్నది అమ్మలే!

ABN , First Publish Date - 2022-06-05T06:01:40+05:30 IST

తరిగిపోతున్న అడవులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, అకాల వర్షాలు, భూమిపైనా నీళ్లలోనూ..

ఆవరణాన్ని రక్షిస్తున్నది అమ్మలే!

తరిగిపోతున్న అడవులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, అకాల వర్షాలు, భూమిపైనా నీళ్లలోనూ నిండుతున్న ప్లాస్టిక్‌లు, విషరసాయనాలు, కేన్సర్‌కారక కాలుష్యాలు, ఊపిరి సలపని వాతావరణం... ఇదీ నేడు మన చుట్టూ పరిస్థితి. పేదవారు, గొప్పవారు, పిల్లలు, పెద్దలు, గ్రామీణులూ, పట్టణవాసులూ ఎవరూ తప్పించుకోలేని దుర్భర పరిస్థితిలో మానవాళి చిక్కుకుపోతున్నది. అడవులలో జీవిస్తూ, అటవీ సంపదను తమ సాంప్రదాయ పద్ధతుల్లో కాపాడుతూ వచ్చిన ఆదివాసులను ఆక్రమణదారులుగా ఆరోపించి అడవుల నుంచి వెళ్ళగొట్టటం మొదలైనప్పటి నుంచి పర్యావరణ వినాశనం ఆరంభమైంది. విశాలమైన అటవీ ప్రాంతాలను లాభాపేక్షతో పరిశ్రమలకు మళ్లించటం, ఖనిజ సంపద కోసం గనుల తవ్వకం, అటవీ భూములను కాలుష్య కారక కంపెనీలకు లీజుకివ్వటం, పెద్ద ఆనకట్టల నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల అటవీ భూములను సేకరించి ఆదివాసులను నిర్వాసితులను చేయటం ఈ వినాశనానికి బాటలు వేశాయి. అదే సమయంలో విషరసాయనాలతో కూడిన వ్యవసాయం విస్తరించి ఆహారాన్ని విషతుల్యం చేయటమే కాదు భూమి, నీరు, గాలి కూడా విషపూరితమవుతున్నాయి. అనేక రకాల స్థానిక పంటల వైవిధ్యం నశించిపోతున్నది.


ఈ పర్యావరణ వినాశనం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు దారితీసి తీవ్ర సంక్షోభానికి కారణమవుతున్నది. ఉష్ణోగ్రతలు పెరిగి, మంచు నదులు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. నెలరోజులలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులో కురిసి నగరాలూ గ్రామీణ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరువులు రెండూ ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తున్నాయి. ఈ వాతావరణ సంక్షోభం కారణంగా మనుషులందరూ ప్రభావితులవుతున్నప్పటికీ పేద ప్రజలు ఎక్కువగా బాధింపబడుతున్నారు. అందునా పితృస్వామ్య సమాజంలో అన్ని విధాలుగా అంచులకు నెట్టివేయబడి, అణచివేతకు గురవుతున్న మహిళలు మరింత ఎక్కువగా ఆ పరిణామాలను అనుభవిస్తున్నారు. భూమి హక్కులు లేక, రైతులుగా గుర్తింపు లేక, పంటల విషయంలో నిర్ణయాధికారం లేక, ప్రభుత్వ పథకాలు అందక సతమతమవుతున్న మహిళా రైతులు అదనంగా ఈ పర్యావణ సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అటవీ సంపద, వ్యవసాయం, పశుపాలనపై ఆధారపడి బతుకుతున్న మహిళా రైతులు తామున్న ఊళ్ళో ఉపాధి దొరక్క పనికోసం వలసపోవాల్సి వస్తున్నది. కొత్త ప్రదేశంలో కనీస వసతులు లేక ఇబ్బందిపడటం ఒక రకమైన హింస అయితే, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వారి జీవితాలనే నాశనం చేస్తున్నాయి.


పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే జాగృతి 30 ఏళ్లకు ముందే మొదలైంది. పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. వాటిలో మహిళలే ముందు నిలిచారు. ఉత్తర భారతదేశంలో చెట్లను కొట్టకుండా వాటిని అతుక్కుని ఆపటానికి మొదలైన ‘చిప్కో’ (కర్ణాటకలో ‘అప్పికో’) ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణం నాశనమైతే తమకు, తమ పిల్లలకు భవిష్యత్తు దుర్భరమవుతుందని మహిళలే ముందడుగు వేశారు. అదేవిధంగా పేద కుటుంబాల మహిళలు ఎక్కువగా ఉపయోగించుకునే ఉమ్మడి భూములు, అటవీ భూముల పరిరక్షణకు కూడా మహిళలే నడుం బిగించారు. అటవీ ప్రాంతాలలో ఆదివాసీ భూముల పరాయీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో ఆదివాసీ మహిళలే ముందు నిలుస్తున్నారు. ఇక వ్యవసాయంలో విషరసాయనాల దుష్ప్రభావాన్ని తొలగించటానికి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా మహిళా రైతులే ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో దక్షిణాన కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా వంటి అనేక రాష్ట్రాలలో మహిళా రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి సమిష్టి వ్యవసాయం చేస్తూ కనుమరుగవుతున్న చిరు ధాన్యాలు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు వంటి వైవిధ్యం గల పంటల సాగును పునరుద్ధరిస్తున్నారు. స్థానికంగా పండించే పంటల విత్తనాలను కాపాడుతున్నారు. వ్యవసాయంపై కార్పొరేటు కంపెనీల ఆధిపత్యాన్ని తాము చేయగల స్థాయిలో ఎదిరిస్తున్నారు. ఆహార, విత్తన సార్వభౌమత్వాన్ని సాధించటం కోసం కృషి చేస్తున్నారు. ఈ ఉద్యమంలోకి మరింతమంది మహిళలు వేలు లక్షల సంఖ్యలో కదిలి భూమి, అడవి, నీటి వనరులపై తమ హక్కులను సాధించుకోవటానికి నడుం బిగించాలి. మహిళా రైతులకు భూమి హక్కులు లభించినప్పుడు వారు నిర్ణయాధికారం సంపాదించుకుని స్వయంగా అణచివేత హింసల నుంచి బయటపడటమేగాక తమ కుటుంబాలను మెరుగైన పద్ధతిలో పోషించుకుంటున్నారని అనేక ఉదాహరణలు చెబుతున్నాయి.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే పర్యావరణాన్ని నాశనం చేసే కార్పొరేటు కంపెనీలకు అనుకూలమైన విధానాలను, పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం గత ఐదేళ్లుగా హరితహారం పేరుతో అడవుల పెంపకాన్ని చేపడుతున్నామని చెప్పి, తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసులకు ఆ భూములపై హక్కు పత్రాలను ఇవ్వాల్సింది పోయి, వాళ్ళని అక్రమణదారులుగా ఆరోపించి వెళ్లగొడుతున్నది. ఒకపక్క మొక్కలు నాటటానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరొక వైపు ఫార్మా సిటీల వంటి కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సహజ వనరులను విపరీతంగా నష్టపరిచే భారీ థర్మల్ పవర్ ప్లాంటులను నిర్మిస్తున్నది. రాష్ట్రంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ సృష్టిస్తున్న వినాశనం అంతా ఇంతా కాదు. ఇవన్నీపెద్ద ఎత్తున ఆర్థిక–పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నాయి.


పర్యావరణ పరిరక్షణ అంటే చెట్లు పెంచటం మాత్రమే కాదు– మనం పీల్చే గాలీ, తాగే నీరు, తినే తిండీ సురక్షితంగా ఉండాలి. మన మట్టీ, నదులు, చెరువులు కలుషితం కాకుండా ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవాలి! మహిళా రైతులకు సహకార సంఘాలు ఏర్పరిచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వైవిధ్యం గల ఆహార పంటలు పండించటానికి అన్ని విధాలుగా సహాయం అందించాలి! వారి సేంద్రియ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవటానికీ ప్రత్యేక వ్యవస్థాగత మద్దతు, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి, వారికి వనరులపై హక్కులు కల్పించాలి! అడవులను కాపాడుతున్న ఆదివాసులకు అటవీ హక్కులు మంజూరు చేసి ఆదివాసీ మహిళల జీవనోపాధులను రక్షించాలి! ఆరుగాలం శ్రమించే భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలను అసంఘటిత కార్మికుల బోర్డును ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయాలి, వారికీ సామాజిక భద్రత పధకాలను అమలుచేయాలి.


ఎస్. ఆశాలత, ఉషా సీతాలక్ష్మి 

మహిళా రైతుల హక్కుల వేదిక

(నేడు పర్యావరణ దినోత్సవం)

Updated Date - 2022-06-05T06:01:40+05:30 IST