విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి, అభివృద్ధికి అండ

ABN , First Publish Date - 2021-12-04T05:39:50+05:30 IST

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి, అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకలను కాకినాడ ఐడియల్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు.

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి, అభివృద్ధికి అండ
కన్నా ఆశ్రయ ఫౌండేషన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్‌ అందజేస్తున్న జేసీ భార్గవ్‌తేజ

  • జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ

కాకినాడ రూరల్‌, డిసెంబరు 3: విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి, అభివృద్ధికి  ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకలను కాకినాడ ఐడియల్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ విభిన్న   ప్రతిభావంతుల్లోని ప్రతిభను గుర్తించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. దివ్యాంగులకు రూ. 3,000 పింఛనుతో పాటు వివిధ రకాల ఉపకార వేతనాలు, సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులకు టచ్‌ మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉపకరణాలు అందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ వాడ్రేవు కామరాజు మాట్లాడుతూ 1981లో ఐక్యరాజ్యసమితి డిసెంబరు 3న దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం ప్రారంభించిందన్నారు. ఈ సందర్భంగా 12 మంది దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు, ఏడుగురికి ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కార్యక్రమంలో ఉమామనోవికాస కేంద్రం ప్రతినిధి ఎస్పీ రెడ్డి, ఓఎన్జీసీ జీఎం డి.మాలిక్‌, సూపరింటెండెంట్‌ నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో కోరుకొండ మండలం బూరుగుపూడి కన్నా ఆశ్రయ ఫౌండేషన్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వారికి జేసీ బహుమతులు అందజేశారు.


Updated Date - 2021-12-04T05:39:50+05:30 IST