వరల్డ్‌కప్‌ వచ్చే ఏడాదికి.. ఐపీఎల్‌ తెరపైకి

ABN , First Publish Date - 2020-05-22T10:20:37+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్‌ ప్రాధామ్యాలు వేగంగా మారుతున్నాయి. కాసులు కురిపించే ఐపీఎల్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ, తాజా పరిణామాలతో టీ20 వరల్డ్‌కప్‌

వరల్డ్‌కప్‌ వచ్చే ఏడాదికి.. ఐపీఎల్‌ తెరపైకి

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్‌ ప్రాధామ్యాలు వేగంగా మారుతున్నాయి. కాసులు కురిపించే ఐపీఎల్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ, తాజా పరిణామాలతో టీ20 వరల్డ్‌కప్‌ వద్దు.. ఐపీఎల్‌ ముద్దు అని అంటున్నారు.  పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ.. సెప్టెంబరు-నవంబరుల్లో ఐపీఎల్‌ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. అదే జరిగితే ఆస్ట్రేలియాలో ఈ ఏడాది నిర్వహించాల్సిన టీ20 వరల్డ్‌క్‌పను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిందే..! కరోనా కారణంగా వాయుదా పడిన ఐపీఎల్‌-2020ని సెప్టెంబరు 25 నుంచి నవంబరు ఒకటి వరకు షెడ్యూల్‌ చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకవేళ దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే యూఏఈలోనైనా లీగ్‌ను నిర్వహించడానికి బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని సమాచారం. వచ్చే వారం బోర్డు సమావేశం నేపథ్యంలో అక్టోబరు 18 నుంచి ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని ఐసీసీపై ఒత్తిడి కూడా పెరుగుతోందట. అలా జరిగితే ఆ సమయంలో ఐపీఎల్‌ను షెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. సెప్టెంబరులో స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ముందుగానే నిర్వహించడమో లేదా వాయిదా వేయడమో చేయనుంది.


70 శాతం ఎక్కువ రెవెన్యూ..

ఈ ఏడాది ఐపీఎల్‌ను రద్దు చేయడం క్రికెట్‌కు నష్టమేనని ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ రామన్‌ నివేదిక పేర్కొంది. టీ20 వరల్డ్‌కప్‌ కంటే ఐపీఎల్‌ 70 శాతం ఎక్కువ రెవెన్యూ ఆర్జిస్తుందని రామన్‌ విశ్లేషించాడు. ఆటగాళ్లకు జీతాలుగా ఇచ్చే రూ. 756 కోట్లు.. కొన్ని దేశాల ప్రసార హక్కుల ఆదాయం కంటే ఎక్కువని చెప్పాడు. వైరస్‌ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని 2021, అక్టోబరుకు టీ20 వరల్డ్‌క్‌పను వాయిదా వేయాలని సూచించాడు. వైరస్‌తో టీ20 వరల్డ్‌కప్‌పై నిర్వహణపై అనుమానాలుండడంతో.. ఐపీఎల్‌కు సైడివ్వడం మంచిదని రామన్‌ పేర్కొన్నాడు. మెగా లీగ్‌ నిర్వహణే మేలని బీసీసీఐ సీఈవో రాహుల్‌  జోహ్రీ కూడా అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-05-22T10:20:37+05:30 IST