డోసు.. ధరల రేసు!!

ABN , First Publish Date - 2020-08-07T08:03:25+05:30 IST

ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టి కరోనా వ్యాక్సిన్ల పరిశోధనలపైనే ఉంది. తొలి రెండు ప్రయోగ దశలను దాటు కొని.. చిట్టచివరిదైన మూడో దశలోకి అడుగిడిన వ్యాక్సిన్‌ కేండిడేట్ల వైపే అందరిచూపు ఉంది...

డోసు.. ధరల రేసు!!

  • అతిచౌక కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ‘భారత్‌’ ముందంజ 
  • ధర వాటర్‌ బాటిల్‌ కన్నా తక్కువే.. 

వాషింగ్టన్‌, ఆగస్టు 6 : ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టి కరోనా వ్యాక్సిన్ల పరిశోధనలపైనే ఉంది. తొలి రెండు ప్రయోగ దశలను దాటు కొని.. చిట్టచివరిదైన మూడో దశలోకి అడుగిడిన వ్యాక్సిన్‌ కేండిడేట్ల వైపే అందరిచూపు ఉంది. ఈ ఏడాది చివరి లోగా వ్యాక్సిన్‌ వచ్చేస్తుందనే అభిప్రాయాన్నే ఎక్కువ శాతం మంది వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల రేటు ఎంత ఉండబోతోంది? అతిచౌక వ్యాక్సిన్‌ను ఏ కంపెనీ అందించబోతోంది? అనే దానిపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ‘భారత్‌ బయోటెక్‌’ అతి చౌక వ్యాక్సిన్‌ను అందించే రేసులో అన్నింటి కంటే ఒక అడు గు ముందుందనే చెప్పాలి. తాము అభివృద్ధిచేసిన కోవ్యాక్సిన్‌ విజయవంతమైతే.. వాటర్‌ బాటిల్‌ కన్నా తక్కువ రేటుకే అందిస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. 


కొన్ని దేశాలు రూ.3వేల కోట్లు జమచేశాయి: మొడెర్నా

కొవిడ్‌ వ్యాక్సిన్‌తో అమెరికాలో తొలిసారిగా మనుషులపై ప్రయోగాలను ప్రారంభించిన కంపెనీ ‘మొడెర్నా’. వ్యాక్సిన్‌ (ఎంఆర్‌ఎన్‌ఏ-1273) ఒక్కో డోసు ధర రూ.2,400 నుంచి రూ.2,800 మధ్య ఉంటుందని ప్రకటించింది.  వ్యాక్సిన్‌ను రిజర్వ్‌ చేయాలని కోరుతూ పలు దేశాలు తమ కంపెనీ వద్ద రూ.3వేల కోట్లను డిపాజిట్‌ చేశాయని మొడెర్నా తెలిపింది. కాగా, ఎలు కలపై జరిపిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది. 


సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ‘నోవావ్యాక్స్‌’ లైసెన్సు 

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ (ఏడీ 26- సీఓవీ 2ఎస్‌) ధర డోసుకు రూ.750 దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఫైజర్‌ , జర్మనీకి చెందిన బయో ఎన్‌ టెక్‌ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ (బీఎన్‌టీ 162) ధర డోసుకు దాదాపు రూ.1500 ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలోని మేరీలాండ్‌ కేంద్రంగా పనిచేసే నోవావ్యాక్స్‌ కంపెనీ తయారుచేసిన ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర డోసుకు రూ.1200 ఉండొచ్చని ఔషధ రంగ పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి భారత్‌ సహా అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో పంపిణీ చేసేందుకు సంబంధించిన ప్రత్యేక లైసెన్సులను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దక్కించుకుంది. 

Updated Date - 2020-08-07T08:03:25+05:30 IST