రన్నరప్‌ సింధు

ABN , First Publish Date - 2021-03-08T09:23:29+05:30 IST

కొత్త సీజన్‌ను టైటిల్‌తో గ్రాండ్‌గా ఆరంభించాలనుకొన్న వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు.. తుది మెట్టుపై తడబడింది.

రన్నరప్‌ సింధు

విజేత మారిన్‌

 స్విస్‌ ఓపెన్‌


బాసిల్‌: కొత్త సీజన్‌ను టైటిల్‌తో గ్రాండ్‌గా ఆరంభించాలనుకొన్న వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు.. తుది మెట్టుపై తడబడింది. ఆదివారం జరిగిన స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ పోరులో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకొంది. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 12-21, 5-21తో టాప్‌ సీడ్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలైంది. కేవలం 35 నిమిషాల్లోనే మారిన్‌.. మ్యాచ్‌ను ముగించింది. టాప్‌ సీడ్‌ల మధ్య టైటిల్‌ సమరం కావడంతో మ్యాచ్‌ ఎంతో ఆసక్తిగా సాగుతుందని భావించారు. కానీ, 18 నెలల తర్వాత మేజర్‌ ఈవెంట్‌ ఫైనల్‌కు చేరిన సింధు.. ఒలింపిక్‌ చాంప్‌ మారిన్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు 6-4తో పైచేయిగా కనిపించినా.. మారిన్‌ ఫాస్ట్‌ గేమ్‌తో గాడితప్పింది.


7-6తో ముందంజ వేసిన మారిన్‌.. 11-8తో బ్రేక్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ 21-12తో తొలి గేమ్‌ను సొంతం చేసుకొంది. ఇక రెండో గేమ్‌లో భారత షట్లర్‌ పూర్తిగా చేతులెత్తేయడంతో మారిన్‌ 21-5తో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకొంది. కరోలినా చేతిలో ఓడడం సింధుకు వరుసగా ఇది మూడోసారి. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) గెలుచుకొన్నాడు. ఫైనల్లో అక్సెల్‌సెన్‌ 21-16, 21-6తో కున్లావత్‌ విటిడ్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించాడు. 

Updated Date - 2021-03-08T09:23:29+05:30 IST