Nikhat Zareen: కామన్వెల్త్ గేమ్స్.. పసిడి సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌

ABN , First Publish Date - 2022-08-08T01:04:09+05:30 IST

కామన్వెల్ గేమ్స్‌లో పదో రోజు భారత క్రీడాకారులు కనక వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే బాక్సర్లు అమిత్ పంఘల్

Nikhat Zareen: కామన్వెల్త్ గేమ్స్.. పసిడి సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌

బర్మింగ్‌హామ్: కామన్వెల్ గేమ్స్‌లో పదో రోజు భారత క్రీడాకారులు కనక వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే బాక్సర్లు అమిత్ పంఘల్ (Amit Panghal), నీతు గంఘాస్ (Nitu Ganghas) పురుషుల ప్లైవెయిట్, మహిళల మినిమమ్ వెయిట్ కేటగిరీలో బంగారు పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, రజతం రాగా, 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో కాంస్య పతకం లభించింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ (17.03 మీటర్ల జంప్) పసిడి పతకం సాధించగా, అబ్దుల్లా అబూబాకర్ (17.02 మీటర్లు) రజతం చేజిక్కించుకున్నాడు. 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.


తాజాగా, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen) బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించి భారత స్వర్ణాల సంఖ్యను  17కు పెంచింది. మహిళల 50 కేజీల ఫ్లైవెయిట్ ఫైనల్స్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌ను చిత్తు చేసి కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందుకుంది. నిఖత్‌కు ఇది హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం.


26 ఏళ్ల నిఖత్ ఈ సీజన్‌లో ఇప్పటికే  2వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా కామన్వెల్త్‌లో మూడో పసిడిని పట్టేసింది. నిఖత్ అందించిన తాజా స్వర్ణంతో కలుపుకుని భారత పతకాల సంఖ్య 48కి పెరిగింది. ఇందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు ఉన్నాయి. 162 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా,  భారత్ నాలుగో స్థానంలో ఉంది.

Updated Date - 2022-08-08T01:04:09+05:30 IST