ధూమపానం మానేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-31T17:52:00+05:30 IST

భూమిలో పండే పొగాకు భూమిని కలుషితం చేయడంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ ఉంటుంది. పొగాకు సాగు, తయారీ, దాని రసాయనాలు తాగే నీటినీ, నేలనూ కలుషితం చేస్తాయి.

ధూమపానం మానేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసా?

ఆంధ్రజ్యోతి(31-05-2022)

పొగాకును మానేయండి - భూమిని కాపాడండి

నేడు పొగాకు వ్యతిరేక దినోత్సవం


భూమిలో పండే పొగాకు భూమిని కలుషితం చేయడంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ ఉంటుంది. పొగాకు సాగు, తయారీ, దాని రసాయనాలు తాగే నీటినీ, నేలనూ కలుషితం చేస్తాయి. పొగాకుతో మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిపోయింది.  90% లంగ్‌ క్యాన్సర్లకు ప్రధాన కారణం సిగరెట్‌ తాగడమే! మన దేశంలో 10% నుంచి 20% మంది పొగాకు బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలో దాదాపు 2 కోట్ల 70 లక్షల మంది పొగాకును నిత్యం ఉపయోగిస్తున్నారు. దేశ జనాభాలో 15 ఏళ్లు పైబడినవాళ్లు 28.6% మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే, రాబోయే ఐదేళ్లలో తెలంగాణాలో క్యాన్సర్‌ భారం 12.5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. తెలంగాణా రాష్ట్ర క్యాన్సర్‌ ఫ్యాక్ట్‌ షీట్‌ ప్రకారం ఐ.సి.ఎమ్‌.ఆర్‌, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సిడిఐఆర్‌) విడుదల చేసిన రీసెర్చ్‌ రిపోర్టు ప్రకారం, ప్రస్తుతం వినియోగంలో ఉన్న పొగాకు ట్రెండ్‌ ఆధారంగా, 2020లో 47, 620గా ఉన్న క్యాన్సర్‌ కేసులు 2025 నాటికి 53,565కు పెరుగుతాయని నివేదికలో పేర్కొనడం జరిగింది. 


ధూమపానం మానేస్తున్న వారు మన దేశంలో చాలా తక్కువ. ధూమపానం మానేయడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గడంతో పాటు మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. పొగతాగడం మానేసిన వారి రక్తనాళాల్లో రక్తప్రసరణ మెరుగు పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. 40 ఏళ్లు దాటక ముందే ఈ అలవాటును మానుకోవడం ద్వారా మరణించే అవకాశాలు కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.


ధూమపానం మానేయడం వల్ల ఉపయోగాలు

128 గంటల్లోపు రక్తప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంటుంది.

24 గంటల్లో నికోటిన్‌ శరీరం నుంచి తొలగిపోతుంది.

48 గంటల్లో వాసన, రుచి ఇంద్రియాల పనితీరు మెరుగవుతుంది.

78 గంటల్లో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది.

9 నెలల లోపు దగ్గు 10% తగ్గిపోతుంది.

12 నెలల లోపు గుండె జబ్బుల ప్రమాదం 50% తగ్గిపోతుంది.

10 సంవత్సరాల లోపు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 50% తగ్గిపోతుంది. 


మానేసిన వెంటనే చీకాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర మొదలైన ఇబ్బందులు ఉంటాయి. కానీ తాత్కాలికమే అనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి మీ ఆరోగ్యంతో పాటు, మానవ మనుగడకు కారణమైన భూగ్రహాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే, వెంటనే పొగాకు వాడకాన్ని వదిలేయాలి. సిగరెట్‌ మానేయండి, భూమిని కాపాడండి. కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ఆస్వాదించండి.


డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ,

డైరెక్టర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్‌

రెనోవా సౌమ్య క్యాన్సర్‌ సెంటర్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌. 

కాంటాక్ట్‌ నెంబర్‌: 7799982495

Updated Date - 2022-05-31T17:52:00+05:30 IST