Abn logo
Jan 21 2021 @ 01:21AM

పనులపై పడగెత్తారు

  ఇళ్ల స్థలాల లేఅవుట్లలో మంచినీటి సరఫరా కాంట్రాక్టులపై వైసీపీ నేతల కన్ను

  జిల్లాలో 686 లేఅవుట్లలో రూ.30 కోట్లతో వర్కులకు అధికారుల కసరత్తు

  వీటిలో ఎక్కడికక్కడ నామినేషన్‌ పనులన్నీ కొట్టేసేందుకు నాయకుల స్కెచ్‌

  తమ వారికే ఈ వర్కులు దక్కేలా పలువురు ఎమ్మెల్యేలు, అనుచరులు పైరవీలు

  కాదంటే కుదరదని హెచ్చరికలు.. చేసేదిలేక తలొగ్గుతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు 

 అటు రూ.40 లక్షలలోపు కాంట్రాక్టు వర్కులను కాజేసేందుకూ వ్యూహాలు

  పేరుకు టెండర్లే అయినా తమవారికే వచ్చేలా చక్రం తిప్పుతున్న నేతలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) పేదల ఇళ్ల స్థలాలు జిల్లాలో అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి.    రెండు చేతులా ఆదాయం ఆర్జించే కామధేనువుల్లా మారాయి. ఇప్పటికే భూసేకరణ పేరుతో ఊరికి దూరంగా ఉన్న స్థలాలను అంటగట్టి అధిక ధరల రూపంలో కోట్లలో పరిహారం కొట్టేసిన పెద్దలు, ఆ తర్వాత స్థలాల చదునులోనూ కోట్లలో లాగేశారు. తాజాగా ఇప్పుడు లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి నీటి సరఫరా చేసే కాంట్రాక్టు      పనులపై పడగెత్తారు. రూ.30 కోట్లతో ఈ పనులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తుండగా, ఎక్కడకక్కడ వీటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా రూ.5 లక్షలలోపు వర్కులను నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చేలా నిబంధనలు ఉండడంతో చెలరేగిపోతున్నారు. ఆ పనులపై వాలిపోయి అన్నీ తమవారికే దక్కేలా పంతం పడుతున్నారు. చేసేదిలేక అధికారులు తలొగ్గుతున్నారు. రూ.40 లక్షల లోపు వర్కులకు టెండర్లు పిలవగా, వాటినీ చేజిక్కించుకునేందుకు పథకం సిద్ధం చేసుకున్నారు.ఇళ్ల స్థలాల ద్వారా పేదలకు జరిగే లబ్ధి సంగతేమోగాని, అధికార వైసీపీ నేతలకు మాత్రం ఇవి కోట్లు కురిపిస్తున్నాయి. అనతికాలంలోనే ఆర్థికంగా అంతె త్తుకు ఎదిగేలా చేస్తున్నాయి. ఈ పథకం కింద జిల్లాలో 3.84 లక్షల మంది లబ్ధిదారులను అర్హులుగా తేల్చగా, వీరందరికి 7,218 ఎకరాలు అవసరం అని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి పోను 5,362 ఎకరాలను రూ.2,566 కోట్లతో కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియలో ఎక్కడికక్కడ పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఊరికి దూరంగా తక్కువ ధరకు దొరికే భూములను బినామీల ద్వారా ముందే కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక  పరిహారం రాబట్టుకుని కోట్లకు కోట్లు కొట్టేశారు. మరికొన్ని చోట్ల స్వయంగా పలువురు వైసీపీ నేతలు తక్కువ ధరకు పలికే తమ భూములను ఇళ్ల స్థలా లకు విక్రయించి ఎక్కువ పరిహారం కొట్టేసి రెండు చేతులా సంపాదించారు. ఆ తర్వాత ఈ స్థలాల చదును పేరుతో ఓ కీలక మంత్రి సోదరుడి దగ్గర నుంచి పలువురు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు మళ్లీ కోట్లలో మింగేశారు. ఇప్పుడు తాజాగా లేఅవుట్లకు మంచినీటి సరఫరా కాంట్రాక్టు పనులపై కన్నేశారు. జిల్లాలో తొలిదశ కింద 1.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 686 లేఅవుట్లకు మంచినీటి సరఫరా కాంట్రాక్టు పనులకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టడానికి గ్రామీణ నీటి సరఫరాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రూ.5 లక్షలలోపు ఖర్చయ్యే 530 లేఅవుట్‌ల్లో కాంట్రాక్టు పనులను నామినేషన్‌ పద్ధతిలోను, రూ.5 లక్షల నుంచి రూ.40         లక్షలు, ఆపై రూ.2 కోట్ల వరకు ఖర్చయ్యే పనులను టెండర్ల విధానంలోను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు వైసీపీ నేతలు పలుచోట్ల ఈ నామినేషన్‌ వర్కులను దక్కించుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడికక్కడ తమ ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తెచ్చి ఈ పనులు తమకే వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో మండలంలో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే లేఅవుట్లు ఎన్ని ఉంటే ఆ కాంట్రాక్టులన్నీ తమకే దక్కేలా నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో వారి అవసరం ఉండడంతో ఎమ్మెల్యేలు సైతం ఈ కాంట్రాక్టు పనులన్నీ తమ వారికే ఇవ్వాలంటూ అధికారులుపై ఒత్తిళ్లు తెస్తున్నారు. చేసేదిలేక అధికారులు కూడా అప్పగిస్తున్నారు. ఇప్పటికే చాలా పనులు ఈ విధానంలో అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాస్తవానికి లేఅవుట్లలో ఇళ్ల         నిర్మాణం మొదలుపెట్టాలంటే నీళ్లు అవసరం. అందులోభాగంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు లేఅవుట్‌ మొత్తానికి ఆయా ఇళ్ల సంఖ్య నిర్మాణ సామర్థ్యానికి సరిపడే సామర్థ్యంతో బోరు నిర్మించాలి. ఆ బోరుకు మోటారు బిగించి పైపులైన్ల ద్వారా ఇళ్లు నిర్మించే ప్రదేశానికి నీటిని సరఫరా చేయాలి. అదే కోనసీమ ప్రాంతంలో బోర్లలో ఉప్పునీరు పడుతుంది కాబట్టి లేఅవుట్‌కు సమీపంలో కాలువలు, చెరువులు ఉంటే వాటిని గుర్తించి అక్కడి నుంచి నీటిని సరఫరా చేయాలి. ఈ పనులకు పెద్దగా అనుభవంతో సంబంధం లేకపోవడంతో అధికార పార్టీ నేతలు ఈ వర్కుల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.


ఆ పెద్ద వర్కులపైనా కన్ను...


రూ.5 లక్షలకుపైబడి రూ.2 కోట్ల వరకు తాగునీటి సరఫరా కాంట్రాక్టుకు సంబంధించిన లేఅవుట్‌ వర్కులు 156 ఉన్నాయి. వీటికి పని విలువ ఆధారంగా గ్రామీణ నీటిసరఫరాశాఖ ఈఈ, ఎస్‌ఈల ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. ఒక మండలంలో ఎన్ని పెద్ద లేఅవుట్‌లు ఉంటే అవన్నీ కలిపి ఒక ప్యాకేజీ కింద వీటిని ఎంపిక చేశారు. అయితే ఈ పనులపైనా కన్నేసిన అధికార పార్టీ నేతలు కొందరు తమ బినామీ లేదా అనుకూల కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు దాఖలు చేయిస్తున్నారు. వీటి ఖరారు జిల్లాస్థాయిలోనే కావడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు కొట్టేయవచ్చనే ధీమాతో ఇప్పటికే పలు కంపెనీలను రంగంలోకి దించారు. తద్వారా భారీగా మిగుల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement