పుష్కర ఏర్పాట్లపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-17T05:28:00+05:30 IST

మరో మూడు రోజుల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు సప్త నదుల సంగమేశ్వరంలో భక్తులకు సదుపాయాలు కల్పించలేదు.

పుష్కర ఏర్పాట్లపై నిర్లక్ష్యం
పూర్తి కాని దుస్తుల మార్పిడీ కేంద్రం పనులు

 సంగమేశ్వరంలో ముందుకు సాగని పనులు 

కొత్తపల్లి, నవంబరు 16: మరో మూడు రోజుల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు సప్త నదుల సంగమేశ్వరంలో భక్తులకు సదుపాయాలు కల్పించలేదు. పుష్కర పనులను పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం చేస్తున్న నిర్లక్ష్యంపై భక్తుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 16లోపు పుష్కర పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ సంగమేశ్వరంలో పనులు ముందుకు సాగడం లేదు. సోమవారం సాయంత్రం వరకు కపిలేశ్వరం వద్ద ఏర్పాటు చేసే తాత్కాలిక బస్టాండ్‌, పుష్కర భక్తుల విడిది కోసం రేకుల షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, అన్నదాన సత్రాల శిబిరాల ఏర్పాట్లు పూర్తి కాలేదు. కేవలం భూమి చదును చేసి బారికేడ్లు మాత్రం అక్కడే పడవేసి వెళ్ళారు. అలాగే కపిలేశ్వరం నుండి సంగమేశ్వరం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ మధ్యలో సుమారు 700 మీటర్ల మేర అటవీశాఖ అనుమతులు లేవని పనులు వదిలేశారు. పుష్కర ఘాట్ల వద్ద బారికేడ్లకు ఇనుప జాలర్ల ఏర్పాటు, దుస్తుల మార్పిడి పనులు కూడా చేయాల్సి ఉన్నా ఇంత వరకు ఆ దిశగా పనులు పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వరకు రోడ్డు మరమ్మతు పనులు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. సంగమేశ్వరంలో వీఐపీలకు ఏర్పాట్లు కూడా పూర్తి కాలేదు. 

Updated Date - 2020-11-17T05:28:00+05:30 IST