Ukraine ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో పనులకు బ్రేక్..

ABN , First Publish Date - 2022-05-09T17:39:35+05:30 IST

Ukraine ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో పనులకు బ్రేక్..

Ukraine ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో పనులకు బ్రేక్..

  • గ్రేటర్‌లోని స్టీల్‌ వంతెనలకు బ్రేక్‌..
  • యుద్ధం నేపథ్యంలో తగ్గిన స్టీల్‌ సరఫరా
  • ఆర్డర్లూ తీసుకోని సంస్థలు
  • దేశం నుంచి పెరిగిన ఎగుమతులు
  • స్థానికంగా సరఫరాకు స్టీల్‌ కంపెనీల అనాసక్తి
  • నెమ్మదించిన వంతెనల పనులు

హైదరాబాద్‌ సిటీ : ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం గ్రేటర్‌లోని అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోంది. ఖండాంతరాల్లో జరుగుతోన్న యుద్ధంతో ఇక్కడి స్టీల్‌ వంతెన పనులు రెండు వారాలుగా నిలిచిపోయాయి. చిన్నా, చితక పనులు మినహా కీలకమైన స్టీల్‌ అమర్చే పనులు జరగడం లేదు. దేశం నుంచి స్టీల్‌ ఎగుమతులు పెరగడం, దేశీయంగా లభ్యత తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు రూ.370 కోట్లతో, నల్గొండ ఎక్స్‌రోడ్‌ నుంచి ఐఎస్‌సదన్‌ మార్గంలో రూ.312 కోట్లతో స్టీల్‌ వంతెనల నిర్మాణాలను ఏడాది క్రితం జీహెచ్‌ఎంసీ పనులను ప్రారంభించింది. ఫౌండేషన్లు తవ్వడంతో పాటు కొంత మేర స్టీల్‌ పిల్లర్లు ఏర్పాటు చేశారు. మొదట్లో కొంత వేగంగా జరిగిన పనులు కొంత కాలంగా నెమ్మదించాయి. అవసరమైన మెటీరియల్‌ అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి.


పెరిగిన ఎగుమతి..

రహదారుల విస్తరణ అవసరం లేకుండా, తక్కువ ఆస్తుల సేకరణతో చేపట్టవచ్చనే యోచనతో స్టీల్‌ వంతెనల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. వంతెనల నిర్మాణంలో సాధారణ స్టీల్‌ కాకుండా.. ధృడంగా ఉండే ఈ-350 గేజ్‌ స్టీల్‌ వినియోగిస్తారు. రెండు ప్రాంతాల్లోని వంతెనల కోసం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి స్టీల్‌ ప్లేట్లు/స్టీల్‌ కొనుగోలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ముందుగానే కంపెనీలకు నిర్మాణ సంస్థలు వివరాలు పంపుతాయి. మొదట కొంత అడ్వాన్స్‌ చెల్లించి.. డెలివరీ సమయంలో పూర్తి మొత్తం చెల్లిస్తారు. నెల రోజులుగా స్టీల్‌ సరఫరా చేసే పరిశ్రమలు ఆర్డర్లు తీసు కోవడం లేదని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. ఎగుమతికి డిమాండ్‌ పెరగడం.. తద్వారా లాభాలూ అధికంగా వస్తుండడంతో స్థానికంగా ఆర్డర్లు తీసుకోవడంపై పరిశ్రమలు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని రెండు స్టీల్‌ ప్లాంట్లూ మూతపడ్డట్టు చెప్పారు. దీంతో నగరంలోని ప్రాజెక్టులకు స్టీల్‌ సరఫరా తగ్గింది.


ఉక్రెయిన్‌లో అధిక ఉత్పత్తి..

ప్రపంచంలో స్టీల్‌ అధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని పలు స్టీల్‌ ఉత్పత్తి కర్మగారాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొన్ని స్టీల్‌ పరిశ్రమలు యుద్ధ భయంతో మూసివేశారు. దీంతో ఉత్పత్తి లేక.. ఉక్రెయిన్‌ నుంచి స్టీల్‌ ఎగుమతి దాదాపుగా నిలిచిపోయింది. ఆ ప్రభావం నగర ప్రాజెక్టులపై కూడా కనిపిస్తోంది.


సర్కారు స్థాయిలో ప్రయత్నాలు..

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు నెమ్మదించడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. స్టీల్‌ కొరత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు చెప్పారు. వేసవిలో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో స్టీల్‌ అందుబాటులో లేని దృష్ట్యా.. వీలైనంత త్వరగా సమకూర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్టీల్‌ కంపెనీలతో నేరుగా చర్చించి.. అవసరమైన స్టీల్‌ సరఫరా చేసేలా చూడాలని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే సర్కారు తరపున స్టీల్‌ కంపెనీలతో చర్చలు మొదలైనట్టు సమాచారం.

Read more