ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల హెచ్చరిక..! రాత్రి పొద్దుపోయే వరకూ అలా చేస్తే..

ABN , First Publish Date - 2022-04-09T01:01:27+05:30 IST

మీరు ఉద్యో్గం చేస్తున్నారా.. రాత్రి పొద్దుపోయే వరకూ అదే పనిలో లీనమవుతుంటారా.. అయితే.. మీకో వార్నింగ్..! ఇలా చేస్తే మీ జీవితంలో సమతౌల్యం దెబ్బతి అసంతృప్తి పెరగొచ్చు. అయితే.. ఈ హెచ్చరిక చేసింది ఎవరో కాదు.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల!

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల హెచ్చరిక..! రాత్రి పొద్దుపోయే వరకూ అలా చేస్తే..

ఎన్నారై డెస్క్: మీరు ఉద్యోగం చేస్తున్నారా..? రాత్రి పొద్దుపోయే వరకూ అదే పనిలో లీనమవుతుంటారా..? అయితే.. మీకో వార్నింగ్..! ఇలా చేస్తే మీ జీవితంలో సమతౌల్యం దెబ్బతిని అసంతృప్తి పెరగొచ్చు. అయితే.. ఈ హెచ్చరిక చేసింది ఎవరో కాదు.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల! ఇప్పటికే పనిగంటలు పెరిగిపోయాయని, దీనికి తోడు రాత్రి పొద్దుపోయే వరకూ పనిలో మునిగిపోవడం అంత శ్రేయస్కరం కాదని ఆయన చెప్పారు. 


వర్క్ ఫ్రం హోం కారణంగా..  ఉద్యోగుల మధ్య సమన్వయం, సహకారాలు ఎలా ప్రభావితమవుతున్నాయో తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. సంస్థ రూపొందించిన టీమ్స్ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరిచేందుకు ఈ సర్వే జరిపించింది. కాగా.. సర్వే ఫలితాల గురించి  సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. రోజు మొత్తంలో ఉద్యోగుల ఉత్పాదకత  పలుమార్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని చెప్పారు. అయితే.. సాయంత్రం సమయాల్లో మూడోసారి వారి పనితీరు పతాకస్థాయికి చేరుతుందన్నారు. ‘‘సాధారణంగా కార్యాలయాల్లో ఉత్పాదకతను.. ఉద్యోగుల మధ్య సమన్వయం, సహకారం వంటి కోణాల్లో విశ్లేషిస్తుంటాం. అయితే.. ఉద్యోగుల శ్రేయస్సు కూడా వారి పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి వల్ల కలిగే పరిణామాల గురించి మనకు తెలిసిందే.’’ అని ఆయన అన్నారు. 


సాటి ఉద్యోగులతో ఎలా మెలగాలి, ఆఫీసులో స్నేహపూర్వక వాతావరణాన్ని ఎలా నెలకొల్పాలి అనే అంశాలకు కీలకమైన సాఫ్ట్ స్కిల్స్‌(భావోద్వేగపరమైన నైపుణ్యాలు) ఉద్యోగులకు అలవడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేనేజ్‌మెంట్ విధానాల్లోనూ ఈ దిశగా మార్పులు రావాలన్నారు. ‘‘వారాంతంలో కంపెనీ సీఈఓ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌కు స్పందించకపోయినా పరవాలేదని ఉద్యోగులు భావించే వాతావరణం సృష్టించాలనేది నా అభిప్రాయం’’ అని సత్య నాదేళ్ల తెలిపారు. 

Updated Date - 2022-04-09T01:01:27+05:30 IST